చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కనేది సిన్నీ సోషియా. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో డాక్టర్ కావాలనే కోరిక కలగానే మిగిలిపోయింది. అయినా నిరాశపడకుండా ఫైన్ ఆర్ట్స్ చదివింది. మధుబని పెయింటింగ్స్‌తో మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది.
బిహార్‌కు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సోషియాకు ముగ్గురు అక్కచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచే ఎంతో చురుకుగా ఉండే సోషియా డాక్టర్ కావాలనుకుంది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం కావడంతో మెడిసిన్ చదవలేకపోయింది. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో స్నేహితురాలి సలహా మేరకు ఫైన్ ఆర్ట్స్ కోర్సులో చేరింది సోషియా.
కానీ తన దగ్గర కోర్సు ఫీజు కట్టడానికి సరిపడినన్ని డబ్బులు లేవు. అయినా నిరాశపడలేదు సోషియా. తనకు బాగా వచ్చిన విద్య మెహందీ పెట్టడం. దానిని ఉపయోగించే పాకెట్ మనీ సంపాదించుకోవాలనుకుంది. పెళ్లికూతుళ్లకు మెహందీ డిజైన్లు వేస్తూ వచ్చిన డబ్బులను కాలేజీ ఖర్చులకు వాడుకునేది. ఇలా కష్టపడి ఆర్ట్స్ కోర్సు చేస్తోన్న సోషియాను చుట్టుపక్కల వాళ్లు ‘‘ఆర్టిస్ట్ అవుతావా? మెహందీ డిజైనర్ అవుతావా?’’ అని అవహేళన చేస్తుండేవారు.
అవేవీ పట్టించుకోకుండా కోర్సు పూర్తిచేసి ఆర్టిస్ట్‌గా మారింది. తనకు వచ్చిన కళకు మెహందీ పెట్టే నైపుణ్యం తోడు కావడంతో అతికొద్దికాలంలో సోషియా మంచి ఆర్టిస్ట్‌గా మారింది. ఒక్కపక్క హెన్నా డిజైన్లు, వాల్ పెయింటింగ్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, రైళ్ల బోగీలపై మధుబని పెయింటింగ్స్ వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అనేక ప్రాజెక్టులు చేసే అవకాశం లభించింది.
బెగుసరాయ్‌లో ఒకటి, పాట్నాలో రెండు స్టూడియోలను నిర్వహిస్తూ లక్షల్లో సంపాదించడమేగాక దాదాపు ఇరవై అయిదు మంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పిస్తోంది. సోషియా పెయింటింగ్‌లకు ఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు డిమాండ్ ఉండడం విశేషం. జీవితంలో ప్రతి ఒక్కరికీ కల ఉంటుంది. కలను నిజం చేసుకునే క్రమంలో అవాంతరాలు ఎదురు కావడం సహజం.
అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అనుకున్నది సాధించలేం. ఇటువంటి సమయంలో అంతా మన మంచికే జరిగిందనుకుని ముందుకు సాగాలి. అప్పుడే మనలో దాగిన మరో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అప్పుడు సరికొత్త నైపుణ్యంతో అనుకున్నదానికంటే మరింత ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అన్నమాటకు సోషియా జీవితం ఉదాహరణగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment