
పనిచేస్తూ ఉపాధి కూలీ మృతి
నిడమర్రు: ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేస్తూ ఉపాధి కూలి కొరపాటి నాగమణి (48) మృతి చెందిన ఘటన గురువారం పెదనిండ్రకొలను గ్రామంలో చోటుచేసుకుంది. తోటి కూలీల కథనం ప్రకారం నాగమణి పత్తేపురం– పెదనిండ్రకొలను గ్రామాల మధ్య ఉన్న మురుగు కాలువలో తూడు, గుర్రపుడెక్క తొలగించే పనులకు వెళ్లింది. మరి కొద్ది సేపట్లో పనులు ముగుస్తాయనగా కాలువలో తూడూ, గుర్రపు డెక్క తొలగిస్తూ ఒకేసారి కుప్పకూలి కాలువలో పడిపోయింది. తోటి కూలీలు గమనించి కాలువ గట్టుపైకి తీసుకువచ్చారు. అనంతరం నాగమణిని పెదనిండ్రకొలను పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త మంగయ్య, ఇద్దరు పెళ్‌లైన కుమార్తెలు ఉన్నారు. నిడమర్రు ఎస్సై వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నాగమణి మృతదేహాన్ని తాడేపల్లిగుడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విలేకరిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
ఏలూరు టౌన్: ఓ చానల్ విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్పారు. వివరాల ప్రకారం ఏలూరు టూటౌన్ గిలకలగేటు ప్రాంతానికి చెందిన ఉల్లింగల చంద్రకాంత్ అలియాస్ చందు ఏలూరులో ఒక చానల్ విలేకరిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 23తేదీ అర్థరాత్రి అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దారికాచి మరీ ఇనుపరాడ్లతో దాడి చేశారు. మోటారు సైకిల్‌పై ఇంటికి వెళుతున్న సమయంలో ఆకస్మికంగా దుండగులు దాడి చేయగా చేతులు అడ్డుపెట్టుకోవటంతో చందుకి చేతివేళ్లు విరిగాయి. ఆ సమయంలో అతను కేకలు వేయడం, స్థానికులు రావడంతో దుండగులు పారిపోయారు. కుటుంబ సభ్యులు చందును ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనపై ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రేకులు మీద పడి వ్యక్తి మృతి
ఆగిరిపల్లి: మందులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన వ్యక్తిపై ప్రమాదవశాత్తూ రేకులు పడడంతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తోటపల్లికి చెందిన పామర్తి హనుమంతరావు (60) ఆగిరిపల్లిలోని మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేసి వెళ్తుండగా అతడి తలపై దుకాణం పైన ఉన్న రేకులు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హనుమంతరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.