ఫిట్‌.. సెట్‌.. | Better shape if you follow the guidance of gym trainers | Sakshi
Sakshi News home page

ఫిట్‌.. సెట్‌..

Published Wed, Dec 4 2024 6:53 AM | Last Updated on Wed, Dec 4 2024 6:53 AM

Better shape if you follow the guidance of gym trainers

జిమ్‌ ట్రైనర్స్‌ ఏం సూచిస్తున్నారు? 

టెక్నిక్స్‌ ఫాలో  అయితేనే ఫలితాలు 

సెట్‌ ఆఫ్‌ వర్కవుట్స్‌పై  అవగాహన తప్పనిసరి 

సరైన డైట్‌తోనే  మెరుగైన ఫలితాలు 

సొగసైన శరీరాకృతి అందరూ కోరుకుంటారు. అయితే దానికి మన వంతుగా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎవరైనా నిత్యం వ్యాయామం చేస్తూ, జిమ్‌ ట్రైనర్స్‌ సూచనలు పాటిస్తే మెరుగైన ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. దీనికి ఆహారపు అలవాట్లు, శరీరతత్వం, ఉద్యోగ సమయం, ఆరోగ్యం పరిస్థితులు, తదితర అంశాలు సైతం శరీరంపై ప్రభావం చూపిస్తాయి. నగరంలో యువత, మహిళలు అధిక శాతం మంది జిమ్‌ బాట పడుతున్నారు. ఇందులో కొంత మంది ప్రాథమిక వ్యాయామానికే పరిమితం అవుతుండగా, మరికొంత మంది మాత్రం తమ శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలపై దృష్టి పెడుతున్నారు. ట్రైనర్స్‌ ఏం చెబుతున్నారు? ఎలాంటి డైట్‌ పాటించాలి? తెలుసుకుందాం..!    

నగర యువత అత్యధిక శాతం మంది తమ శరీరాకృతిని ఆరు పలకల ఆకృతిలోకి మార్చుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పొట్ట ప్రదేశంలో అనవసరమైన కొవ్వులను కరిగించుకోడానికి ఆబ్డామిన్‌ స్ట్రెచ్చెస్, క్రంచెస్‌ వంటి వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పొట్ట భాగం సరైన ఆకృతిలోకి వస్తోంది. జంపింగ్‌ స్వా్కట్స్‌ చేయడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు. ఎత్తుకు సరిపడేంతగా సన్నబడడం, షోల్డర్స్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తున్నారు. శరీరంలో వృధాగా పేరుకుపోయే కొవ్వులు, కేలరీలను కరిగించేందుకు బర్పీస్‌ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మౌంటెనింగ్, క్లైంబింగ్స్‌ వంటివి ఫ్లాట్‌ స్టొమక్‌ని అందిస్తాయి.  

డంబెల్స్‌తో డిఫరెంట్‌ సెట్స్‌.. 
చూడచక్కని షోల్డర్స్‌ కోసం డంబెల్స్‌తో వర్కౌట్‌ చేయాలి. బెంచ్‌ ప్రెస్‌ చేయడం వల్ల గుండె భాగంపై ప్రభావం కనిపిస్తుంది. చెస్ట్‌ కండరాలు స్పష్టమైన అమరికతో ఆకర్షిణీయంగా తయారవుతాయి. వీపు వైపు బలంగా, ఫిట్‌గా ఉండాలంటే పుల్‌ డౌన్, నడుము బలంగా తయారవడానికి డెడ్‌ లిఫ్ట్‌ వర్కౌట్‌ చేయాలి. ప్లాంక్‌ ఫోశ్చర్‌పై పరుగు తీస్తే గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామాలు ముఖ్యంగా భుజాలు, గుండె భాగం, కాళ్లపై ప్రభావం చూపిస్తాయి. మజిల్స్‌ బలంగా తయారై, శరీరాన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుతుంది. 

మహిళలను వేధిస్తున్న అధిక బరువు.. 
ఇటీవలి కాలంలో జిమ్‌లకు వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పిల్లలు పుట్టిన తరువాత మహిళలు బరువు పెరుగుతున్నారు. ఇంట్లో సరైన వ్యాయామం లేకపోవడంతో వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. బెల్లీఫ్యాట్‌ తగ్గించుకోవడం, గుండె భాగం ఫిట్‌గా ఉండటం, నడుము బలంగా తయారు కావడానికి వ్యాయామాలు చేస్తున్నారని ట్రైనర్స్‌ పేర్కొంటున్నారు.

శరీరం దృఢంగా ఉండాలంటే.. 
శరీరం దృఢంగా, బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. అయితే బిజీ సిటీ లైఫ్‌లో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్ర అనేక అంశాలు శరీర పటుత్వంపై ప్రభావం చూపిస్తాయి. సరైన వ్యాయామం చేయకుంటే అనేక వ్యాధులకు మనం ఆహ్వానం పలికినట్లే అవుతుంది. శరీరం ఫిట్‌గా ఉండేందుకు క్రాస్‌ ఫీట్, బరీ్పస్, జంపింగ్‌ తదితర వ్యాయామాలు చేయడం మంచిది. శరీర కండరాలు సరైన ఆకృతిలో పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారపు క్రమశిక్షణ అవసరం. బయట చిరు తిళ్లు, నూనె వంటకాలకు దూరంగా ఉండాలని జిమ్‌ ట్రైనర్స్‌ సూచిస్తున్నారు.

శరీరం ఫిట్‌గా తయారైంది.. 
రెండేళ్లుగా నిత్యం జిమ్‌ చేస్తున్నాను. వారంలో కనీసం మూడు రోజులు 60 నుంచి 70 కిలో మీటర్ల వరకూ పరుగెత్తుతాను. గతంలో కిడ్నీలో స్టోన్స్, అల్సర్, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు బాధించేవి. వ్యాయామం చేయడం మొదలు పెట్టిన తర్వాత సుమారు 20 కిలోల వరకూ బరువు తగ్గాను. ఇప్పుడు శరీరం ఫిట్‌గా తయారైంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే రాష్త్ర స్థాయి పరుగు పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాను. 
– శ్రీశైలంగౌడ్, బండ్లగూడ

క్రమశిక్షణ అవసరం.. 
యువతలో ఎక్కువ మంది జిమ్‌ చేసే సమయంలో శరీరాకృతి కోసం అడుగుతున్నారు. పెద్దలు సాధారణ వ్యాయామాలపై దృష్టిసారిస్తున్నారు. మహిళలు సన్నబడటం, బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గించుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. డైట్‌ పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సమయం నడక, పరుగు తీయడం 
మంచిది. – సద్దాం, జిమ్‌ ట్రైనర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement