
ఒలింపియాడ్‌లో 29 మంది విద్యార్థులకు ర్యాంకులు
తాడేపల్లిగూడెం రూరల్: ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ సంస్థ (గురుగ్రామ్) వారు నిర్వహించిన గణిత, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, జనరల్ నాలెడ్జ్ పరీక్షల్లో మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ బి.రాజారావు శనివారం తెలిపారు. మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో 30 మందికి గాను ఐదుగురు, ఇంగ్లీష్ పరీక్షలో 20 మందికి గాను ముగ్గురు, సైన్స్ పరీక్షలో 62 మందికి గాను 12 మంది, జనరల్ నాలెడ్జ్‌లో ముగ్గురికి ముగ్గురు ఇంటర్నేషనల్, సోషల్ విభాగంలో 34 మందికి గాను ఆరుగురు ఇంటర్నేషనల్ ర్యాంకులతో పాటు జోనల్, క్లాస్ ర్యాంకులు, గోల్డ్ మెడల్స్ సాధించినట్లు వివరించారు. సైన్స్ ఒలింపియాడ్‌లో రోషన్ (ఏడవ తరగతి), పృధ్వీ (8వ తరగతి), చిగురుపల్లి వివేక్ (9వ తరగతి), పిట్టా తంబి, అరవింద్ సాగర్‌బాబు (10వ తరగతి) మొదటి ర్యాంకులు సాధించారన్నారు. అలాగే ఇంగ్లీష్ ఒలింపియాడ్‌లో కంకిపాటి శాండీ రేవంత్ (8వ తరగతి) మొదటి ర్యాంకు సాధించినట్లు తెలిపారు. మొత్తం 149 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 29 మంది ప్రతిభ కనబర్చారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయాధికారిణి బి.ఉమాకుమారి, ప్రిన్సిపాల్ బి.రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ బి.ప్రతాప్, ఉపాధ్యాయులు అభినందించారు.