
అలరిస్తున్న నాటిక పోటీలు
భీమవరం: భీమవరం కళరంజని నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. శ్రీసోమేశ్వర, జనార్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఈ నాటిక పోటీలో మూడో రోజు శుక్రవారం రాత్రి రెండు నాటికలు ప్రదర్శించారు. అనంతరం హైదరాబాదుకు చెందిన ప్రముఖ రంగస్థల నటీమణి ఎస్.మాధవికి మహానటి సావిత్రి స్మాకర పురస్కారం, కళారంజని యువతేజం పురస్కారాన్ని హైదరాబాద్‌కు చెందిన మంజునాథ్‌కు అందించారు. సమాజంలోని కుటుంబాలు, ప్రేమ, ఆదరణ కన్నా ఆస్తుల కోసం, హక్కుల కోసం కుటుంబాల మధ్య జరుగుతున్న సంఘర్షణలు ప్రతిరూపంగా సాగిన హక్కు నాటిక ఆకట్టుకుంది. రెండో నాటికగా సౌజన్య కళాస్రవంతి వారి దేవరాగం ప్రదర్శించారు.
దాడి కేసులో ముగ్గురి అరెస్టు
ముదినేపల్లి రూరల్: వ్యక్తిపై దాడి ఘటనలో స్థానిక పోలీసులు ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సింగరాయపాలెంకు చెందిన చేబోయిన పోతురాజుపై అదే గ్రామానికి చెందిన బి.రాధాకృష్ణ, కుమారులు కుమారస్వామి, ఏడుకొండలు గత నెల 2 దాడి చేసి గాయపరిచినట్లు చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ నిమిత్తం తరలించినట్లు చెప్పారు.