
నూక శాతం పేరుతో రైతులకు ఇబ్బందులు
ఏలూరు (టూటౌన్): ధాన్యంలో నూక శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, కృష్ణా డెల్టా పరిధిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పెసలు అమ్మిన రైతులకు బకాయిలు చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. ఏలూరు అన్నే భవనంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం తడిచినా, అధికంగా ఆరబెట్టినా ఒక వైపు తేమ శాతం, మరో వైపు నూక శాతం వంటి నిబంధనలు రైతులకు శాపంగా మారాయన్నారు. కొనుగోలు నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశారు. రైతులు పెసలు అమ్మి 20 రోజులు గడించిందని, ప్రభుత్వం వెంటనే సొమ్ములు విడుదల చేయాలని కోరారు. నాయకులు చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు పాల్గొన్నారు.
ఉపాధి రుణాలకు దరఖాస్తులు
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఎస్సీల స్వయం ఉపాధి యూనిట్లకు రాయితీతో కూడిన రుణాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,111 మంది లబ్ధిదారులకు రూ.46.44 కోట్లు రుణాలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ కింద రూ.25.77 కోట్లు మంజూరు చేసిందన్నారు. అభ్యర్థులు మే 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆర్థిక స్వావలంబన కోసమే పథకాలు
ఏలూరు (టూటౌన్): అట్టడుగు ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయని ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. నగరంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో ఉమ్మడి జిల్లాలో పథకాలు అమలుచేసే అధికారులతో సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ సంస్థల సమన్వయంతో పథకాలు అమలు చేసి ప్రజల సంక్షేమం, సమాజాభివృద్ధికి కృషిచేయాలన్నారు. ప్రజలు పథకాలను పొందటంలో న్యాయ సమస్యలు ఎదురైతే న్యాయ సేవాధికార సంస్థలను 08812 22455 లేదా 15100 టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఏలూరు ఆర్డీఓ అంబరీష్ మాట్లాడుతూ సాంకేతిక లోపాలతో తాత్కాలికంగా కొందరికి పథకాలు అందడం లేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. భీమవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులను ఎంపిక చేసి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్తున్నామన్నారు. లీగల్ లేడి చీఫ్ రేగలే డిఫెన్స్ కౌన్సిల్ పీఎన్‌వీ మునీశ్వరరావు, న్యాయవాది పి.రత్నరాజు అధికారులు పాల్గొన్నారు.
పథకం ప్రకారం బీజేపీ ఆరోపణలు
టీడీపీ నేతల ఆగ్రహం
లింగపాలెం: బీజేపీ మండల నాయకులు ఒక పథకం ప్రకారమే విలేకరుల సమావేశం పెట్టి తమపై ఆరోపణలు చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ నేతలు విలేకరుల సమావేశంలో చేసిన విమర్శలపై శనివారం వారు స్పందించారు. మండలంలోని ధర్మాజీగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమిలో భాగమైన బీజేపీకి చెందిన కొందరు నాయకులు టీడీపీ నాయకులపై నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. టీడీపీ మండలాధ్యక్షుడు గరిమళ్ల చలపతిరావు, సీనియర్ నాయకుడు గుత్తా సాయి సత్యవరప్రసాద్ (పెదబాబు)లపై రేషన్, మట్టి మాఫియా, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించడం సరికాదన్నారు. పార్టీ అధిష్టానం అంతర్గతంగా జరిగే అన్ని విషయాలను పరిశీలిస్తుందని, పార్టీ ఆదేశాలను ధిక్కరించేవారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోదని స్పష్టం చేశారు.
జర్మన్ భాషపై శిక్షణ
ఏలూరు (టూటౌన్): బీఎస్సీ నర్సింగ్ జీఎన్‌ఎం పూర్తిచేసిన యువకు 8 నెలలపాటు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ, భోజన నివాస సదుపాయాలు కల్పిస్తున్నట్టు డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు శనివారం ప్రకటనలో తెలిపారు. బి2 లెవిల్ పరీక్ష ద్వారా జర్మనీలో ఉద్యోగావకా శాలు పొందవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 21న గుంటూరులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 90307 44877, 98666 56743 నంబర్లలో సంప్రదించాలని కోరారు.