
శ్రీవారికి కాసుల పంట
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదును స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం లెక్కించారు. చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. 20 రోజులకు నగదు రూపంలో రూ. 1,93,36,657, 326 గ్రాముల బంగారం, 4.149 కిలోల వెండితో పాటు విదేశీ కరెన్సీ లభించినట్టు ఈఓ సత్యనారాయణమూర్తి తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.20 వేలు లభించాయన్నారు. ఆల య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
25న ఆర్డీఓ విచారణ
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గంధం శాంతకుమారి గత నెల 30న మరణించిన ఘటనపై ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్‌ను కలెక్టర్ కె.వెట్రిసెల్వి చారణ అధికారిగా నియమించారు. ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఏలూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ విచారణ నిర్వహించనున్నారు.
టీచర్లు కొత్త మెడికల్ సర్టిఫికెట్లు పొందాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీ టీచర్స్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ చట్టం–2025 ప్రకారం మెడికల్ సర్టిఫికెట్ ద్వారా ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పాయింట్లు పొందడానికి అర్హులైన ఉపాధ్యాయులు కొత్త మెడికల్ సర్టిఫికెట్లు పొందాలని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో సూచించారు. పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలో హెచ్ ఎంలు, ఉపాధ్యాయులు సర్టిఫికెట్లు పొందడానికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏలూరు జీజీహెచ్‌లో ఈనెల 24 నుంచి 26 వరకు శిబిరం కొనసాగుతుందని తెలిపారు.
మహిళల అక్షరాస్యతకోసం ‘ఉల్లాస్’
ఏలూరు(మెట్రో): జిల్లాలో నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులను చేసేందుకు నిర్వహించే ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 వరకు సర్వే చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరక్షరాస్యులకు వచ్చేనెల 5 నుంచి సెప్టెంబరు 18 వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబరు నెలాఖరులో వారికి తుది పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 20,199 మంది మహిళలను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.
సచివాలయాల్లో నీటి తీరువా పన్నులు
ఫసలీ వరకు నీటి తీరువా పన్నులను రైతులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చెల్లించవచ్చని ఇన్‌చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు.
కాలువలు సుందరీకరణకు..
‘స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌లో భాగంగా కాలువల శుభ్రత, సుందరీకరణ’ కార్యక్రమంలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఏ లూరు ఆర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఈఎల్‌యూడీఏ) వైస్ చైర్మన్, ఇన్‌చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ఈనెల 19న ఏలూరు రైల్వేస్టేషన్ వద్ద కృష్ణా కాలువ వద్ద సుందరీకరణ పనులు ప్రారంభిస్తామన్నారు.
మానవత్వం చాటిన కారుమూరి
తణుకు అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తన సిబ్బందితో సపర్యలు చేయించి సురక్షితంగా ఆస్పత్రికి పంపించిన సంఘటన తణుకు మండలం వేల్పూరులో గురువారం చోటుచేసుకుంది. వేల్పూరుకు చెందిన వృద్ధుడు టీవీఎస్ మోపెడ్ పై ఓ మహిళను ఎక్కించుకుని తణుకు వైపునకు వస్తుండగా తణుకు వైపు నుంచి వస్తున్న కారు ఆయన్ను ఢీకొట్టింది. ఇదే సమయంలో అటుగా వెళుతున్న కారుమూరి స్వల్పంగా గాయపడ్డ వృద్ధుడిని సముదాయించి ప్రమాదానికి కారకులైన కారులో ఉన్న వారితో వృద్ధుడిని ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సిందిగా చెప్పి అదే కారులో ఎక్కించి పంపించారు. పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్ ఉన్నారు.