ఊరే ముందు పుట్టిందో, రాణిదేవే ముందు పుట్టారో ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. ఊళ్లోని చెట్టూ పుట్టా, చేనూ చెరువూ, కొండా కోన ఆమె కళ్ల ముందే ఎదిగాయి. ఎదగకుండా ఉన్నది మాత్రం ఊరే. ఎదగని ఆ ఊరిని చూస్తూ.. ఇక చూస్తూ ఊరుకోకూడదని నిర్ణయించుకున్నారు రాణి దేవి.
రాణిదేవి బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సభ్యురాలో, లేక ‘గ్రామ ప్రధాన్’నో కానవసరం లేదు. ఆమెకై ఆమె వెళ్లి అడిగితే గ్రామంలోని ఏ ప్రభుత్వ ఉద్యోగి, అధికారి అయినా వెంటనే కుర్చీలోంచి లేచి, ఎదురెళ్లి ఆమెకు నమస్తే పెట్టి, అవసరమైన పని చేసిపెట్టేంత గౌరవనీయమైన పెద్ద వయసులో ఉన్నారు రాణిదేవి. 81 ఏళ్లు! అసలైతే ప్రభుత్వమే ఆమె దగ్గరకు రావాలి. ఆమె ప్రభుత్వం దగ్గరకు వెళ్లే అవసరం లేదు. ఉందీ అంటే ఆ గ్రామంలో ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే! ఎలాగంటే ఒక వృద్ధ మహిళ అడిగితేనే లక్ష్య పెట్టని ప్రభుత్వ సిబ్బంది.. తక్కినవారు అడిగితే పని చేసి పెడతారా?! అలా చేసి పెట్టి ఉంటే ఈ ఎనభై ఏళ్లలో.. రాణిదేవికి ఊహ తెలిసినప్పటి నుంచైతే.. ఈ డెబ్బై ఏళ్లలో రుద్రాపూర్ ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. అభివృద్ధి అంటే పెద్దగా ఏం కాదు.. మంచి రోడ్లు, మంచి నీరు, శుభ్రమైన పరిసరాలు.. ఇలా మనిషి మనుగడకు అవసరమైన కనీస వసతులు. కానీ రుద్రాపూర్‌లో ఏడు దశాబ్దాలుగా ఇవేవీ లేవు. చిత్రంగా ఉంటుంది.. వచ్చి వెళ్లిన పాలకులు, అధికారులు ఏం చేసినట్లు?!
∙∙
ఏం చేయలేదని, ఏం చెయ్యరు కూడానని చివరికి రాణిదేవే బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సభ్యురాలిగా నిలబడేందుకు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 15 నుంచి విడతల వారిగా పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న కౌంటింగ్. అదే రోజు ఫలితాలు రావచ్చు. ఏ పంచాయితీకి ఏ ఫలితం వచ్చినా.. కాన్పూర్ జిల్లా చౌబేపుర్ బ్లాక్ కౌన్సిల్ సభ్యురాలిగా రాణిదేవి గెలవడం అత్యుత్తమ ఫలితం అవుతుంది. రాణిదేవి స్వగ్రామమైన రుద్రాపూర్ ఆ బ్లాక్ పరిధిలోనిది. ఆమె గెలుపు ఎలా అత్యుత్తమమైన ఫలితం అవుతుందో చూడండి. ఆమేమీ అధికారం కోసం, పదవి కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకోవడం కోసం ఈ వయసులో నామినేషన్ వేయలేదు.
ఏదైనా ఒక పార్టీ తరఫున అసలే పోటీ చేయడం లేదు. తనకై తను సొంతంగా, స్వతంత్ర అభ్యర్థిగా, ఊరిని మార్చడం కోసం ఎన్నికల్లో నిలబడ్డారు. ‘‘నన్ను గెలిపిస్తే ఊరిని నివాస యోగ్యం చేస్తాను’’ అని రాణిదేవి అంటున్నారు. మంచి మాటే! ఆకాశాన్ని కిందికి తెస్తాం, భూమిని పైకి తీసుకెళతాం అని హామీలు ఇవ్వడం కాకుండా.. ఊళ్లో నివాసం ఉండే పరిస్థితుల్ని కల్పిస్తాను అని రాణిదేవి అనడం.. ‘ఊరొదిలి ఎక్కడికీ వెళ్లనవసరం లేదు’ అని నమ్మకమైన హామీని ఇవ్వడమే. అయినా రుద్రాపూర్ గ్రామ ప్రజలు ఊరెందుకు వదలి వెళ్లాల్సి వస్తుంది?!
∙∙
ఇన్నేళ్లుగా ఊరిని చూస్తూనే ఉన్నారు కదా రాణిదేవి.. ఊళ్లో సరైన రోడ్లు లేవు. ఆ ఊళ్లో కాలి నడక కూడా మనిషిని కిందపడేస్తుంది. ఎగుడు దిగుడు దిబ్బలే అక్కడి రహదారులు. ఎక్కడ పడితే అక్కడ చెత్త కొండలా పేరుకుపోయి ఉంటుంది. ఊరి నిండా మురికి కుంటలే. అంత ‘సౌకర్యవంతంగా’ ఉంటే దోమలు తమ సంతతి ని వృద్ధి చేసుకోకుండా ఉంటాయా, మనుషుల్ని ఆసుపత్రులకు చేర్చకుండా ఉంటాయా?! పరిశుభ్రత అన్న మాటే కనిపించదు. చెప్పీ చెప్పీ ఊళ్లో వాళ్ల నోళ్లు పోయాయి తప్పితే, వాళ్ల ఓట్లతో గెలిచిన పంచాయితీ పాలకులు సక్రమంగా చెత్తను ఎత్తి పారేయించింది లేదు. మురికి కాలవల్ని సాఫీగా పారించింది లేదు. దోమల్ని తరిమిందీ లేదు.
‘‘ఇదిగో ఈ దుస్థితినంతా పోగొట్టి ఊరిని చక్కబరుస్తాను’’ అంటున్నారు రాణిదేవి పట్టుపట్టినట్లుగా. ‘‘పూర్వపు పాలకుల వైఫల్యాలను మా అమ్మ ఎత్తి చూపించడమే కాకుండా, ఎత్తి పారేయబోతున్నారు కూడా’’ అని రాణిదేవి కుమారుడు చాంద్ పాల్ అంటున్నారు. రాణిదేవి మనవరాలు కూడా తన నానమ్మను గెలిపిస్తే ఊరెంత వెలిగిపోతుందో చెబుతూ ఆమె తరఫున ప్రచారం చేస్తోంది. అయితే ఎవరూ ‘ఓట్ ఫర్’ అని చెప్పకుండానే... రుద్రాపుర్ బ్లాక్‌లోని వారంతా ఇప్పటికే మూకుమ్మడిగా రాణిదేవికే ఓటు వేయాలని తీర్మానించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment