టెక్నాలజీ ఎంతవేగంగా ఎదుగుతోందో మనిషిలోని సృజనాత్మకత అంతే వేగంగా విభిన్న కోణాల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. క్రియేటివిటీకి హద్దులు లేకపోవడంతో అనేక రంగాల్లో చిత్రవిచిత్ర ఆలోచనలకు రూపురేఖలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అగ్గిపెట్టెలో పట్టగలిగే చీరలు, బంగారంతో నేసిన చీరలను తయారు చేయడం గురించి విన్నాం. తాజాగా కేరళకు చెందిన మహిళా బేకర్ నమిలి మింగేయగల సరికొత్త చీరను రూపొందించింది. మహిళలు ధరించే పరిమాణం, ఆకర్షణీయమైన డిజైన్‌తో కేరళ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చీర ఉండడం విశేషం.
కేరళలోని కొల్లంకు చెందిన అన్నా ఎలిజబెత్ జార్జ్... క్యాన్సర్ అండ్ న్యూరోబయాలజీలో పీహెచ్‌డీ చేస్తోంది. ఒక పక్క చదువుతూనే మరోపక్క తన కిష్టమైన కుకింగ్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇటీవల ముగిసిన ఓనం వేడుకల్లో సరికొత్తగా ఏదైనా తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే మలయాళీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, కేరళలో జరిగే ప్రతి సంప్రదాయ కార్యక్రమానికి తప్పసరిగా కట్టుకునే ‘కేరళ కసువ చీర’ను సరికొత్తగా రూపొందించింది. తెల్లని రంగు, గోల్డెన్ జరీ అంచుతో ఉండే కసువా చీరను బంగాళ దుంప గుజ్జుతో చేసిన పొడి, బియ్యప్పిండిని ఉపయోగించి చీరను తయారు చేసింది.
అన్నా.. వంటలు చేయడమేగాక ఫ్యాషన్ డిజైనర్‌గా, ఫ్లోరిస్ట్ గా రాణిస్తుండడంతో, తన సృజనాత్మకతను కొంత జోడించి... దుంపల గుజ్జు నుంచి తీసిన పొడి, బియ్యప్పిండిలని కలిపి అరఠావు పరిమాణంలో పలుచటి పొరను తయారు చేసి వాటిని చీరకు బేస్‌గా వాడింది. అలా దాదాపు వంద పలుచటి పొరలను వాడి ఐదున్నర మీటర్ల చీరను రూపొందించింది. కేక్ డెకరేషన్స్‌లో వాడే గోల్డెన్ రంగులను చీర అంచుకు అద్దింది. ముప్పై గంటలపాటు శ్రమించి స్వీట్ చీరను తయారు చేసింది. తియ్యటి చీరకు మొత్తం ముప్పై వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. రెండు కేజీల బరువున్న ఈ చీరను భుజం మీద వేసుకుని, సరదాగా కొంగును కొరుకుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యి మాకు ఒకటి చేసివ్వండి అని కామెంట్లు చేస్తున్నారు.
తన తాతయ్య జాకబ్ దగ్గర వంటలు నేర్చుకుంది అన్నా. తాతయ్య గుర్తుగా ఆయన పేరుమీద బేకింగ్, ఫ్లోరల్ ప్రాజెక్టులను చేస్తోంది.‡‘‘జీవితంలో తొలిసారి ఇంత ఖర్చు పెట్టి తియ్యటి చీరను తయారు చేసాను. ఓనంకు ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న ఉద్దేశ్యం తోనే ఈ చీరను తయారు చేసాను. కణజీవ శాస్త్రం (సెల్ బయాలజీ) పరిశోధకురాలిగా సరికొత్తగా చేయాలన్న ఉద్దేశ్యంతో సెల్ బయాలజీని నా బేకింగ్ స్కిల్స్ యాడ్ చేసి ప్రపంచంలోనే తొలిసారి కట్టుకుని కొరుక్కు తినగల చీరను తయారు చేశాను’’ అని అన్నా చెప్పింది.
చీరను వండింది
Published Sat, Aug 28 2021 3:49 AM | Last Updated on Sat, Aug 28 2021 3:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment