ఐరన్‌ మైన్‌లో చరిత్ర సృష్టించనున్న మహిళలు.. | Allwomen team to take over operations of iron mine in Jharkhand | Sakshi
Sakshi News home page

ఐరన్‌ మైన్‌లో చరిత్ర సృష్టించనున్న మహిళలు..

Published Sat, Dec 11 2021 1:39 PM | Last Updated on Sat, Dec 11 2021 1:40 PM

Allwomen team to take over operations of iron mine in Jharkhand - Sakshi

Allwomen team to take over operations of iron mine in Jharkhand: బహుశా,అంత ఖరీదైన కార్యాలయాన్ని వారిలో చాలామంది తొలిసారిగా చూసి ఉండవచ్చు. కాస్త భయం కూడా వేసి ఉండవచ్చు. ఖరీదైన దుస్తుల్లో, గంభీరంగా తమ ఎదురుగా కనిపిస్తున్న పెద్ద అధికారులను చూస్తూ  కాస్తో కూస్తో బెరుకుగా మాట్లాడి ఉండవచ్చు. కొన్ని సమయాల్లో మాటల  కోసం వెదుక్కొని ఉండవచ్చు. అయితే వారి కళ్లు మాత్రం నిండు ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతున్నాయి.

అప్పుడప్పుడు కళ్లు మాట్లాడకుండానే మాట్లాడతాయి....ఇది కవిత్వం కాదు. యథార్థ జీవిత దృశ్యం!
టాటా స్టీల్స్‌ నౌముండి (ఝార్ఖండ్‌) ఐరన్‌ మైన్‌లో తొలిసారిగా 30 మందితో కూడిన ‘ఆల్‌వుమెన్‌ టీమ్‌’ డ్రిల్లింగ్, డంపింగ్, షవెల్‌ ఆపరేషన్‌...మొదలైన పనుల్లో విధులు చేపట్టడానికి రెడీ అవుతుంది. మొత్తం 350 మంది అభ్యర్థుల నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రక్రియల ద్వారా 30 మంది మహిళలను ఎంపిక చేశారు.  ఇందులో చుట్టుప్రక్కల గిరిజన గ్రామాల నుంచి వచ్చిన పేదమహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇలా ఎంపికైన వారిలో ఒకరు...రేబుతి పర్టీ. ఇద్దరు పిల్లల తల్లి రేవతి.

‘ఏదో ఉత్సాహంతో వచ్చానుగానీ నేను చేయగలనా!’ అని మొదట్లో చాలా భయపడింది రేవతి. పైగా చుట్టాలు, పక్కాలు భయపెట్టేలా మాట్లాడిన మాటలు కూడా పదేపదే గుర్తుకు వస్తున్నాయి. ‘మైనింగ్‌ పని చేయడానికి మగాళ్లే భయపడతారు. నీలాంటి వాళ్లు చేయడం చాలా కష్టం. ఎలా వెళ్లావో అలా తిరిగొస్తావు చూడు’

‘ఏ పెళ్లికో పేరంటానికో పక్క ఊరుకు వెళ్లడం తప్ప...పెద్దగా ఎక్కడికి వెళ్లింది లేదు. ఇప్పుడు ఊరు కాని ఊరు వచ్చాను. ఎవరూ తెలిసిన వాళ్లు లేరు. బెంగతో జ్వరం వచ్చినట్లు కూడా అయింది’ అని ఆరోజును గుర్తు చేసుకుంది నౌముండి బ్లాక్‌లోని జంపని అనే గ్రామానికి చెందిన రేవతి.
మరో గిరిజన గ్రామం నుంచి వచ్చిన తార పరిస్థితి కూడా అంతే.

‘ఉద్యోగం వచ్చిందని సంబరపడిపోతున్నావేమో, పనిచేయించడానికి అక్కడ నానా కష్టాలు పెడతారు. ఎంతోమంది మధ్యలోనే పారిపోతుంటారట...’ ఎదురింటి చుట్టం భయపెట్టిన మాటలు పదేపదే గుర్తుకు వచ్చాయి తారకు. ఒక దశలో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోవడానికి రెడీ అయింది. రేవతి, తార మాత్రమే కాదు...ఇంకా చాలామంది, ఒక్కరు కూడా వెనక్కి పోలేదు!

‘యస్‌...ఈ పని మేము తప్పకుండా చేయగలం’ అని గట్టి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి కారణం... ఉద్యోగానికి ఎంపికైన మహిళలకు మొదట సాంకేతిక శిక్షణ ఇవ్వలేదు. కొన్నిరోజుల పాటు వారిలో ధైర్యం నింపే తరగతులు నిర్వహించారు. ఇవి మంచి ఫలితాన్ని ఇచ్చాయి.
‘ట్రైనింగ్‌ కోర్సు పూర్తయిన తరువాత బాగా ధైర్యం వచ్చింది. ఏ షిప్ట్‌లో పనిచేయడానికైనా రెడీగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో చేరుతానా అని ఉత్సాహంగా ఉంది’ అంటుంది రేవతి.

రేవతి మాత్రమే కాదు..ఎప్పుడూ చిన్న స్కూటర్‌ నడపని మహిళలు కూడా ఇప్పుడు...భారీ విదేశి యంత్రాలను సులభంగా ఆపరేట్‌ చేస్తున్నారు. ఐరన్‌మైన్‌లో తొలిసారిగా ‘ఆల్‌వుమెన్‌ టీమ్‌’ ను తీసుకోవడం యాదృచ్ఛికం కాదు. ‘2025లోపు ఐరన్‌మైన్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచాలి’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది టాటా స్టీల్స్‌.  దీనికి ‘తేజస్విని 2.0’ అనే నామకరణం కూడా చేసింది. వారి లక్ష్యం సంపూర్ణంగా సిద్ధించాలని ఆశిద్దాం.

చదవండి: Health Tips In Telugu: ​జీడిపప్పు, బాదం పప్పు, వాల్‌ నట్స్‌ రోజూ తింటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement