
జిల్లా వ్యాప్తంగా పోలీసు తనిఖీలు
భీమవరం: కశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడి దృష్ట్యా.. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబు గుర్తింపు బృందం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నేతృత్వంలో జిల్లాలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. హోటళ్లు, లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు తనిఖీ చేశారు. విస్తృత తనిఖీలకు జిల్లా ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనిస్తే తక్షణమే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా శిబిరాలు
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పాఠశాల విద్యార్థులకు ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణా శిబిరాలు ఉంటాయని, ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు కథ వినడం, 8.30 నుంచి 10 గంటల వరకు పుస్తకాలు చదవడం/కథలు చెప్పడం, 10 గంటల నుంచి 10.10 గంటల వరకు విరామం ఉంటుందన్నారు. 10.10 నుంచి 10.30 వరకు పుస్తక సమీక్ష, 10.30 నుంచి 11 గంటల వరకు స్పోకెన్ ఇంగ్లీష్/డ్రాయింగ్/పెయింటింగ్/పేపర్ క్రాప్ట్స్/డ్యాన్స్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు.
28న ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా
ఏలూరు (టూటౌన్): జిల్లా ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీఎస్) భాగస్వామ్యంతో ఈ నెల 28న ఉదయం 10:30 గంటలకు ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల పురుష అభ్యర్థులు.. ఆటోమొబైల్ రంగంలో అనుభవం ఉన్నవారు లేదా ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సేల్స్ విభాగానికి డిగ్రీ ఉండాలని, వర్క్‌షాపు సంబంధిత పోస్టులకు మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో లేదా బీ.టెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరింత సమాచారం కోసం 8886882032 నెంబరులో సంప్రదించాలన్నారు.
మెగా డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాకు చెందిన కాపు అభ్యర్థులకు మెగా డీఎస్సీ –2025 కోసం ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణా కార్యక్రమానికి సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): ఉజ్వల యోజన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పొంది వినియోగించని లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉజ్వల 2.0 పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొంది రెండు సంవత్సరాలుగా రీఫిల్ చేసుకోని లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు మొదటి నోటీసు జారీ చేసిన 15 రోజులలోపు వారికి సంబంధించిన గ్యాస్ పంపిణీదారుల కంపెనీకి వెళ్ళి, వారి ఈకేవైసీ ఫార్మాలిటీలు, బయోమెట్రిక్ మళ్ళీ పూర్తి చేసుకోవాలని చెప్పాలన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) నారాయణ పేర్కొన్నారు. మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్పెషల్ క్లాస్‌ల నిర్వహణను శనివారం డీఈఓ పరిశీలించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలపై సమీక్షించారు.