
బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పనిచేస్తుందని ఆ సంఘ నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. మంగళవారం స్థానిక అంబిక ఫ్లేవర్స్ ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ బ్రాహ్మణులు సామాజికంగా అభివృద్ధి చెందిన వారి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థికంగా అట్టడుగున ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడానికి రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. అలాగే బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందించాలని, వ్యాపారాలు చేసుకోవడానికి రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హెచ్‌కే మోహనరావు, కోశాధికారిగా పులిపాక ప్రసాద్, అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా సత్యవాడ దుర్గా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన బ్రాహ్మణులు గండ్లూరి దత్తాత్రేయ శర్మ, గుండు రామనాథ శాస్త్రి, బులుసు అపర్ణ, ఓరుగంటి వెంకట రమణ, శంకరమంచి సుబ్రహ్మణ్య శాస్త్రి, గోపాలుని హరిహరరావు, గామోజీ అపర్ణ ప్రసాద్, సూరంపూడి వీరభద్రరావు, విష్ణుదాస్ శ్రీకాంత్‌లను ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.