
అడవి మానులే దేవుళ్లు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం మండలంలో ఉన్న లక్ష్మీపురంలో నాలుగు రకాల చెట్ల మానులు అడవి నుంచి తీసుకొచ్చి రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుడిగా ఏర్పాటు చేసుకొని వాటినే పూజిస్తూ వస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో రామాలయం ఏర్పాటు చేసినా తాము చెట్లనే దేవుళ్లుగా కొలుస్తామంటూ గిరిజనులు చెబుతున్నారు. బుట్టాయగూడెం మండలంలోని లక్ష్మీపురంలో 50 కుటుంబాలకు చెందిన నాయక్‌పోడు గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామ ఇలవేల్పుగా గంగానమ్మ అమ్మవారిని పూజలు చేసే గిరిజనులు తదుపరి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడినే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ చిత్రపటాలు, విగ్రహాలు ఉండవు. శ్రీరామనవమికి ముందు రోజు గ్రామస్తుల్లో పెద్దలు, యువకులు అడవిలోకి వెళ్లి 4 రకాల చెట్ల మానులు సేకరించి వాటిని ప్రత్యేక రూపంలో మలిచి ఘనంగా పూజలు చేస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
మానులే దేవుళ్లు
శ్రీరామనవమికి ముందు ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్న పెద్దలు, యువకులు అడవికి వెళ్ళి చెండ్ర, పాల, ఊడిగ, రావి చెట్ల మానులను సేకరిస్తారు. శ్రీరాముడికి చెండ్ర, సీతాదేవికి పాల, లక్ష్మణుడికి ఊడిగ, ఆంజనేయుడికి రావి చెట్టు తీసుకువచ్చి వాటిని చెక్కించి గ్రామం మధ్యలో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు సీతారామ కల్యాణాన్ని ఘనంగా జరుపుతున్నారు.
సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామిగా మానులకే పూజలు
నాయక్ పోడు గిరిజనుల తరతరాల నాటి ఆచారం
అడవి మానులే దేవుళ్లు
అడవి మానులను దేవుళ్లుగా పూజిస్తాం. ఈ ఆచారం మా పూర్వీకుల నుంచీ వ స్తోంది. దానినే మేము ఆచరిస్తున్నాం. ఏటా శ్రీరామనవమికి ముందు అడవికి వెళ్లి నాలుగు రకాల అడవి చెట్లను తీసుకొచ్చి, వాటిని చెక్కి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిగా ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తాం, నవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తాం
గురువింద కొర్రయ్య, ఉత్సవ కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం, బుట్టాయగూడెం మండలం
నాటి ఆచారాలతో శ్రీరామనవమి వేడుకలు
లక్ష్మీపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను తరతరాల నాటి ఆచారాలతో నిర్వహిస్తాం. అడవిలో 4 రకాల చెట్లను తీసుకొచ్చి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడిగా కొలుచుకోవడం మాకు ఆనవాయితీ. అదే మాకు జయం, మా గ్రామానికి సురక్ష. ఈ సంప్రదాయాన్నే మేము కొనసాగిస్తాం.
– కపిలవాయి హరిసూర్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం, బుట్టాయగూడెం మండలం

అడవి మానులే దేవుళ్లు

అడవి మానులే దేవుళ్లు

అడవి మానులే దేవుళ్లు