
పాలిటెక్నిక్,ఐటీఐ కోర్సులతో ఉద్యోగావకాశాలు
భీమవరం: పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. టెన్త్‌లో మంచి మార్కులు సాధించి పాలిటెక్నిక్‌లో చేరాలనుకోవడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కాళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యనభ్యసించిన నిమ్మల యశస్విని పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 586 మార్కులను సాధించిన సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏం చదవాలి? అనుకుంటున్నావని కలెక్టర్ ప్రశ్నించగా పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి పాలిటెక్నిక్ చదవాలనుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేయడంతో మంచి నిర్ణయమంటూ యశస్వినిని కలెక్టర్ నాగరాణి అభినందించారు. టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు కోర్సుల ఎంపికలో యశస్వినిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మంచి ఫలితాల సాధనకు విద్యార్థులను ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయుడు జేఎల్‌ఎం శాస్త్రి శాలువాతో కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ, ఎంఈఓ ఎ.రవీంద్ర, విద్యార్థిని తల్లిదండ్రులు నిమ్మల శ్రీనివాసరావు, భారతి తదితరులు పాల్గొన్నారు.