
నిర్వాసితులకు నిరాశేనా?
45 కాంటూర్ ప్రజలకు ఉపాధి ఎలా?
ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో ముంపు పేరుతో దాదాపు మండలంలోని అన్ని గ్రామాల్లో 70 శాతం భూములను ప్రభుత్వం సేకరించి పరిహారం చెల్లించింది. దీంతో ఆ భూములు ప్రభుత్వ పరమయ్యాయి. ఆర్ అండ్ ఆర్ పరిహారం చెల్లించకపోవడంతో ఆ భూములను నేటివరకు భూ యజమానులే సాగు చేసుకున్నారు. కొంతమంది పెద్దరైతులు వారి భూములను ఇతరులకు జామాయిల్ సాగుకు కౌలుకు ఇచ్చారు. జామాయిల్ సాగుతో ఇప్పటికే ఉపాధి లేక పేదలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం పరిహారం ఇస్తుందిలే అన్న ఆశతో ఇన్నాళ్లు కాలాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పుడు 41 కాంటూర్ వరకే పరిహారం చెల్లించి 45 కాంటూర్‌కు పరిహారం చెల్లింపు విషయమై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో పరిహారం ఇచ్చే వరకు తమకు ఉపాధి ఎలా అని 45 కాంటూర్‌కు చెందిన చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు.
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలను అన్నివిధాల ఆదుకుంటామని ఓ వైపు ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. బహిరంగ వేదికల సాక్షిగా ప్రభుత్వ పెద్దలు నిర్వాసితులనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం సర్వం త్యాగం చేస్తున్న త్యాగధనులంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారే తప్ప నిర్వాసితుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడంలేదు. దీంతో ప్రభుత్వం నుంచి ఎప్పటికి సమాధానం లభిస్తుందోనని విలీన మండలాల నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉంటుందా? అన్న అనుమానం నిర్వాసితులకు లేకపోలేదు.
మిగులు భూముల మాటేంటి?
ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి 2027 కల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి నిర్వాసితులకు పరిహారం చెల్లించి పునరావాస కాలనీలకు తరలిస్తామని వ్యాఖ్యానించారు. వివిధ గ్రామాలలోని భూములకు పరిహారం చెల్లించగా ముంపులో లేని భూములు(మిగులు భూముల) విషయమై ప్రభుత్వం నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేస్తుందన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. దీంతో అరకొర పరిహారం తీసుకుని మిగులు భూములు వదులుకుని నిర్వాసిత కాలనీలకు ఎలా వెళ్లేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.
పునరావాస కాలనీల్లో ఉపాధి ఎలా?
పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు వ్యవసాయమే ఆధారంగా జీవించిన నిర్వాసితులకు జీవనోపాధి ఎలా కల్పిస్తుందన్న విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలించి వదిలేస్తే తమ భవిష్యత్తు ఏంటని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.
45 కాంటూర్ వరకు నిర్మాణం ఉంటుందా?
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 41.15 కాంటూర్ వరకే పరిమితం అంటూ ఓ పక్క కేంద్ర ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయమై పత్రికలు ప్రచురించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 45 కాంటూర్ వరకు నిర్మిస్తామంటూ నమ్మబలుకుతుంది. 45 కాంటూర్ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం లేని మాటలు చూస్తే అసలు 45 కాంటూర్ నిర్మాణం ఉంటుందా, లేదా అన్న ప్రశ్న నిర్వాసితులను వేధిస్తోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ప్రశ్నలకు సమాధానాలు కరువు
తరలించే నాటికి 18 ఏళ్లుంటే పరిహారం ఇస్తారా?
ఆర్ అండ్ ఆర్ పరిహారానికి సంబంధించి 2017 జూన్‌ను కటాఫ్ తేదీగా ప్రకటించారు. అప్పటికి 18 ఏళ్లు నిండిన వారందరికి ప్రభుత్వ ఆర్ అండ్ ఆర్ పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని 2025లో అంటే 7 సంవత్సరాల తరువాత చెల్లించింది. దీంతో ఆ కటాఫ్ డేట్ కారణంగా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. దీంతో నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే నాటికి 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధికి భూమి చూపించాలి
ముంపు పేరుతో భూములను సేకరించిన ప్రభుత్వం 45 కాంటూర్‌లోని నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారం ఎప్పుడు చెల్లిస్తుందన్న విషయమై స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 45 కాంటూర్ నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపాఽధి చూపించే బాధ్యత ప్రభుత్వానిదే. ఉపాధి నిమిత్తం సాగు భూమి చూపించాలి.
–కురాకుల బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా అధ్యక్షుడు
మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలి
మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటే తప్ప నిర్వాసితులకు న్యాయం జరగదు. ఇప్పటికే 45 కాంటూర్ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్వాసితులు అయోమయంలో ఉన్నారు. వారికి న్యాయం జరగాలంటే మండలాన్ని యూనిట్ గా తీసుకుని, పునరావాస కాలనీలకు తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు పరిహారం చెల్లించాలి.
– మైసాక్షి వెంకటాచారి, సీపీఐ మండల కార్యదర్శి, కుక్కునూరు

నిర్వాసితులకు నిరాశేనా?

నిర్వాసితులకు నిరాశేనా?