ఆషా పట్వాల్
ఆషా పట్వాల్‌కు కళ్లు లేవు. ‘లేనిది మాకు కదా.. మీకు చూడ్డానికేం?’ అంటోంది. ఆమెకు చెవులూ వినిపించవు. వినికిడి లేనిది మాకు కదా.. మీకు వినడానికేం?’ అంటోంది. ‘మమ్మల్నీ కలుపుకోండి.. నిప్పురవ్వలం మేం’ అంటోంది. ఐరాస డేటా ఫోరమ్‌కి మాట లేదు! ఏం పిల్ల..! అనైతే అంది.
మందాకిని, అలకనంద నదుల సంగమంలో ఉంటుంది రుద్రప్రయాగ. మహాశివుడి మూడు కళ్లలా ఉత్తరాఖండ్‌లోని చమోరి, పౌరి, తెహ్రీ జిల్లాల నుంచి రుద్రప్రయాగ ఆవిర్భవించింది. రుద్రుడంటే శివుడు. ఆ రుద్రస్థలిలో జన్మించిన ఆషా పట్వాల్‌కు రెండు కళ్లూ లేవు! కళ్లతోపాటు వినికిడి శక్తీ లేదు! అనుకోకుండా ఏదైనా అద్భుతం జరిగితే ఆ అమ్మాయికి చూపు రావచ్చు. అయితే తనకు చూపు రావాలని కోరుకోవడం లేదు ఆషా. ‘నాలాంటి వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. మమ్మల్ని చూడండి’ అని విజ్ఞప్తి చేస్తోంది. ఆ విజ్ఞప్తిని నిముషం కన్నా తక్కువ నిడివిగల వీడియోలో చూసి ఐక్యరాజ్య సమితి అధికారులు కదిలిపోయారు!
ఆషాకు పదహారేళ్లు. రుద్ర ప్రయాగ్‌లో పదవ తరగతి చదువుతోంది. చూపు, వినికిడి లేకున్నా, మాట ఉంది. చక్కగా ఆటలు ఆడుతుంది. డిస్కస్ త్రోయింగ్, పరుగు పందెం ఆమెకు ఇష్టమైన ఆటలు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ డేటా ఫోరమ్’.. ‘డేటా ఎందుకు అవసరమంటే?’ అనే టాపిక్‌ని ఇచ్చి, నిముషంలోపు వీడియోలో రికార్డ్ చేసి పంపమని ఎంట్రీలు ఆహ్వానిస్తే ఆషా కూడా తన వీడియోను రికార్డ్ చేసి పంపింది. అందుకు ఆమెను ‘సెన్స్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రోత్సహించింది. 15–24 ఏళ్ల వయసులోని వారికి డేటా ఫోరమ్ పెట్టిన ప్రపంచవ్యాప్త పోటీ ఇది. ఆ పోటీ పేరు ‘1 మినిట్ వాయిసెస్ ఆఫ్ యూత్’. షార్ట్‌లిస్టులో పదిమంది ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఆ పదిమందిలో ఒకరు ఆషా పట్వాల్! ‘ఐ యామ్ ఇన్విజిబుల్’అని ఆషా వీడియో మొదలౌతుంది. ‘నేను కనిపించను’ అని. వీడియోలో తను కనిపిస్తూనే ఉంటుంది. సైలెంట్ వీడియో అది. చేతులు కదుపుతూ, కళ్ల సైగలతో చెబుతుంటుంది. మరి కనిపించకపోవడం ఏంటి? తనను, తనలాంటి వాళ్లను ప్రపంచం చూడటం లేదని చెప్పడం.
పట్టించుకోవడం లేదని, లెక్కల్లోకి తీసుకోవడం లేదని గుర్తు చెయ్యడం. జనాభా లెక్కల్లోకి తమలాంటి వాళ్లను కూడా చేర్చుకొమ్మని ఆ వీడియోలో ఆషా అభ్యర్థించింది. తమలాంటి వాళ్లు అంటే.. రెండు విధాలైన అసహాయతలతో ఉన్నవారు అని. బధిరత్వం, అంధత్వం రెండూ ఉన్నవారు. ‘‘డేటాలోకి మమ్మల్నీ తీసుకుంటే ప్రపంచంలో మేమూ ఒక భాగం అవుతాం. ఈ కరోనా సమయంలో మేము జీవితాన్ని మరింత ఛాలెంజ్‌గా తీసుకోవలసి వస్తోంది. అందుకు ఆవేదన చెందడం లేదు. టీచర్‌ని కావాలని నా ఆశయం. అందుకోసం కూడా కష్టపడుతున్నాను’’ అని వీడియోలో చెప్పింది ఆషా. (ఆమె సంజ్ఞలు అర్థం అయేందుకు వీడియోలో కింద టెక్స్‌ట్ వస్తుంటుంది). ‘‘డేటా అవసరం ఏంటి అని కదా మీరు అడిగారు. భవిష్యత్తును నిర్మించుకోడానికి డేటా అవసరం. మీ డేటాలోకి మాకూ స్థానం ఇవ్వండి. జాతిలో స్ఫూర్తిని రాజేసే నిప్పురవ్వలం మేము’’ అని ఆషా ముగించింది. బధిరత్వం, అంధత్వం రెండూ ఉన్నవారు దేశంలో ఐదు లక్షలమంది వరకు ఉన్నారు. అయితే ప్రత్యేకమైన కేటగిరీగా మాత్రం వీళ్లు జనాభా లెక్కల్లో లేరు. ఆ విషయం ఆషా తన వీడియోలో ప్రధానంగా ప్రస్తావించింది.
ఆషాకు పుట్టిన కొన్నాళ్లకు చూపు సమస్య వచ్చింది. కంజెనిటల్ క్యాటరాక్ట్. తండ్రికీ, ఇద్దరు తోబుట్టువులకూ ఆ వైకల్యం ఉంది. డెహ్రాడూన్‌లోని ‘షార్ప్ మెమోరియల్ స్కూల్ ఫర్ బ్లైండ్’ ప్రిన్సిపాల్ సుమనా సామ్యేల్ ఆషాను ఢిల్లీ తీసుకెళ్లి సర్జరీ చేయించారు. తిరిగి రుద్రప్రయాగ్‌కి రాగానే ఆషాకు మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది! దానిని గుర్తించి చికిత్సకు వెళ్లేలోపే వినికిడి శక్తీ పోయింది. మళ్లీ సుమననే ఆషాను డెహ్రాడూన్‌లోని ‘బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ డెఫ్ చిల్డ్రన్’లో చేర్పించి, సంజ్ఞల భాషను నేర్పించారు. ఐక్యరాజ్యసమితి ‘1 మినిట్ వాయిసెస్ ఆఫ్ యూత్’ కాంటెస్ట్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్న ఆషా విజేత అయినా, కాకున్నా ఆమె చూపించే ప్రభావం మాత్రం మనదేశంలోని బధిర–అంధులకు ప్రయోజనకారిగా ఉండొచ్చు. మన దేశంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1న జనగణన మొదలవుతోంది. అందులో కనుక బధిర అంధులకు ఒక కేటగిరీ ఉంటే అది తప్పకుండా ఆషా వీడియో ఎఫెక్టే! తమనూ సెన్సస్ ‘డేటా’లో చేర్చాలన్న ఆమె విజ్ఞప్తి ఇప్పటికే ఐరాస అధికారుల దృష్టిలో ఉంది కనుక ఆ మేరకు ఈలోపే మన ప్రభుత్వానికి వారి నుంచి సూచనలు అందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment