
వరిసాగులో యంత్రాల జోరు
పెంటపాడు: వరి సాగులో రైతులు కొత్తవంగడాలు వినియోగించడంతో పాటు వినూత్న రీతిలో సాగు చేస్తున్నారు. దీనిలో భాగంగా యంత్రాల వినియోగం ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. రైతుల ఆలోచనలకు తగ్గుట్టు యంత్రాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులు మినహా మిగిలిన రైతులు యంత్రాలు కొనుగోలు చేసి వరి సాగులో జోరుగా వాటిని వినియోగిస్తున్నారు. మరికొందరు రైతులు యంత్రాలను అద్దెకు తీసుకొంటూ సాగు చేస్తున్నారు. వరి సాగు ప్రారంభంలో ట్రాక్టర్లతో దమ్ములు చేయడంతో పాటు వరి నాట్లు వేయడంలోనూ యంత్రాలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వరి కోతలు సమయం కావడంతో యంత్రాల సాగు జోరుగా ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు అనుగుణంగా రాత్రి పగళ్లు పొలాల్లో బీజీగా గడుపుతూ యంత్రాల సాయంతో నూర్పులు చేపడుతున్నారు. కాగా ప్రస్తుతం దాళ్వా మాసూళ్ల విషయంలో రైతులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో సరిగ్గా కోతల సమయంలోనే వర్షాలు కురుస్తూ, ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో యంత్రాల వినియోగం రైతులకు మేలు చేస్తోంది.
వినియోగంపై ఆసక్తి
తక్కువ సమయంలో ఎక్కువ పని చేసేందుకు అలాగే పెట్టిన రాబడి రాబట్టుకొనేందుకు రైతుల యంత్రాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎకరా సాగు చేసేందుకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అదే యంత్రాలు ఉపయోగించి సాగు చేస్తే రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు అవుతోంది. అలాగే ప్రస్తుతం ఎకరం వరి కోత కూలీలకు రూ.5500 కాగా, అదే యంత్ర సాయంతో రూ.2400 ఖర్చు అవుతోంది. దీంతో సగానికి పైగా ఖర్చు తగ్గుతోంది. ఏళ్ల తరబడి వ్యవసాయ పనులను నమ్ముకున్న కూలీలకు యంత్రం వల్ల ఉపాధి లేకుండా పోయింది. దీని వల్ల వారు పనుల కోసం వలసబాట పడుతున్నారు. కొంతమంద కూలీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకొంటూ ఉపాధి పొందుతున్నారు.
యంత్రాలపైనే ఆసక్తి చూపుతున్న రైతులు
ప్రస్తుతం యంత్రాలతో ముమ్మరంగా వరికోతలు
ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీలు
సమయం, ఖర్చు ఆదా
ప్రస్తుతం వరికొతలను యంత్రాల ద్వారా సాగు చేస్తున్నారు. తక్కువ సమయంతో పాటు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. దీంతో మాకు కొంత పెట్టుబడి మిగులుతుంది. ప్రస్తుతం దాళ్వా కోతల సీజన్ కావడం తో యంత్రాలతో మాసూళ్లు చేపడుతున్నాం.
– తోరం సుబ్బన్న రైతు, పడమరవిప్పర్రు
పెట్టుబడి తగ్గుతుంది
ప్రసుత్త వరి కొతలను యంత్రాల సాయంతో చేయడం వల్ల అనుకున్న సమయాని కంటే ముందే పని పూర్తవువుతోంది. ఎకరా కోత నూర్పు చేయడానికి రూ.3600 ఖర్చు అవుతోంది. అదే కూలీలను పెట్టి కోస్తే రూ.5 వేలు అవుతుంది.
– పాలా గణపతి, కొండేపాడు

వరిసాగులో యంత్రాల జోరు

వరిసాగులో యంత్రాల జోరు