
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
విద్యార్థి విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
తాడేపల్లిగూడెం: విద్యార్ధి విజయాల్లో తల్లిదండ్రులదే కీలకపాత్ర అని శశి విద్యాసంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ అన్నారు. శశి విద్యాసంస్థలో ఆరు నుంచి పదో తరగతి, ఇంటర్‌లో చేరబోయే విద్యార్థులకు ఐఐటీ, నీట్‌పై శనివారం ఏర్పాటుచేసిన అవగాహన సభలో ఆయన మాట్లాడారు. సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ఐక్యూ ఆధారంగా మార్కులు, ర్యాంకులు సాధిస్తారని.. ఈ విషయంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదన్నారు. గొప్పవాళ్లంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారేనని, వారి స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వక్తలు కోరారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా క్రాంతి సుధ, డైరెక్టర్ బూరుగుపల్లి రాధారాణి, క్యాంపస్ ఇన్‌చార్జి కె.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం