
కోకో ధరలపై ఒప్పంద ప్రకటనకు డిమాండ్
ఏలూరు (టూటౌన్): వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజల ధరల ఒప్పంద ప్రకటన చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని కోరుతూ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. రైతుల సంఘం ప్రతినిధి బృందంతో ఎంపీ చర్చించారు. కోకో రైతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధర రాకపోవడంతో కోకో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకో గింజలకు రూ.750కు పైగా ధర ఉన్నా రూ.450 నుంచి రూ.550 మాత్రమే ఇస్తున్నారన్నారు. పాత గింజలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ నెల 3న వ్యవసాయ శాఖ మంత్రి సమక్షంలో కంపెనీలు, ట్రేడర్లతో సమావేశం జరిగిందని.. ఈ నెల 7 లోపు ధరల నిర్ణయ ప్రకటన చేస్తామని చెప్పారన్నారు. ఇంతవరకు నిర్ణయం కాకపోవడంతో కంపెనీలు అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాత గింజలకు కిలోకు రూ.300, కొత్త గింజలకు కిలోకు రూ.550 అంటూ ప్రచారం చేయడంతో రైతులు మరింతగా నష్టపోతున్నారన్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధర ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ కోకో రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.