ప్రమాదంలో కాలు పోగొట్టుకొని, తల్లిదండ్రులకు భారమై, లోకమంతా శూన్యంలా అనిపించిన రోజుల నుంచి తేరుకొని, అహ్మదాబాద్‌లో ‘ఆంప్ టీ నేహా’ పేరుతో టీ స్టాల్ ప్రారంభించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నేహ. మోటివేషనల్ స్పీకర్‌గానూ తన జీవన అనుభవాలను చెబుతోంది. ఆంప్ టీ కి దేశవ్యాప్త గుర్తింపు తేవడానికి కృషి చేస్తోంది. ఓడిపోయిన రోజుల నుంచి ఒంటికాలితో గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వివరిస్తుంది నేహ.
‘‘మాది ఉమ్మడి కుటుంబం. అమ్మ,నాన్న, ఇద్దరు అన్నదమ్ములు. నాన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. గుజరాత్‌లోని భవానీ నగర్‌లో పుట్టి పెరిగాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీ చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఓ చిన్న ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం వెతుక్కొని, కొన్నాళ్లు గడిపాను. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ, ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలక్రమంలో అన్ని ఇష్టాలను వదులుకుంటూ రావాల్సి వచ్చింది. ఇలాగే ఉంటే నా కలల రెక్కలు విప్పుకోలేననిపించింది. ఉద్యోగంతో పాటు కాలేజీలో చదువుకోవడానికి అడ్మిషన్ తీసుకున్నాను. ఉదయం టీచర్‌గా చేస్తూ, సాయంత్రం కాలేజీలో చదువుకునేదాన్ని.
స్కూల్లో పాఠాలు చెబుతూనే నా బలహీనతల గురించి కూడా తెలుసుకున్నాను. నేను ముందుకు వెళ్లాలంటే నా బలహీనతలపై పనిచేయడం నేర్చుకోవాలి అని అనుకున్నాను. కొంత కాలం అంతా బాగానే జరిగింది. కానీ, కాలంతో పాటు డబ్బు అవసరం కూడా పెరగడం మొదలైంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అహ్మదాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 2012లో అహ్మదాబాద్ వచ్చి, కాల్‌సెంటర్‌లో పనిచేశాను. ఎన్నో ప్రయత్నాల తర్వాత మళ్లీ టీచర్ జాబ్ సంపాదించుకున్నాను. ఎక్కువ మొత్తంలోనే నెల జీతం వచ్చేది.
కల చెరిపిన ప్రమాదం
అంతా బాగుంది అనుకున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను. ట్రీట్‌మెంట్ తీసుకోవడంలో జాప్యం కావడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. దాంతో తీవ్ర నిరాశతో డిప్రెషన్‌కు గురయ్యాను. దీని నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కృత్రిమ కాలు ఏర్పాటయ్యాక నాలో మళ్లీ ఆశలు చిగురించాయి.
స్నేహితుల సహకారంతో..
ధైర్యం తెచ్చుకొని, ముందున్న జీవితం గురించి ఆలోచించాను. టీ అంటే నాకు చాలా ఇష్టం. దీంతో మా ఇంట్లో వాళ్లకి ఓ కేఫ్ తెరుస్తానని చెప్పాను. కానీ, నా ట్రీట్‌మెంట్‌కి అప్పటికే చాలా ఖర్చయింది. షాప్ అద్దెకు తీసుకునేంత డబ్బు నా దగ్గర లేదు. మా బంధువులు ఎవరూ సపోర్ట్ ఇచ్చేవారు లేరు. కానీ, నా స్నేహితుల సహకారంతో టీ స్టాల్ ప్రారంభించాను. టీ స్టాల్‌కు షార్ట్ మీదనే వెళ్లేదాన్ని.
చాలా మంది నా డ్రెస్ గురించి కూడా తిట్టేవారు. ‘కాలు లేదు, పైగా నలుగురు తిరిగే చోట ఇలా షార్ట్స్ వేసుకొని తిరుగుతావా? బుద్ధిలేదా’ అనేవారు. ఈ వెక్కిరింపులు బాధ కలిగించేవి. కానీ, నాకు నేను బలంగా ఉన్నాను అని తెలుసు. వాస్తవికతను అంగీకరించాను. నేను ధరించిన డ్రెస్ నాకేమీ ఎబ్బెట్టుగా లేదు. పైగా అందరూ అంతగా తిట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నా పని ద్వారానే సమాధానం చెబుతాను అనుకునేదాన్ని.
టీ స్టాల్ వైరల్
‘కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయి’ అని నాకు నేనే చెప్పుకుంటూ ‘ఆంప్ టీ నేహా’ పేరుతో టీ స్టాల్ నడపడం మొదలుపెట్టాను. విజయం సాధిస్తానని కచ్చితంగా తెలుసు. కానీ, ప్రజల నుండి ఇంత ప్రేమను పొందుతానని తెలియదు. కేవలం పది రోజులలో నా టీ స్టాల్ వద్ద జనం గుమిగూడటం ప్రారంభించారు. ఫుడ్ బ్లాగర్లు నా గురించి రాసి, ప్రచారం చేశారు. నా టీ స్టాల్‌ను బ్రాండ్‌గా మార్చాలని పోరాడుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత కొందరు అధికారులు నా స్టాల్ దగ్గరకు వచ్చి, ఇది అక్రమమని, తొలగిస్తామన్నారు.
నేను వారితో చాలా పోరాడాను. ఎవరో తీసిన ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంతోమంది తమ ప్రేమతో నాకు మద్దతు తెలిపారు. ఇక నేను వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ‘ఆంప్ టీ నేహా’ని మంచి బ్రాండ్‌గా మార్చి నాలాంటివారికి ఓ మార్గం చూపాలన్న నా కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’ అని చెబుతోంది నేహా.
Comments
Please login to add a commentAdd a comment