
పస్తులలో ఉన్న బడుగు చేనేత కార్మికులను లాక్‌డౌన్ నష్టాల నుంచి కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం వారి నుంచి తానే చీరలు కొంటోంది. చీరలు కొనమని ప్రజలకూ పిలుపునిస్తోంది. లాక్‌డౌన్ వల్ల బెంగాల్‌లో చీరలు నేసే దాదాపు అరు లక్షల మంది కార్మికులు కష్టాల్లో, పస్తుల్లో పడ్డారు. లాక్‌డౌన్ తర్వాత కూడా ప్రజలకు బట్టలు కొనే మూడ్ లేకపోవడం వల్ల, ఇతర ఆర్థిక కారణాల వల్ల తగిన స్థాయిలో కొనుగోళ్లు సాగడం లేదు. సొసైటీల మద్దతు ఉన్న పైస్థాయి కార్మికుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా సొంత రెక్కల మీద ఆధారపడిన బడుగు కార్మికులు పూర్తిగా కష్టాల్లో ఉన్నారు. వీరిని కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం ‘చీరలు కొందాం’ కార్యక్రమానికి నడుం బిగించింది.
ముఖ్యంగా బడుగు చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న తూర్పు బుద్వాన్, నాడియా జిల్లాల్లో నేరుగా కార్మికుల నుంచే చీరలు కొన్ని వెంటనే డబ్బు చెల్లిస్తోంది. దీని వల్ల దాదాపు 10 వేల మంది కార్మికులు ఊపిరి పీల్చుకోనున్నారు. బెంగాల్ చేనేత సహకార సంస్థకు ‘తనూజా’ పేరుతో ఔట్‌లెట్ బ్రాంచీలు ఉన్నాయి. రాష్ట్రంలో 70, దేశంలో మరో ముప్పై ఇవి ఉన్నాయి. కార్మికుల నుంచి నేరుగా కొన్న చీరలు వీటి ద్వారా అమ్ముతారు. బెంగాల్‌లో అనే ఏముంది దేశంలో అన్ని చోట్లా చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. వీరి కోసమైనా ఈ సీజన్‌లో సురక్షితమైన జాగ్రత్తలు పాటిస్తూ చీరలు కొనాల్సిన అవసరం ఉంది. లేదా ఆన్‌లైన్‌లో అయినా షాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అందంగా ముస్తబవ్వాల్సిన రోజులు ముందు ముందు తప్పక ఉన్నాయి. రేపటి ముస్తాబు కోసం ఇవాళ చీర కొని సాయపడటం మంచిదే కదా.
Comments
Please login to add a commentAdd a comment