సత్యవేణి టెన్నిస్ క్రీడాకారిణి. ఓరోజు బైక్ యాక్సిడెంట్ అయింది! ‘మీరిక ఆడలేరు’ అన్నారు డాక్టర్లు. ఇంట్లోనే ఉండిపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లింది. తల్లి తల్లడిల్లిపోయింది. చూసి చూసి.. ఓ రోజు.. కూతుర్ని బైటికి లాక్కొచ్చింది. ఎదురుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్! ‘బైక్ నేర్చుకున్నాకే ఇంట్లోకి రా..’ అని..తలుపులు వేసేసింది! ఆ తర్వాత చాలా నేర్చుకుంది సత్యవేణి. ముఖ్యంగా ధైర్యంగా ఉండటం. ఇప్పుడామె బైక్ పెయింటర్‌గా రాణిస్తోంది. అమ్మాయిలకు బైక్ డ్రైవింగూ నేర్పిస్తోంది!
కాలర్ : ‘హలో.. నా బైక్‌ని సూపర్ యూనిక్ డిజైన్‌తో మార్చేయాలి. మీ ఓనర్‌కి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి’
సత్యవేణి : ‘నేనే ఓనర్‌ని. మీరు ఒకసారి వచ్చి డిజైన్ సెలక్ట్ చేసుకుంటే అలాగే చేసి ఇస్తాం’
కాలర్ : ‘లేడీస్.. బైక్ పై పెయింట్ చేయడమా?!...’ వెంటనే ఫోన్ కట్ అయిన సౌండ్..ఫోన్ పక్కన పెట్టేస్తూ .. ‘ఇదండీ.. అమ్మాయిలు మోటార్ సైకిల్‌పై పెయింట్ చేయలేరని, అదంతా మగవారి పనే అనుకుంటున్నారు. ఫోన్ చేస్తారు, లేడీ వాయిస్ వినగానే వారి టోన్ మారిపోతుంది’ నవ్వేసింది సత్యవేణి.
∙∙
‘లేడీ విత్ బుల్లెట్’ అని అంతా పిలిచే సింగజోగి సత్యవేణి మోటార్ సైకిళ్లపై, హెల్మెట్లపై పెయింటింగ్ వేయడంలో బిజీగా ఉంటోంది. ఇప్పటికి వందల బైక్‌లపై, హెల్మెట్లపై క్రియేటివ్‌గా పెయింట్స్ వేసి ఆకట్టుకుంది. మైటార్‌సైకిల్‌పై ఆర్ట్ వేసే మహిళలు మన దేశంలో ఎవరూ లేరు. ఇక ముందు ఎవరైనా ఈ ఫీల్డ్‌లోకి రావాలనుకుని సెర్చ్ చేస్తే నా పేరే కనపడుతుంది’ అని గర్వంగా చెబుతున్న సత్యవేణి ‘హస్కీ కేపర్స్’ ఎన్జీవో ద్వారా రెండేళ్లుగా మహిళలకు బైక్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తోంది. హైదరాబాద్ బాలానగర్‌లో ఉంటున్న సత్యవేణికి బుల్లెట్‌తో దోస్తీ ఎలా కుదిరింది? మగవారే ఉన్న రంగంలో తను ఎలా రాణిస్తోంది? ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
టెన్నిస్‌కు బ్రేక్.. డిప్రెషన్‌తో లాక్
‘‘టెన్నిస్ క్రీడాకారిణిగా రాణించాలని నా ధ్యేయంగా ఉండేది. నేషనల్ లెవల్ ప్లేయర్‌ని కూడా. కాలేజీలో చదువుతున్నప్పుడు ఓ రోజు ప్రాక్టీస్‌కి మా అన్నయ్యతో కలిసి బైక్‌పై వెళుతుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో మమ్మల్ని ఢీకొన్న బైక్ వచ్చి నా కాలు మీద పడింది. సర్జరీ అయ్యాక ‘ఈ ఇబ్బందితో ఎక్కువ కాలం ప్లేయర్‌గా రాణించలేరు’ అన్నారు డాక్టర్లు. దీంతో నా కెరియర్‌కు ఫుల్‌స్టాప్ పడింది. డిప్రెషన్‌కు లోనయ్యాను. ఏడు నెలల పాటు చీకటి గదే లోకంగా బతికాను. పొడవాటి నా జుట్టును కత్తిరించుకున్నాను. చేతులు కాళ్లు కోసుకునేదాన్ని. అంతా శూన్యంలా ఉండేది.
ఇదంతా చూసిన మా అమ్మ కళ్యాణి తట్టుకోలేకపోయింది. ఓ రోజు గదిలో నుంచి నన్ను బయటకు లాక్కొచ్చింది. ఎదురుగా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్! ఆశ్చర్యంగా అమ్మవైపు, బైక్ వైపు చూశాను. నాకు డ్రైవింగ్ రాదు. పైగా, బైక్ వల్లే నా కెరియర్‌కు ఫుల్‌స్టాప్ పడింది. బైక్ అంటే నాకు అపరిమితమైన భయం. అమ్మ బైక్ కీస్ నా చేతులో పెట్టి ‘ఈ బైక్ నడపడం నేర్చుకుని ఆ తర్వాతే ఇంటికి రా! అప్పటి వరకు నీ ముఖం నాకు చూపించొద్దు’ అంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ కోపం తగ్గాలంటే నేను బైక్ నేర్చుకోవాలి. అదొక్కటే మైండ్‌లో ఉంది. మా కజిన్ సాయంతో బైక్ తీసుకొని గ్రౌండ్‌కెళ్లా. రెండు రోజుల్లో బుల్లెట్ నడపడం నేర్చుకున్నాను. నిరాశ స్థానంలో ఉత్సాహం వచ్చి చేరింది.
కస్టమైజ్డ్ బైక్ పెయింటింగ్
రోజూ 150 – 200 ల కిలోమీటర్లు బైక్ పై తెగ తిరిగేసేదాన్ని. లాంగ్ డ్రైవ్, సోలో డ్రైవ్.. మైండ్ ఫ్రెష్ అయ్యింది. బైక్ నా ఫ్రెండ్ అయిపోయింది. నా ఉత్సాహం చూసి అమ్మ చాలా సంతోషించింది. కొన్నాళ్లుగా బండి–నేను అంతే. పెయింటింగ్ చిన్నప్పటి నుంచి నాకో హాబీగా ఉండేది. ఆ ఆలోచనతో నా బండికి కొత్త రూపు తీసుకురావాలనుకున్నాను అదీ పెయింటింగ్ ద్వారా. అనుకున్నట్టుగా నాదైన డిజైన్‌ని బైక్‌పై వేశా. ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశా. చాలా మందికి నచ్చింది. మా బైక్‌కి డిజైన్ చేస్తారా అని అడిగారు కొందరు. దీంతో బైక్స్ కస్టమ్ డిజైన్ ఆర్ట్ వర్క్‌ను కెరియర్‌గా మార్చుకుంటే బాగుంటుంది అనిపించింది.
అప్పుడు గూగుల్ మొత్తం వెదికాను. ఎవరైనా మహిళలు ఈ రంగంలో ఉన్నారా అని. ఇండియా మొత్తమ్మీద బైక్‌పై పెయింటింగ్ చేసే మహిళలెవరూ లేరు. మా అక్క సంగీతకు యానిమేషన్‌లో నైపుణ్యం ఉంది. తనతో నా ఆలోచనలు పంచుకున్నాను.గుడ్ ఐడియా అంది. దీనిని వ్యాపారంగా మొదలుపెట్టాలని womeneoteric customs ప్రారంభించాను. వచ్చిన ఆర్డర్స్‌ను వచ్చినట్టే సరికొత్తగా డిజైన్ చేసి ఇస్తున్నాను. వరల్డ్ ఎగ్జిబిషన్లలో నేను డిజైన్ చేసిన బైక్, హెల్మెట్ పెయింటింగ్స్ ప్రదర్శనకు నిలిచాయి. ఇప్పటికి నాలుగువందల వరకు బైక్స్, హెల్మెట్స్ డిజైన్స్ చేశాను.
బైక్ డ్రైవింగ్ క్లాస్‌లు
ఇప్పుడు విజయవాడలోనూ మహిళలకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. బైక్ నేర్చుకోవడానికి వస్తున్న మహిళలను చూస్తుంటే చాలా సంతోషమనిస్తుంది. ‘మా అమ్మకు డ్రైవింగ్ నేర్పించండని కొడుకు, మా ఆవిడకు నేర్పించండని భర్త, మా కూతురుకు నేర్పించమని తండ్రి.. ఇలా మగవాళ్లే స్వయంగా తమ ఇంటి మహిళలకు బైక్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం ఆనందమేస్తోంది. ఆరేళ్లుగా ఈ బైక్ నా జర్నీని చాలా అందంగా మార్చుతూనే ఉంది’ అని వివరించారు సత్యవేణి.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment