
యథేచ్ఛగా చెట్ల నరికివేత
నిబంధనలను మీరి మరీ..
ఏలూరు డివిజన్(4, 5 ప్యాకేజీలు) పరిధిలోని పోలవరం కుడి కాలువ వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులు నిర్వహించేందుకు భీమవరానికి చెందిన పంచగర్ల సత్యనారాయణ కాంట్రాక్టుకు తీసుకున్నాడు. నారాయణపురం పరిధిలోని కాలువ వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులను తామే చేసి, అప్పగిస్తామని పార్టీ గ్రామ కమిటీ అద్యక్షుడు కేఎన్‌ఆర్ కాంట్రాక్టర్‌తో మాట్లాడుకుని, అక్కడ తుమ్మచెట్లు నరకకుండా మొత్తం వేప చెట్లను నరికేశారు. దీనిపై నాకు శుక్రవారం కొందరు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత వ్యక్తులను ఏలూరు కార్యాలయానికి వచ్చి ఫైన్ కట్టమని హెచ్చరించాను. అలాగే దగ్గరుండి పనులు చేయించాలని కాంట్రాక్టరుకు సూచించాను.
– బాపూజీ, ఇరిగేషన్ ఏఈ
●
ద్వారకాతిరుమల : ఓ పచ్చనేత పోలవరం కుడి కాలువ గట్టుపై ఉన్న చెట్లపై కన్నేశాడు. ఇంకేముంది పట్టపగలే వాటిని నరికించే పనిలో పడ్డాడు. ఇప్పటికే వేప తదితర జాతులకు చెందిన దశాబ్దాల కాలం నాటి ఎన్నో చెట్లను నరికించేశాడు. ఇప్పటికే కొంత కలపను విక్రయించగా, మరి కొంత కలపను విక్రయించేందుకు సిద్ధం చేశాడు. చెట్లు నరికివేతపై ఆ నాయకుడిని ఎవరైనా ప్రశ్నిస్తే, నేనెవరో తెలుసా..? టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్‌ని అంటున్నాడు. దాంతో సంబంధిత అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడడానికి భయపడుతున్నారు. వివరాల ప్రకారం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం–గుణ్ణంపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై గత పది రోజులుగా చెట్లు నరికివేత పనులు జరుగుతున్నాయి. పట్టపగలే ఈ పనులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ఎంతో విలువైన వేప, తదితర జాతులకు చెందిన భారీ వృక్షాలను నరికి వేస్తున్నారు. ఇప్పటికే కొంత కలపను విక్రయించగా, మరి కొంత కలపను అమ్మేందుకు సిద్ధం చేశారు. కాలువ గట్టుపై అక్కడక్కడా ఆ కలపను గుట్టలుగా ఉంచారు.
అసలు నేనెవరో తెలుసా..?
ఎం.నాగులపల్లి–గుణ్ణంపల్లి మధ్యలో శుక్రవారం చెట్లు నరికే సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అటుగా వెళ్లారు. నరికిన చెట్లను ట్రాక్టర్‌తో బయటకు లాగడాన్ని చూసి, అక్కడున్న వారిని నిలదీశారు. ఎంతో విలువైన వేప చెట్లను ఎవరి అనుమతులతో నరుకుతున్నారని ప్రశ్నించారు. దాంతో కోపోద్రిక్తుడైన ఒక నాయకుడు అసలు నేనెవరో తెలుసా.. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని, నేను చూసుకుంటాను అంటూ ఊగిపోయాడు. ఫోన్‌లో వీడియో ఎందుకు తీస్తున్నారని బైక్‌పై ఉన్న వారితో సదరు నాయకుడు, అతనితో ఉన్నవారు వాగ్వివాదానికి దిగారు. దాంతో ఏం చేస్తారోనన్న భయంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ అక్రమాలను ఆపేదెవరూ?
కళ్లముందే పచ్చని చెట్లను నరికేస్తుంటే సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమని స్థానికులు అంటున్నారు. ఎంత అధికార పార్టీ నాయకులైతే మాత్రం అక్రమంగా చెట్లు నరికి, అమ్మేస్తుంటే పట్టించుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. కాలువ గట్టుపై జంతుజాలాలు, పక్షు జాతులకు ఆవాసంగా ఉన్న చెట్లను అక్రమంగా నరికివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, చెట్లను నరికి, అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పోలవరం కాలువ గట్టుపై ఉన్న చెట్లపై టీడీపీ నేత కన్ను
కొంత కలప విక్రయం, మరికొంత అమ్మేందుకు సిద్ధం

యథేచ్ఛగా చెట్ల నరికివేత

యథేచ్ఛగా చెట్ల నరికివేత