సాధారణంగా వెదురును ఇళ్ల నిర్మాణ వస్తువుగానే చూస్తాం. మహా అయితే వెదురుతో చేసే వివిధ రకాల వంటకాలు గురించి విని ఉంటాం. అంతేకానీ ఇది ముఖ సౌందర్యం కోసం వాడటం గురించి చాలామందికి తెలియదు. కానీ నిపుణులు ముఖ వర్చస్సుకు ఎంతగానో ఉపయోగ పడుతుందని నొక్కి మరీ చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల సౌందర్య సమస్యల్ని దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయంటున్నారు. వెదురుతో ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే కొరియన్లు తమ సౌందర్య పరిరక్షణలో భాగంగా దీన్ని విరివిగా వాడుతుంటారట! మరీ అలాంటి వెదురు ఎలా సౌందర్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుందంటే..
ఎలా ఉపయోగపడుతుందంటే..
వెదురులో సిలికా, కొలాజెన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందించి మృదువుగా మార్చుతాయి. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది
అలాగే సిలికా చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.
మొటిమల కారణంగా చర్మం బయటి పొర దెబ్బతింటుంది. తద్వారా వాతావరణంలోని బ్యాక్టీరియా, ఇతర కాలుష్య కారకాలు చర్మంపై దాడి చేస్తాయి. ఇలా జరగకూడదంటే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన సౌందర్య సాధనాల్ని ఉపయోగించమంటున్నారు నిపుణులు. తద్వారా మొటిమల సమస్యకు కూడా చెక్ పెట్టచ్చంటున్నారు.
డీటాక్సిఫై ఏజెంట్‌గా వెదురుకు పేరుంది. కాబట్టి దీంతో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులు/సాధనాల్ని తరచూ ఉపయోగించడం వల్ల చర్మంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
వెదురు ఎక్స్‌ట్రాక్ట్స్‌లో ఉండే అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు.. సూర్యరశ్మిలో ఉన్న అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా రక్షణ కల్పిస్తాయి.
ఫ్రీరాడికల్స్ చర్మ కణాల్ని దెబ్బతీస్తాయి. తద్వారా ముఖంపై ముడతలు, గీతలు.. వంటివి ఏర్పడే ప్రమాదముంది. అదే వెదురుతో తయారుచేసిన ఉత్పత్తుల్ని తరచూ వాడితే ఫలితం ఉంటుంది. వీటి వల్ల చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.
వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి అలర్జీలు, రాషెస్ వంటి చర్మ సమస్యల్ని దూరం చేయడంలో సహకరిస్తాయి. అందుకే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన క్లెన్సర్లు, బాడీవాష్‌లను చర్మానికి ఉపయోగించడం మేలంటున్నారు నిపుణులు.
వెదురులోని సిలికా చర్మ సౌందర్యానికే కాదు.. జుట్టు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషణను అందించడంతో పాటు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. ఫలితంగా జుట్టు ఒత్తుగా, ప్రకాశవంతంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. గోళ్లు పొడవుగా పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు కొందరు. అయితే సరైన పోషణ అందక అవి పదే పదే విరిగిపోతుంటాయి. అలా జరగకూడదంటే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన గోళ్ల సంరక్షణ ఉత్పత్తుల్ని వాడడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందులోని సిలికా గోళ్లకు కావాల్సిన పోషణను అందించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఎలా ఉపయోగించాలంటే..
చర్మ సంరక్షణ, కేశ సౌందర్యం, గోళ్ల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే వెదురు ప్రస్తుతం మార్కెట్లో.. సీరమ్, షీట్ మాస్కులు, ఫేస్ మిస్ట్, మాయిశ్చరైజర్లు, క్లెన్సర్ల రూపంలో అందుబాటులో ఉంది. అలాగే వెదురు ఎక్స్‌ట్రాక్ట్ పరిమాణం ఎక్కువగా ఉన్న కొరియన్ బ్యూటీ ఉత్పత్తుల్ని నిపుణుల సలహా మేరకు వాడచ్చు.
ఇక జుట్టు విషయానికొస్తే.. వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారుచేసిన షాంపూలు, కండిషనర్లు సైతం లభిస్తున్నాయి. అలాగే గోళ్ల ఆరోగ్యాన్ని పెంచే క్రీమ్స్, వెదురుతో తయారుచేసిన మానిక్యూర్ స్టిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంచుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు.
(చదవండి: ఈ విటమన్‌ని తక్కువగా తీసుకుంటే ఎక్కువ కాలం జీవించొచ్చట..! పరిశోధనలో షాకింగ్ విషయాలు..ఝ)
Comments
Please login to add a commentAdd a comment