
ఆన్‌లైన్‌లో చాటింగ్.. ఆపై మోసం
ఏలూరు (టూటౌన్): భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆన్‌లైన్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. భీమడోలు మండలం, ఆగడాలలంక గ్రామానికి చెందిన బలే శైలజ (26)కు ఈలో–ఈలో ఆన్‌లైన్ యాప్ ద్వారా రాజు యాదవ్ అనే పేరుతో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని చెప్పి నమ్మించాడు. బాధితురాలి సమస్యలను తెలుసుకొని ప్రైవేట్ బ్యాంక్‌లలో లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు. లోన్ ప్రొసెసింగ్ ఫీజ్ చెల్లించాలని చెప్పి దఫాదఫాలుగా సుమారు రూ.1,60,900 ఫోన్ పే ద్వారా వసూలు చేశాడు. ఎన్ని రోజులైనా లోన్ రాకపోవడంతో ఆమె నాగరాజును నిలదీయగా నీ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె భీమడోలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు కడప జిల్లా వేములకు చెందిన నారుబోయిన రాజశేఖర్ అలియాస్ రాజుయాదవ్‌ను గుండుగొలను గ్రామ శివారు పోతునూరు రోడ్డులోని వాటర్ కల్వర్ట్ వద్ద అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు లాప్‌టాప్‌లను సీజ్ చేశారు. కేసును ఛేదించిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్, హెచ్‌సీలు ఎస్‌కేఎస్ బాజీ, ఎస్.శ్రీనివాస్, పీసీ ఎం.వెంకటేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు.
కేసును ఛేదించిన భీమడోలు పోలీసులు