మగ ప్రపంచంపై.. రియా కోపంగా ఉందా? | Bollywood Roses Are Red Campaign For Rhea Chakraborty | Sakshi
Sakshi News home page

గులాబీలు ఎరుపు

Published Fri, Sep 11 2020 8:04 AM | Last Updated on Fri, Sep 11 2020 8:06 AM

Bollywood Roses Are Red Campaign For Rhea Chakraborty - Sakshi

రోజెస్‌ ఆర్‌ రెడ్‌ స్లోగన్‌ ఉన్న  టీ షర్ట్‌తో రియా చక్రవర్తి

‘రోజెస్‌ ఆర్‌ రెడ్‌.. వయలెట్స్‌ ఆర్‌ బ్లూ..’ నర్సరీ రైమ్‌. రియా టీ షర్ట్‌పై అదే రైమ్‌! ఏం చెబుతోంది రియా? ఇన్నోసెంట్‌ననా? దగాపడిన ఆడపిల్లననా? ‘స్మాష్‌ పేట్రియార్కీ..’ ఈ మాట కూడా ఉంది! మగ ప్రపంచంపై.. రియా కోపంగా ఉందా? ఆ స్లోగన్‌ భావమేంటి?

మంగళవారం అరెస్ట్‌ అవడానికి ముందు రియా చక్రవర్తి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌.సి.బి.) విచారణకు బ్లాక్‌ టీ షర్ట్‌ వేసుకుని వచ్చారు. ఆ టీ షర్ట్‌ మీద ఒక స్లోగన్‌ ఉంది. వదులుగా ఉంటుంది కదా అని చేతికి అందిన ఆ టీ షర్ట్‌ను రియా వేసుకుని ఉండొచ్చు. అయితే ఆ స్లోగన్‌కి అర్థం ఏమై ఉంటుందని గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో చర్చ సాగుతోంది. ఎన్‌.సి.బి. రియాను నిర్బంధంలోకి తీసుకున్న వెంటనే ఆ రాత్రి ఆమె ఆ కార్యాలయంలోనే ఉండిపోయారు. మర్నాడు ఉదయం ఆమెను ముంబైలోని బైక్యులా జైలుకు తరలించారు. రియా ఇప్పుడు బయట లేరు. ఆమె వేసుకొచ్చిన టీ షర్ట్‌ మీది స్లోగన్‌ మాత్రం రెక్కలొచ్చి స్వేచ్ఛా విహంగంలా విహరిస్తోంది.

‘రోజెస్‌ ఆర్‌ రెడ్‌. వయొలెట్స్‌ ఆర్‌ బ్లూ. లెటజ్‌ స్మాష్‌ పేట్రియార్కీ. మి అండ్‌ యు’.. ఇదీ రియా టీ షర్ట్‌ పై ఉన్న స్లోగన్‌. ‘గులాబీలు ఎర్రగా ఉంటాయి. వయలెట్‌ పూలు నీలంగా ఉంటాయి. (వయలెట్‌ పూలంటే మన బిళ్ల గర్నేరులా బ్లూ కలర్‌లో ఉండే ఇంగ్లిష్‌ వాళ్ల ఫ్లవర్స్‌). నేను, నువ్వు పురుషాధిక్య పరంపర భావనలను ధ్వంసం చేద్దాం’ అని ఈ స్లోగన్‌కి అర్థం. ఇది అందరికీ తెలుసు. ఆ భావం వెనుక ఉన్న రియా భావన ఏమిటన్నది ఇప్పుడు డిస్కషన్‌. ‘చూడండి.. ఆ పిల్లకు ఎంత పొగరో. ఆ మాటలకు అర్థం ఏమిటి? మగవాళ్ల వల్ల తన జీవితం ఇలా అయిందని టీ షర్ట్‌ వేసుకుని చెబుతోందా! ఆ నడక చూశారా? ఎంత నిర్లక్ష్యంగా అడుగులు వేస్తోందో! ఆ చూపు కూడా. భయం లేకుండా, అపరాధినన్న పశ్చాత్తాపమే లేదు’ అని అప్పుడే ఎవరో రెండు మూడు ట్వీట్‌లు కూడా పెట్టేశారు.

అయితే రియా వేసుకున్న స్లోగన్‌ టీ షర్ట్‌ గతంలో కొందరు బాలీవుడ్‌ నటులు (స్త్రీ, పురుషులిద్దరూ) వేసుకున్న లాంటిదే. ఒకవేళ రియా ఉద్దేశపూర్వకంగా ఆ స్లోగన్‌ను ఎంపిక చేసుకుని ఉన్నా కూడా.. ‘లెటజ్‌ స్మాష్‌ పేట్రియార్కీ’ అన్నంత వరకు ఓకే. మహిళను కాబట్టి ఈ పురుషాధిక్య సమాజం నన్ను మీడియా రూపంలో, సుశాంత్‌ అభిమానుల రూపంలో వెంటాడుతోంది అని చెప్పదలచుకున్నారని అనుకోవచ్చు. మరి.. ‘రోజెస్‌ ఆర్‌ రెడ్‌. వయలెట్స్‌ ఆర్‌ బ్లూ’ ఏంటి! చిన్న పిల్లల రైమ్‌లా ఉంటేనూ..! ఆ రైమ్స్‌తో రియా సంకేతపరిచేది ఏముంటుంది? అసలు రియాను కాదు.. పూలకు, పితృస్వామ్యానికీ సంబంధ లేకుండా లింక్‌ కలిపి స్లోగన్‌ సృష్టించి, టీ షర్ట్‌లు తయారు చేసినవాళ్లను అనుకోవాలి. అలాగైతే ‘ది సోల్డ్‌ స్టోర్‌’ అనే ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ దుస్తుల దుకాణాన్ని, ‘గివ్‌హర్‌ 5’ అనే శానిటరీ నేప్‌కిన్‌ల ఉద్యమకర్తల బృందాన్ని అనుకోవాలి. 

రెండేళ్ల క్రితం ఇదే స్లోగన్‌ ఉన్న టీ షర్ట్‌లతో శానిటరీ నేప్‌కిన్‌ల క్యాంపెయిన్‌కు ప్రచారకర్తలుగా ఉన్న దియా మీర్జా, రాహుల్‌ బోస్, మిస్‌ మాలిని, అరణ్యా జోహర్, తన్మయ్‌ భట్, రోష్నీ కుమార్‌
                                                                                                   
ఇండియాలో 80 శాతం మహిళలకు శానిటరీ ప్యాడ్స్‌ కొనే ఆర్థిక స్థోమత లేదని గివ్‌హర్‌ 5 చెబుతోంది. ఆ కారణంగా నెలలో ఐదు రోజులు స్కూళ్లకు, ఆఫీస్‌లకు వెళ్లలేకపోవడం చూసి గివ్‌హర్‌ 5 కార్యకర్తలు ‘ది సోల్‌ స్టోర్‌’తో ఒక ఒప్పందానికి వచ్చి, ‘రోజెస్‌ ఆర్‌ రెడ్‌..’ స్లోగన్‌తో కొన్ని టీ షర్ట్‌లు తయారు చేయించారు. ‘మీరు ఒక్క టీ షర్ట్‌ కొంటే ఒక ఏడాదికి సరిపడా శానిటరీ నేప్‌కిన్‌లను ఒక ఆడపిల్లకు ఇచ్చినట్లే’ అని ఆ షర్ట్‌లను రాహుల్‌ బోస్, దియామీర్జా, తన్మయ్‌ భట్, మిస్‌ మాలినీ, అరణ్య జోహర్, రోష్నీ కుమార్‌ వంటి సెలబ్రిటీల చేత రెండేళ్ల క్రితం ప్రచారం కూడా చేయించారు. ఆ టీ షర్ట్‌ వేసుకోవడమే కాదు, అరిచేతిలో ‘రోజెస్‌ ఆర్‌ రెడ్‌’ అని కూడా (ప్రచారంలో భాగంగా) రాయించారు. ఆనాటి టీ షర్ట్‌లు ఉన్నది ఒకటే వెర్షన్‌. మళ్లీ తయారు కాలేదు. ఆ వెర్షన్‌ షర్ట్‌నే ఇప్పడు రియా వేసుకున్నారు. సోల్‌ స్టోర్, గివ్‌హర్‌5 టీమ్‌లు రెడ్‌ రోజెస్‌ అనే మాటను మహిళలు ‘పీరియడ్స్‌’లో ఉన్న సమయానికి ప్రతీకగా ఉపయోగించాయి. బహుశా రియా తను అరెస్ట్‌ అయ్యే టైమ్‌లో ఓపికలేని బలహీన స్థితిలో (పీరియడ్స్‌ వల్ల) ఉన్నానని చెప్పదలిచారా! మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నాం. 
                                                                                                                
అసలు ఈ రోజెస్‌ ఆర్‌ రెడ్‌ అనే మాట ఈ టీ షర్ట్‌ల వాళ్లకు ఎక్కడ దొరికింది, పిల్లల రైమ్స్‌లా ఉంది అనుకున్నాం కదా. నిజమే, పిల్లల రైమ్స్‌ నుంచే తీసుకుని, ఆ మాటకు ‘లెటజ్‌ స్మాష్‌ పేట్రియార్కీ’ అనే మాటను తెచ్చి జోడించారు. మహిళల శారీరక ధర్మాల గురించి పట్టని ఈ పితృస్వామ్య వ్యవస్థను (పేట్రియాట్రీని) నేనూ నువ్వే ధ్వంసం చేయాలి అని ఓ స్లోగన్‌ సృష్టించారు. 1784 నాటి ఇంగ్లిష్‌ నర్సరీ రైమ్స్‌లో ఉండే ‘రోజెస్‌ ఆర్‌ రెడ్‌కు, వయలెట్స్‌ ఆర్‌ బ్లూ’ అనే లైన్‌లకు కొనసాగింపు ఇలా ఉంటుంది.. ‘సుగర్‌ ఈజ్‌ స్వీట్‌. అండ్‌ సో ఆర్‌ యు’ (చక్కెర తియ్యగా ఉంటుంది. నువ్వు కూడా తియ్యగా ఉంటావు) అని. రియా తన స్నేహితుడు సుశాంత్‌ సింగ్‌ని స్వీట్‌ బాయ్‌ అని పిలిచేవారని ఆమె వాట్సాప్‌ చాట్‌లను బట్టి తెలుస్తోంది. ఆమెకు మాత్రం చేదు మిగిలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement