
శ్రీవారి చెంత సేద తీరి
●
అలసట మాయం
ఆలయానికి వచ్చేటప్పుడు ఎండ వేడిమికి భయపడ్డాను. బయట వాతావరణం చూసి దర్శనం క్యూలైన్లలో ఉండగలమా అనిపించింది. కానీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనూ, క్యూలైన్ల వద్ద ఎయిర్ కూలర్ల నుంచి వస్తున్న చల్లదనం అలసటను మాయం చేసింది. క్యూ కాంప్లెక్స్‌లో ఇంకాసేపు ఉంటే బాగుండేదని అనిపించింది.
– కామిశెట్టి దుర్గా లక్ష్మి, భక్తురాలు, పోలవరం మండలం, రేపల్లెవాడ గ్రామం
ఏ ఆలయంలోనూ ఇలా లేదు
క్యూ కాంప్లెక్స్‌లో సౌకర్యాలు బాగున్నాయి. ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. అలాగే క్యూ కాంప్లెక్స్‌లోని స్క్రీన్‌పై క్షేత్ర చరిత్ర, వేంకటేశ్వర స్వామికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడం బాగుంది. భక్తులందరికీ మజ్జిగను కూడా అందిస్తున్నారు. వేసవిని పురస్కరించుకుని ఆలయ అధికారులు చేపట్టిన చర్యలు అద్భుతంగా ఉన్నాయి.
– పరసా రాఘవేంద్ర, మచిలీపట్నం, భక్తుడు
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో ఏ దేవాలయంలోనూ లేని విధంగా ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కూలర్లు భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం క్షేత్రానికి వస్తున్న భక్తులు ఎండ వేడిమి కారణంగా అలసిపోతున్నారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లలోకి అడుగుపెట్టగానే ఎయిర్ కూలర్ల నుంచి వస్తున్న చల్లదనాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. హమ్మయ్య.. అనుకుంటూ ఉపశమనాన్ని పొందుతున్నారు. క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే సమయంలో కొందరు భక్తులు, చిన్నారులు అక్కడే విశ్రాంతి పొందుతున్నారు. పిల్లలను వారి తల్లిదండ్రులు కూలర్ల వద్ద ఆడిస్తున్నారు.
ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో నాలుగు కూలర్లు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మొత్తం ఐదు కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు నాలుగు కూలర్లు (నాలుగు మూలల) చొప్పున మొత్తం 20 కూలర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలోని క్యూలైన్ల వద్ద మరో 5 కూలర్లను ఏర్పాటు చేశారు. సిబ్బంది నిరంతరాయంగా ఆ కూలర్లను నీటితో తడుపుతున్నారు. భక్తుల పట్ల వారు చూపుతున్న శ్రద్ధను పలువురు కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో కూలర్ ధర రూ. 18 వేలు అని, దాతల సహకారంతో మరికొన్ని కూలర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
మరిన్ని సౌకర్యాలు
క్యూ కాంప్లెక్స్‌లో దేవస్థానం సిబ్బంది భక్తులకు మజ్జిగను, మంచి నీటిని అందిస్తున్నారు. అలాగే అందులో ఉన్న స్క్రీన్‌పై క్షేత్ర చరిత్ర, అన్నమయ్య, దేవతామూర్తుల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. దాంతో చల్లని వాతావరణంలో వాటిని తిలకిస్తూ, దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని భక్తులు మరచిపోతున్నారు. క్షేత్రంలో సౌకర్యాల కల్పనకు అధికారులు చేపడుతున్న చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవారి ఆలయంలో ఎయిర్ కూలర్ల ఏర్పాటు
క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలో ఎండ వేడమి నుంచి భక్తులకు ఉపశమనం
దాతల సహకారంతో ఇప్పటికే 25 కూలర్ల ఏర్పాటు
మరికొన్ని కూలర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్న అధికారులు

శ్రీవారి చెంత సేద తీరి

శ్రీవారి చెంత సేద తీరి

శ్రీవారి చెంత సేద తీరి