ఫ్రేమ్‌ని కాస్త వైడ్ చేసింది ఐశ్వర్య. మిణుగురులలోకి నక్షత్రాలు వచ్చి చేరాయి. పచ్చని పాలపుంత విచ్చుకుంది. కడలి నురుగై కాంతి పరచుకుంది. టాపిక్‌కి కరెక్టు సెట్టింగ్. ఫొటో తీసి పోటీకి పంపింది. అండ్ ది అవార్డ్ గోస్ టు.. ఐశ్వర్య! వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో తొలి భారతీయ మహిళా విజేత! వెలుగు ఛాయల అడవి చుక్క.
ఫొటోగ్రఫీలో ఐశ్వర్యకు వచ్చిన అవార్డులను, ఆమె ప్రతిభా విశేషాలను చెప్పుకోవడం మొదలు పెడితే ఆ మహారణ్యంలో ఎక్కడో దారి తప్పుతాం. లేదంటే, ఎంతకూ తరగని ఒక ఫొటో అల్బమ్‌ను రోజంతా తిప్పుతూ కూర్చోవడమే. ఇంతా చేసి ఈ అమ్మాయి వయసు ఇరవై మూడు! ఇప్పుడు ఇంకొక ఘనత. ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ! ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుంచి 50 వేల మంది పోటీకి ఎంట్రీలను పంపితే ఐశ్వర్య తీసిన ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ ఫొటో దగ్గర జడ్జీల కళ్లన్నీ ఆగిపోయాయి! వండర్‌ఫుల్ అన్నారు. పదివేల పౌండ్ల ప్రైజ్ మనీ. అవుట్‌స్టాండింగ్ అన్నారు. ట్రోఫీ. కంగ్రాచ్యులేషన్స్ అన్నారు. ప్రత్యేక ప్రశంశాపటం. పదివేల పౌండ్లంటే సుమారు పది లక్షల రూపాయలు. ఒక మంచి కేనన్ కెమెరా కొనడానికి అయ్యే ఖర్చుకు మాత్రమే ఆ మొత్తం సమానం అయినది కావచ్చు. కానీ, లండన్‌లోని ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ నుంచి చిన్న గుర్తింపునైనా పొందడం వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌లకు చిన్న వయసులోనైనా జీవిత సాఫల్య పురస్కారమే! పోటీలో విజేత ఎంపిక అంత టఫ్‌గా ఉంటుంది. ఫొటోలు తియ్యమని వాళ్లిచ్చే థీమ్ కూడా ఫ్రేమ్‌లో ఎలా ఇమడ్చాలో తెలియని విధంగా ఉంటుంది!
‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2020’ విజేతగా ఐశ్వర్యను నిలబెట్టిన ఫొటో ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’.
బిహేవియర్ : ఇన్‌వెర్టిబ్రేట్స్.. ఇదీ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ ఏడాది ఇచ్చిన ఫొటోగ్రఫీ పోటీ థీమ్. భూమి మీద కానీ, గాలిలో గానీ, నీటి మీద గానీ కనిపించే వెన్నెముక ఉండని ప్రాణుల నడవడికను ఫొటో తియ్యాలి! టాపిక్ వినగానే.. పోటీకి ఉత్సాహపడుతున్న ‘వైల్డ్’ ఫొటోగ్రాఫర్‌ల మెడలలోని కెమెరాలు సగానికన్నా ఎక్కువ తక్కువగా చేతుల్లోంచి కిందికి వాలిపోతాయి. మిగిలిన వాళ్లలో ఐశ్వర్య ఉండనే ఉంటారు. పన్నెండేళ్ల వయసు నుంచి అరణ్యాలను చూస్తోంది ఐశ్వర్య. అరణ్యాలలోని ఇన్‌వెర్టిబ్రేట్స్ నడవడికల్ని చూడలేదా?! ఈ పోటీ కోసం మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని భందర్దరా అడవుల్లోకి రాత్రిపూట వెళ్లి అక్కడి మిణుగురులను (ఫైర్‌ఫ్లైస్) ఎంపిక చేసుకుంది ఐశ్వర్య. అవి ఒక చెట్టునిండా ఉన్నాయి. చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్రేమ్‌లోకి చెట్టును, మిణుగురులను తీసుకుంది. ఊహు.. ఇలాక్కాదు అనుకుంది. ఫ్రేమ్‌ని కొంచెం వైడ్ చేసింది. మరికొంచెం చేసింది. నక్షత్రాలను, ఆకాశాన్నీ ఫ్రేమ్‌లోకి లాక్కుంది. ఇక చూడండి. అదొక పాలపుంత. చుక్కల భ్రమణం. ఆ ఫొటోకి ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ అని పేరు పెట్టి పోటీకి పంపించింది. మోహన కాంతులు అని! అంతే. అవార్డు గ్రహీతగా ఆమె ఫొటో క్లిక్ మంది. గత మంగళవారం లండన్ నుంచి వర్చువల్‌గా (స్క్రీన్‌పై) జరిగిన వేడుకలో విజేతగా ఐశ్వర్య పేరును ప్రకటించింది ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’.
ఐశ్వర్య వైల్డ్‌లైఫ్ మీద, ఆడపులుల మీద కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీసింది. మాస్ మీడియాలో పట్టభద్రురాలు. పుట్టింది, ఉంటున్నదీ ముంబైలో. తండ్రి శ్రీధర్ రంగనాథన్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో సభ్యుడు. తండ్రితోపాటు అరణ్య పర్యటనలకు వెళుతుండేది ఐశ్వర్య. అలా ఆమెకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. తల్లి రాణి సపోర్ట్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment