
ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు శ్రీజీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డును అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్‌ల డీఆర్‌ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన దెందులూరు ఆపరేటింగ్ విభాగంలోని స్టేషన్ సూపరింటెండెంట్ టీవీఎంయూ మహేశ్వర్, రాజమండ్రి ఆపరేటింగ్ విభాగంలోని పాయింట్ మెన్ కె.నథానియేల్, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ లోకేష్‌కుమార్‌లకు జీఎం అరుణ్‌కుమార్ జైన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు.
విద్యుత్ సంస్థల ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ కల్పించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ సంస్థల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పెన్షన్, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సాధన సమితి ఉమ్మడి డిమాండ్ చేసింది. ఈమేరకు జిల్లా పర్యటనకు సోమవారం సాయంత్రం నగరానికి వచ్చిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ను సంఘ అధ్యక్షుడు పీ శ్రీనివాస్, కన్వీనర్ కే కృష్ణకుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్, 1980 ని సవరించి 2004 సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర – ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును అమలులోకి తెచ్చినా విద్యుత్ ఉద్యోగులు మాత్రం జీపీఎఫ్ పరిధిలోనే ఉన్నారన్నారు. దీనివల్ల 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగష్టు 31 మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో నియమతులైన సుమారు 6,200 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అంతే కాకుండా, ఉద్యోగ నిర్వహణలో భాగంగా ప్రమాదాలకు గురై మరణించిన ఉద్యోగుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం పెన్షన్ సౌకర్యం, జీపీఎఫ్ సౌకర్యం విద్యుత్ ఉద్యోగులకు అందరికీ కల్పించాలని మంత్రిని కోరారు.
నియోజకవర్గాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయాలి
ఏలూరు (మెట్రో): జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇసుక స్టాక్ పాయింట్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఉచిత సరఫరా, వేసవిలో తాగునీటి సరఫరా, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి రానున్న వర్షాకాలంలో ఇసుక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి స్టాక్ పాయింట్‌లో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ కూలీలకు వారంలోగా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యేలు డా. కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నాగులదేవునిపాడులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
దెందులూరు: గాలాయిగూడెం పంచాయతీ నాగులదేవునిపాడు గ్రామంలో ఇరుకుటుంబాల మధ్య ఏర్పడిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి మురుగునీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసిందన్నారు. గుజ్జుల నాగేంద్రబాబు చాకుతో గూడపాటి చందు, గూడపాటి జోషిలపై దాడికి పాల్పడగా.. జోషి కుమారుడు సుమంత్ రాయితో గుజ్జుల నాగేంద్రబాబుపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించమన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివాజీ తెలిపారు.

ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు

ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు