Bengal Woman Distributes Leftover Food From Brother Wedding Pics Viral: వేడుకల సమయాల్లో భారీగా విందుభోజన ఏర్పాట్లు జరుగుతుంటాయి. అతిథులు తినగా మిగిలిపోయే ఆహారం ఎక్కువే ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ ఆహారాన్ని అక్కడి పనివాళ్లు తీసుకెళతారు. నచ్చిన ఒకటి రెండు వంటకాలు ఇంట్లో కొద్దిగా నిల్వ చేసుకుంటారు. మిగిలిన ఆహారాన్ని చెత్తబుట్ట పాల్జేస్తుంటారు. కానీ, కోల్‌కతాలోని పాపియాకర్ అనే మహిళ చేసిన పనికి మాత్రం సర్వత్రా అభినందనలు అందుతున్నాయి. పాపియాకర్ సోదరుడి వివాహ విందుకి ఎక్కడెక్కడి నుంచో అతిథులు విచ్చేశారు. అందుకు తగిన ఏర్పాట్లూ ముందే పూర్తి చేసుకున్నారు.
అర్ధరాత్రి దాకా విందు, వినోదాలు అయ్యాయి. అతిథులు అందరూ వెళ్లిపోయారు. రకరకాల భోజన పదార్థాలు మాత్రం చాలా వరకు మిగిలిపోయాయి. తినేవారు ఎవ్వరూ లేరు. ఉదయానికి ఆ పదార్థాలన్నీ పాడైపోతాయి. అప్పుడు అర్ధరాత్రి దాటిందని కానీ, తనతో పాటు ఎవరూ రావడం లేదని కానీ ఆలోచించకుండా పాపియాకర్ ఆ ఆహారం ఉన్న గిన్నెలన్నీ తీసుకొని రణఘాట్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ప్లాట్‌ఫారమ్‌పై పడుకున్న నిరుపేదలను పిలిచి, వారికి ప్లేట్ల నిండుగా విందు భోజనాన్ని అందించింది. బారులు తీరిన నిరుపేదలు ఆ భోజనాన్ని కడుపారా తిని, ఆమెను, ఆమె సోదరుడిని మనసారా ఆశీర్వదించారు.
పెళ్లి ఫొటోలు తీసే నిలాంజన్ మోండల్ అనే ఫొటోగ్రాఫర్ ఒకరు ఆమె చేస్తున్న ఈ పనినంతా ఆమెకు తెలియకుండా ఫొటోలు తీశాడు. తమ ఫొటోగ్రాఫర్ల గ్రూప్‌లో ‘దయతో కూడిన పనికి సెల్యూట్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు అక్కడక్కడా షేర్ అయ్యి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘దీదీ నీకు కృతజ్ఞతలు చెప్పడానికి భాష లేదు, నీ చేతుల్లో దయ మెండుగా ఉంద’ని ఆమెను కొనియాడుతున్నారు. మనమంతా ఆమెను చూసి నేర్చుకోవాల్సిందే అని ఈ సందర్భంగా తోటివారికి హితవు చెబుతున్నారు.
చదవండి: Boxer Nikhat Zareen: నలుగురు అమ్మాయిలు.. నాన్న ప్రోత్సాహం.. బ్యాంకు ఉద్యోగం..
Comments
Please login to add a commentAdd a comment