● రాజధాని అభివృద్ధి కోసం గ్రావెల్ తవ్వకాలకు ప్రతిపాదనలు
● పర్యావరణానికి హాని కలిగించేలా ప్రభుత్వ నిర్ణయం
● ఆందోళనలో ఐదు గ్రామాల ప్రజలు
నూజివీడు: నూజివీడు మండలంలోని బోర్వంచ రెవెన్యూ పరిధిలోని కొన్నంగుంట, కొత్తూరు గ్రామాల వెంబడి ఉన్న నల్ల గట్టుకు రాష్ట్ర ప్రభు త్వం ఎసరు పెట్టింది. రాజధాని అభివృద్ధికి గ్రావెల్ అవసరమంటూ నల్లగట్టు నుంచి గ్రావెల్ తవ్వి రాజధాని ప్రాంతానికి తరలించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో నల్లగట్టు రూపురేఖలు కోల్పోనుంది. నల్ల గట్టును తవ్వడం వల్ల పర్యావరణ విధ్వంసం జరిగినట్టే. కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడమే తరువాయి నూ జివీడు తహసీల్దార్ సర్వే నంబర్ 53లో దాదాపు 50 ఎకరాలు గ్రావెల్ తవ్వడానికి అనుకూలంగా ఉందని ప్రతిపాదనలు ఆగమేఘాల మీద పంపించారు. అలాగే బోర్వంచ గ్రామ సర్పంచ్‌పై ఒత్తిడి తీసుకువచ్చి పంచాయతీ తీర్మానాన్ని సైతం తీసుకున్నారు.
రాజధాని ప్రాంతానికి గ్రావెల్ తరలింపు కోసమని..
రాష్ట్ర రాజధాని ముంపు ప్రాంతం కావడంతో అక్కడ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలను మెరక చేసేందుకు లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అవసరం. ఈ మేరకు నూజివీడు ప్రాంతంలోని కొండలను సీఆర్‌డీఏ అధికారులు గతంలో పరిశీలించి వెళ్లారు. అనంతరం ఏలూరు కలెక్టర్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపేందుకు కలెక్టర్ తహసీల్దార్ నుంచి వివరాలను తీసుకున్నారు.