ప్రొటోకాల్‌ పాటించడం లేదు | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ పాటించడం లేదు

Published Fri, Apr 18 2025 1:42 AM | Last Updated on Fri, Apr 18 2025 1:42 AM

ప్రొట

ప్రొటోకాల్‌ పాటించడం లేదు

ఏలూరు (టూటౌన్‌): అధికారులు కనీసం ప్రొటోకాల్‌ పాటించడం లేదని, జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని పలువురు వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీలు మండిపడ్డారు. తామేమీ ప్రభుత్వ పెద్దలచే నామినేట్‌ అయిన సభ్యులం కాదని ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులమని గుర్తు చేశారు. గురువారం జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ సర్వ సభ్యసమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ పి.థాత్రీ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్‌, ఆరిమిల్లి రాధాకృష్ణ, చిర్రి బాలరాజు,, జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్లు టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి, ఎస్‌.చిన్న రాముడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గడువులోగా మంచినీటి చెరువులను నింపాలి

ఉమ్మడి జిల్లాలో పంట కాలువలను ఈ నెల 22తో కట్టివేస్తున్నందున అన్ని మంచినీటి చెరువులను గడువులోగా నీటితో నింపుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ అధికారులను సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా సమావేశంలో ఎకరాకి 50 బస్తాల వరకే ధాన్యం కొనుగోలు చేయడంపై పలువురు డెల్టా జెడ్పీటీసీలు వ్యవసాయాధికారులను నిలదీశారు. ఎటువంటి కోతలు లేకుండా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. అలాగే తమ మండలంలో చేపట్టే పనుల ప్రతిపాదనలు సమర్పించినా జెడ్పీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయ్‌బాబు నిలదీశారు. తాము ప్రతిపాదించిన పనులను టేక్‌అప్‌ చేయకండా ఎవరో చెప్పిన పనులను మాకు తెలియకుండా ఎలా చేపడతారు అంటూ ప్రశ్నించారు.

అందరినీ సమానంగా చూడాలి

ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వస్తే పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ వేదిక మీదకు ఆహ్వానించారని అదే తాను వస్తే సాధారణంగా పైకి ఆహ్వానించారని ఇదెక్కడి పక్షపాతమంటూ ప్రశ్నించారు. జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గత 18 నెలలుగా వేతనాలు రావడం లేదని, వీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పీఎంజీపీవైలో 2023–24లో 94 దరఖాస్తులు అందగా వాటిలో 34 మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయని, 2024–25లో 84 దరఖాస్తులు అందగా 48 మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయన్నారు. ఇలా అయితే ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

ఇన్‌పుట్‌ సబ్సీడీని విడుదల చేసేలా చూడండి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రైతులకు త్వరగా ఇన్‌పుట్‌ సబ్సిడీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ మూడు జిల్లాలకు సంఖ్యా బలం ఆధారంగా సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయించగా తాడేపల్లిగూడెంకు మాత్రం రూ.7 కోట్లు కేటాయించారని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఓహెచ్‌ఆర్‌ఎస్‌ ట్యాంకులు మంజూరైనా పనులు మొదలు కాక తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోయారు

ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సి ఉంది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలో కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నా హాజరైంది మాత్రం ముగ్గురే. అందులో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, పోలవరం ఎమ్మెల్యే చిర్రిబాలరాజు వచ్చామా.. నాలుగు పలుకులు పలికామా.. అన్నట్లు పలికి వెళ్లిపోయారు. మధ్యలో వచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాథాకృష్ణ సభ పూర్తయ్యేవరకు ఉన్నారు.

తామేమి నామినేట్‌ సభ్యులం కాదని జెడ్పీటీసీల మండిపాటు

వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం

సమావేశానికి ప్రజాప్రతినిధుల గైర్హాజరు

ప్రొటోకాల్‌ పాటించడం లేదు 1
1/1

ప్రొటోకాల్‌ పాటించడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement