
నాటు తుపాకులతో ముగ్గురి అరెస్ట్
బుట్టాయగూడెం: గుబ్బల మంగమ్మ గుడి సమీపంలోని అటవీప్రాంతంలో నాటు తుపాకులతో కనిపించిన ముగ్గురు గిరిజనులను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి మామిడిశెట్టి మురళి తెలిపారు. నిందితులను కావిడిగుండ్ల, కంట్లం బేస్ క్యాంప్ సిబ్బంది పట్టుకుని, వారి వద్ద ఉన్న రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులో ఉన్న బుట్టాయగూడెం మండలం కామవరంనకు చెందిన రవి, మంగబాబు, నవీన్‌గా గుర్తించినట్లు చెప్పారు. అడవి జంతువులను నాటు తుపాకులతో వేటాడేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ముగ్గురు మా సిబ్బందికి పట్టుబడ్డారని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
తాడేపల్లిగూడెం: భీమవరం రైల్వే సర్కిల్‌లో పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సెల్‌ఫోన్లు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను గూడెం రైల్వే పోలీసు స్టేషన్‌లో విలేకర్లకు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సింగవరం గ్రామానికి చెందిన ఉలవలపూడి దుర్గారావు అనే వ్యక్తి రైళ్లలో పలు చోరీలకు పాల్పడ్డాడు. విజయవాడ రైల్వే డీఎస్పీ జి.రతన్‌రాజు ఆదేశాల మేరకు భీమవరం రైల్వే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.సోమరాజు, గూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు టీమ్‌గా ఏర్పడి నిందితుడిని నిడదవోలు కొత్త ఫ్లై ఓవర్ వంతెన వద్ద పట్టుకున్నారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తు 18 సెల్‌ఫోన్లు, సుమారు 30 గ్రాముల బంగారం వెరశి మొత్తం రూ.3 లక్షల 70 వేల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
ఐటీఐ ట్రేడ్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ఉండి: రాష్ట్ర ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేటుగా ఐటీఐ ఆల్ ఇండియా ట్రేడ్ పరీక్ష రాసేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్ వీ శ్రీనివాసరాజు తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో అందజేయాలన్నారు. వివరాలకు 96760 99988 నంబర్లో సంప్రదించాలని కోరారు.

నాటు తుపాకులతో ముగ్గురి అరెస్ట్