జయలలితకు కాస్ట్యూమ్స్ కుట్టాలి. ఇప్పటివా? 1960లవి, 70లవి, 80లవి. ఆమె లేదు. కాని ఆమెలా చేయనున్న కంగనాకు ఆ తళుకు తేవాలి. బెళుకు కలిగించాలి. మాయా ప్రతిబింబం నిలబెట్టాలి. ఎవరు దీనికి సరైనవారు? నీతా లుల్లా పేరు అందరూ చెప్పారు. ‘తలైవి’కి అద్భుతంగా పని చేసివిడుదలకు ముందే అందరి ప్రశంసలు పొందుతున్ననీతా లుల్లా ఈ సినిమా కోసం పడిన శ్రమను తెలిపే కథనం...వస్త్ర నాయిక
జయలలిత పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులు తెలుగులో ఆమె చేసిన సినిమాలు గుర్తుకొస్తాయి. అక్కినేనితో ‘అయ్యయ్యో బ్రహ్మయ్య... అన్యాయం చేసేవేమయ్యా’ (అదృష్టవంతులు), ఎన్.టి.ఆర్‌తో ‘విన్నారా... అలనాటి వేణుగానం’ (దేవుడు చేసిన మనుషులు)... వెండి తెర మీద ఆమె నిండైన రూపం ఎవరు మర్చిపోగలరు. కాని తమిళులకు ఆమె ‘అమ్మ’, ‘విప్లవ వనిత’, ‘విప్లవ నాయకురాలు’. దాంతో పాటు తమ అభిమాన నటుడు, నాయకుడైన ఎం.జి.ఆర్‌కు సరిజోడి.
అంతేనా?... తమ సామాజిక, రాజకీయ చరిత్రలో ఆమె ఒక అవిభాజ్యమైన భాగం. సౌత్‌లో సినిమా రంగం నుంచి ముఖ్యమంత్రులైన నటులు ముగ్గురే. ఎం.జి.ఆర్, ఎన్.టి.ఆర్, జయలలిత. (కరుణానిధి నటుడు కాదు). ఎన్.టి.ఆర్ బయోపిక్‌ను తెలుగులో రెండు భాగాలుగా తీశారు. ఇప్పుడు జయలలిత బయోపిక్ ప్రతిష్టాత్మకంగా తయారవుతోంది. సినిమా పేరు ‘తలైవి’. కంగనా రనౌత్ హీరోయిన్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోందని చెప్పవచ్చు. ఈ సినిమాలో కంగన అచ్చు జయలలిత లానే కనిపిస్తోందని ప్రశంసలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన నీతా లుల్లా. మిగిలిన సినిమాలకు పని చేయడం వేరు... ఈ సినిమాకు పని చేయడం వేరు అంటోందామె.
ఆ కాలం... ఆ రూపం
‘తలైవి’ సినిమా కోసం కంగనా రనౌత్‌ను జయలలితగా చూపించడం ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన నీతా లుల్లాకు సవాలుగా నిలిచింది. ‘ఇందుకు కారణం ఆమె రూపం, సినిమాలు, పాటలు, తెర మీద, తెర బయటి ఆహార్యాలు ప్రజల దృష్టిపథం నుంచి ఇంకా చెరిగిపోకపోవడమే. జయలలిత ఈ సినిమా తెర మీద నటిగా కనిపిస్తారు. ఆ తర్వాత రాజకీయ వేత్తగా, ఆ తర్వాత సి.పిగా రకరకాల దశల్లో కనిపిస్తారు. ప్రతిసారి ఆమె రూపం మారింది. ఆహార్యం మారింది. కాస్ట్యూమ్స్ మారాయి. వాటిని యథాతథంగా మళ్లీ చూపించడానికి నేను చాలా శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది’ అంటారు నీతా లుల్లా. ‘జయలలిత ఫ్యాషన్స్‌ను సినిమాల్లో చాలా ఫాలో అయ్యారు. ఆమె బట్టలు, ఆభరణాల్లో ప్రత్యేకత ఉంది. వాటిని మళ్లీ చూపడానికి ఆమె పాటలు, సినిమాలు లెక్కలేనన్నిసార్లు చూడాల్సి వచ్చింది’ అంటారు నీతా లుల్లా.
కంగనా కోరిక మీద
బాలీవుడ్‌లో ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ అయిన నీతా లుల్లా కంగనా నటించిన ‘మణికర్ణిక’కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. దాంతో ‘తలైవి’కి కూడా పని చేయమని కంగనా ఆమెను కోరింది. ‘నా పని మొదలయ్యాక ఎం.జి.ఆర్‌గా నటిస్తున్న అరవింద్ స్వామికి కూడా కాస్ట్యూమ్స్ చేయమని కోరారు. ఆ పని కూడా సంతోషంగా చేశాను’ అంటుంది నీతా లుల్లా. ఈ సినిమాలో ఆ కాలపు చీరల కోసం ఫ్రెండ్స్ అమ్మమ్మలు, నాయనమ్మలను బతిమిలాడి సంపాదించడం దగ్గరి నుంచి, కంచిలో మళ్లీ నాటి చీరల్లాంటివి తిరిగి నేయించడం దగ్గరి నుంచి, నాటి డ్రస్సులను, చెప్పులను, ఆఖరకు నాటి బ్రాలను కూడా స్టడీ చేయాల్సి వచ్చిందని నీతా అంటారు. ‘ఏ డిటైల్‌ను మిస్ కాలేదు’ అంటారామె.
గెటప్ టెస్ట్
కంగనాను ఈ సినిమా కోసం తలైవిగా తయారు చేశాక, అంటే సి.ఎం గెటప్ వేశాక ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఆమెను తీసుకుని కారులో చెన్నై బిజీ దారిలో తీసుకెళ్లి దించింది నీతా. కారులో నుంచి దిగిన కంగనాను ఒక ముసలామె చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. ఆ వెంటనే వచ్చి చుట్టేసుకుంటూ ‘అమ్మా.. అమ్మా’ అని జయలలితను చూసి పులకించినట్టే పులకించింది. ‘అది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు’ అంటుంది నీతా లుల్లా.
‘చాందిని’, ‘తాళ్’, ‘జోధా అక్బర్’, ‘దేవదాస్’ వంటి భారీ సినిమాలకు కాస్ట్యూమ్స్ చేసిన నీతా ప్రస్తుతం తెలుగులో భారీగా మొదలైన ‘శాకుంతలం’కు కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. మహిళా కాస్టూమ్ డిజైనర్‌గా ఇప్పటికి నాలుగుసార్లు జాతీయ అవార్డులు పొందిన నీతా ఎందరికో స్ఫూర్తి. విజయాన్ని ఆమె ఇలాగే పర్‌ఫెక్ట్‌గా కుట్టుకుంటూ వెళ్లాలని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ
చదవండి: 'తలైవి' రిలీజ్‌కు కరోనా షాక్
Comments
Please login to add a commentAdd a comment