
ఎలక్ట్రిక్ స్కూటర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్టు
మధురానగర్ (విజయవాడసెంట్రల్): ఎలక్ట్రిక్ స్కూటర్‌లను చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద 22 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ ఏసీపీ కె.దామోదర్ తెలిపారు. స్థానిక మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఆయన మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎస్‌కే బాషా (35), ఉండికి చెందిన జక్కంశెట్టి దుర్గాప్రసాద్ (26), విజయవాడ వాంబేకాలనీకు చెందిన సయ్యద్ యూసఫ్ (28) స్నేహితులు. కారు డ్రైవర్‌గా పనిచేసే బాషా వచ్చే ఆదాయం సరిపోక ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేరింగ్ నేర్చుకుని మెకానిక్ షాపు పెట్టుకున్నాడు. అందులోనూ ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో తాను నేర్చుకున్న విద్యను ఉపయోగించి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. తన స్నేహితులైన దుర్గాప్రసాద్, యూసఫ్‌తో కలిసి చోరీలు ప్రారంభించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కై కలూరు, తాడేపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో 22 వాహనాలను చోరీ చేశారు. మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ స్కూటర్‌ల చోరీపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. స్పందించిన పోలీసులు మాచవరం ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ప్రకాష్ తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎలక్ట్రికల్ స్కూటర్‌ల చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నెల 21న మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈఎస్‌ఐ హాస్పిటల్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు ఈవీ స్కూటర్లపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో వారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ల చోరీల విషయం బయటపడింది. వారు దొంగిలించిన 22 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ప్రకాష్, ఎస్సై ఏవీ శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు.