బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశాన్ని రక్షించడం కోసం, పరాయి పాలకుల చేతిలో నుంచి భరతమాతకు విముక్తి ప్రసాదించడం కోసం వేలాది మంది దశాబ్దాల పాటు పోరాడారు. ఆ పోరాటంలో భరతమాత ముద్దుబిడ్డల పోరాటఫలితంగా స్వాతంత్య్రం వచ్చింది. స్వేచ్ఛావాయువులను ఆస్వాదిస్తూ ఆ ముద్దుబిడ్డల పేర్లతో మన దేశంలో అనేక గ్రామాలు, వీథులు, ఊర్లు, జిల్లాలు కొత్తగా నామకరణం చేసుకున్నాయి. ఆ కొత్త పేర్లన్నీ భరతమాత పుత్రులవే. మరి భారత దాస్య విముక్తి పోరాటంలో పాలుపంచుకున్న పుత్రికల పేర్లు మన దేశ ముఖచిత్రంలో ఎన్ని కనిపిస్తున్నాయి? ఇండియన్ రైల్వేస్ మాత్రం తమ వంతుగా బేలాబోస్‌ను గౌరవించింది. ఆమె పేరు మీద ఒక రైల్వేస్టేషన్‌కు ‘బేలా నగర్’ అని పేరు పెట్టింది. ఈ రైల్వేస్టేషన్ వెస్ట్‌బెంగాల్, హౌరా జిల్లాలో కోల్‌కతా నగరం సబర్బన్‌లో ఉంది.
నాటి శరణార్థి శిబిరం!
బేలాబోస్ శరణార్థుల కోసం కోల్‌కతా శివార్లలో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసి ఆ ప్రదేశానికి అభయ్‌నగర్ అని పేరు పెట్టింది. ఆ అభయ్ నగర్ స్టేషన్‌నే రైల్వే శాఖ బేలానగర్‌గా గౌరవించింది. కోల్‌కతా వెళ్లినప్పుడు తప్పక చూడాల్సిన ప్రదేశం బేలానగర్. (చదవండి: మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు!)
బేలా బోస్ ఎవరు?
బేలాబోస్ తండ్రి సురేంద్ర చంద్రబోస్. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి అన్న. బేలా మీద ఆమె చెల్లెలు ఇలాబోస్ మీద నేతాజీ ప్రభావం ఎక్కువగా ఉండేది. అక్కాచెల్లెళ్లిద్దరూ జాతీయోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఝాన్సీరాణి బ్రిగేడ్‌లో బాధ్యతలు చేపట్టింది బేలా. ఐఎన్‌ఐ రహస్య నిఘా విభాగంలో కూడా విజయవంతమైన సేవలందించింది. జాతీయోద్యమంలో పాల్గొన్న వాళ్ల కోసం డబ్బు అవసరమైనప్పుడు తన పెళ్లి ఆభరణాలను అమ్మి డబ్బు సమకూర్చింది.
భారత్– సింగపూర్‌ల మధ్య అత్యంత పకడ్బందీగా రహస్య సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్వహించిందామె. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆమె కుటుంబానికి పరిమితమైంది. దేశవిభజన తర్వాత శరణార్థుల కోసం ఆమె బెంగాల్‌లో ఝాన్సీ రాణి రిలీఫ్ టీమ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. శరణార్థులకు ప్రభుత్వం పునరావాసం కల్పించే వరకు వారికి బేలాబోస్ ఆశ్రయమిచ్చింది. (చదవండి: మొదటి ట్రాన్స్‌జెండర్ ఫొటో జర్నలిస్ట్ కథ చెప్పే క్లిక్)
Comments
Please login to add a commentAdd a comment