
భూసేకరణ వేగవంతం చేయాలి
ఇన్‌చార్జి కలెక్టర్ ధాత్రిరెడ్డి
ఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జాతీయ రహదారుల నిర్మాణ, భూసేకరణ అంశాలపై ఇన్‌చార్జ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించి భూసేకరణ ద్వారా సేకరించిన భూములలో కొందరు రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని వెంటనే చెల్లించి భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. పామర్రు–దిగమర్రు 165 జాతీయ రహదారిలో కై కలూరు మండలం గోనేపాడు, తదితర గ్రామాలలో భూసేకరణ పనులను సంబంధిత రైతులతో మాట్లాడి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.