
ఆటోల చోరీ.. నిందితుడి అరెస్టు
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంతో పాటు ఇతర జిల్లాల్లో రాత్రి సమయాల్లో ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోలను చోరీ చేస్తున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డి.విశ్వనాథ్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ములగాల వెంకటేశ్వరావు (పొట్టి) తాడేపల్లిగూడెం తోపాటు ఇతర జిలాల్ల్లో రాత్రి సమయాల్లో ఇళ్ల ముందు ఉన్న ఆటోలను చోరీ చేస్తుంటాడు. నిందితుడిపై పిఠాపురం, మండపేట, నిడదవోలు తదితర ప్రాంతాల్లో ఆటోలు చోరీ చేసినట్లు కేసులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో పట్టణ సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్సైలు పి.నాగరాజు, బి.శ్రీనివాస్‌లు సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టి ఆటోల చోరీలకు పాల్పడుతున్న ములగాల వెంకటేశ్వరరావును అరెస్టు చేశారన్నారు. ఇతని వద్ద నుంచి రూ.14 లక్షలు విలువ చేసే 7 ఆటోలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ముద్దాయిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.