
అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
ఏలూరు టౌన్: ఏలూరు శాంతినగర్ ఏడో రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ ప్రాంతంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. అపార్ట్‌మెంట్‌లో ఏం జరుగుతుందో అర్థంకాక జనం కిందికి పరుగులు తీశారు. అపార్ట్‌మెంట్‌లోని ఫోర్‌బీ ప్లాట్‌లో మంటలు చెలరేగటం, మరోవైపు దట్టమైన పొగతో 5వ అంతస్తులోని వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతూ బయటకు రాలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. అప్పటికే ప్లాట్‌లోని వస్తువులు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. బాధితులను అగ్నిమాపక శాఖ సిబ్బంది సాహసోపేతంగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సీహెచ్ రత్నబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శాంతినగర్ ఏడో రోడ్డు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల పక్కన హిమనీ అపార్ట్‌మెంట్స్ ఉంది. శనివారం ఉదయం ఫోర్త్ బీ ప్లాట్‌లోని టీవీ ప్యానెల్ బోర్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బెడ్‌రూమ్, హాలు, కిచెన్‌లోకి వ్యాపించాయి. ఆ సమయంలో ప్లాట్ యజమాని శ్రీకాంత్, కుటుంబ సభ్యులు ఇంట్లో లేదు. దట్టమైన పొగతో కారిడార్, మెట్ల ప్రాంతం పొగ కమ్మేసింది. 5వ అంతస్తులోని వృద్ధులు పీ.రామకృష్ణ (74), ఎస్.విజయలక్ష్మి (82) బయటకు రాలేక చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది వారిని చేతులపై ఎత్తుకుని కిందికి తీసుకువచ్చారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది గంటకు పైగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.15 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సేవలను అపార్ట్‌మెంట్ వాసులు అభినందించారు.

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం