
మార్నింగ్ వాక్ చేస్తోందా యువతి.
‘అమ్మాయ్. నా దగ్గర కాసేపు కూచుంటావా?’
అడిగిందో పెద్దవిడ.
పరిచయం లేదు. పిలించింది కదా అని కూచుంది.
ఆ పెద్దావిడ అరగంట సేపు ఏవేవో మాట్లాడింది.
తన గురించి పిల్లల గురించి చెప్పింది.
ఏవేవో ఆలోచనలు వెళ్లబోసుకుంది. అంతా అయ్యాక
‘నేను మాట్లాడితే వినే మనుషులు లేరమ్మా. థ్యాంక్యూ’ అని వెళ్లిపోయింది.
ఊహ తెలిసినప్పటి నుంచి పసిబిడ్డ మాట్లాడటం మొదలెడతాడు.
రెండవ పసితనం వృద్ధాప్యమే.
ఆ సమయంలో పెద్దవాళ్లతో ఎవరూ మాట్లాడరు.
వారు మాట్లాడితే వినరు.
వారు నోరు కట్టేసుకోలేక తమ గోడు వినే మనుషుల కోసం
ఎదురు చూస్తున్నారు. ఈ వర్తమాన పరిస్థితిపై కథనం.
కేస్‌స్టడీ 1:
కోటేశ్వరమ్మకు 70 ఉంటాయి. కూతురి దగ్గర ఉంటోంది. టూ బెడ్‌రూమ్ ఫ్లాట్ అది. డైనింగ్ ఏరియాలో మంచం వేసి ఆమెకు ఉండే ఏర్పాటు చేశారు. కూతురు ఇంట్లో ఉంటుంది కాని ఇంటి పనులే సరిపోతాయి. తల్లితో పెద్దగా మాట్లాడదు. అల్లుడు ఆఫీసు. మనవలది వాళ్ల లోకం. కోటేశ్వరమ్మకు ఎవరితోనైనా మాట్లాడాలని ఉంటుంది. తాను ఏదో ఒకటి చెప్పుకోవాలని ఉంటుంది. ఎవరు వింటారు? కారిడార్‌లోకి వచ్చి చూస్తుంది. ఎవరూ కనిపించరు. విజయవాడలో ఉన్న చుట్టం ఒకామె కోటేశ్వరమ్మతో రెగ్యులర్‌గా మాట్లాడుతుంది. అయితే ఆమె రాత్రి 10 తర్వాతే ఫ్రీ అవుతుంది. ఆ సమయంలో కోటేశ్వరమ్మ ఆ చుట్టానికి కాల్ చేసి మాట్లాడుతుంటే ఇంట్లో అల్లుడు, మనవలు డిస్ట్రబ్ అయ్యి విసుగ్గా చూస్తున్నారు. ‘ఫోన్లు పొద్దున మాట్లాడుకో’ అంటారు. పొద్దున మనిషి ఉండడు. రాత్రి మాట్లాడనివ్వరు. కోటేశ్వరమ్మ మూగది కాదు. మాటలు వచ్చు. ఎన్నో మాట్లాడుతూ ఇన్నేళ్లూ సంసారాన్ని లాక్కు వచ్చింది. ఇప్పుడు మాటలు మానేయమంటే ఎలా?
కేస్‌స్టడీ 2:
రమాదేవికి చీటికి మాటికి కన్నీరు ఆగదు. ఆమెకు కూడా 70 దాటాయి. కొడుకు దగ్గర ఉంటోంది. బాగా చూసుకుంటారు. కాని ఆమెకు ఇంకో ఇద్దరు కొడుకులు ఉన్నారు. వేరే ఊళ్లల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వారు తనతో మాట్లాడరని తాను చెప్పే మాటలు వినడానికి టైమ్ ఇవ్వరని ఆమె ఏడుస్తూ ఉంటుంది. ‘ఏమ్మా.. భోం చేశావా. ఉంటా‘ ఈ రెండు మాటలే ఆ కొడుకులు మాట్లాడేది. వాళ్లు చిన్నగా ఉన్నప్పుడు ఆమె కథలు చెప్పేది. సినిమా కథలు చెప్పేది. బంధువులపై ఫిర్యాదులు మాట్లాడేది. నాన్న కోపతాపాలను వారితో పంచుకునేది. ఇంకా ఏవేవో మాటలు పిల్లలతో చెప్పుకునేది. ఇప్పుడలా చెప్పుకోవడానికి లేదు. మాట్లాడటం కూడా ఒక మాత్ర వేసుకున్నంత ఆరోగ్యంతో సమానమే. కాని రమాదేవికి మాట్లాడే వాళ్లు లేరు. మాటలు వినేవారు లేరు.
వినాలి... మనుషులు కావాలి
మగవాళ్లు బజారులోకి ఎలాగో జారుకుంటూ వయసు మీద పడ్డాక. అపార్ట్‌మెంట్‌లో తమలాంటి మరో ఇద్దరు ముగ్గురు మగవాళ్లతో కింద సెక్యూరిటీ దగ్గర బాతాఖానీ వేస్తారు. లేదా టీకొట్టు దగ్గరో రచ్చబండ దగ్గరో ఎవరో ఒక మనిషి వారికి మాట్లాడటానికి దొరుకుతాడు. లేదంటే ఫోన్ పట్టుకుని డాబా మీదకు వెళ్లి ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు. కాని వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలకు ఆ వెసులుబాటు లేదు. భర్త మరణించి ఉంటే ఆ ఒంటరితనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆడవారికి ఏ వయసు వచ్చినా ఇంకొకరి ఇళ్లకు వెళ్లి గంటలు గంటలు కూచుని మాట్లాడటానికి లేదు. పైగా ఇవాళ ఎవరి ఇంటికీ ఎవరినీ రానివ్వడం లేదు. పాత రోజుల్లో సాయంత్రమైతే అరుగుల మీద కూచుని ఇరుగుపొరుగు ఆడవాళ్లతో మాటలు నడిచేవి. ఇవాళ అరుగులు లేవు. ఇరుగుపొరుగు వాళ్లు సీరియళ్లలో, ఫోన్లలో బిజీగా ఉంటారు. ఎవరితో చెప్పుకోవాలి మేము అంటున్నారు ఈ వార్థక్యంలో ఉన్న స్త్రీలు.
అపార్థాలు–అవస్థలు
కొడుకు దగ్గర ఉంటున్న పెద్ద వయసు స్త్రీలు ఫోన్లు మాట్లాడితే తమ ఇంటి విషయాలు బయటకు చెప్తారన్న అనుమానంతో వారికి ఫోన్లకు దూరం చేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న సభ్యులు మాట్లాడక బయటవారితో మాట్లాడనివ్వక ఇదో పెద్ద సంకటంగా మారుతోంది. ‘మీ అమ్మ చాడీలు చెబుతోంది నా మీద’ అని కోడలు అన్నా... ‘నేను నా భార్యను ఎంత నెత్తిన పెట్టుకుంటే నీకెందుకమ్మా’ అని కొడుకు అన్నా ఆమె మాటల మీదే అడ్డంకి. దాంతో ఇలాంటి స్త్రీలు మాకో హెల్ప్‌లైన్ ఉంటే బాగుండు... ముక్కు ముఖం వారితో ఏదో ఒకటి మాట్లాడుకుని గుండెల మీద భారం దించుకుంటాం అంటున్నారు.
హెల్ప్‌లైన్
మానసిక సమస్యలు వినడానికి హెల్ప్‌లైన్స్ ఉన్నట్టే వార్థక్యంలో ఉన్న స్త్రీల మనసులో మాటలు ఆలోచనలు ఒత్తిడులు పంచుకోవడానికి ఊరికే ఊసుపోని కబుర్లు చెప్పడానికి అవతలి వైపు స్త్రీలు ఉండేలా హెల్ప్‌లైన్ ఉంటే చాలా బాగుంటుందని కొన్ని సూచనలు వస్తున్నాయి.భద్రతాపరమైన అంశాలను పాటిస్తూ ప్రభుత్వాలు ఇలాంటి హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయకపోతే వయోవృద్ధుల హృదయభారం మరింత పెరుగుతూనే ఉంటుంది. మాటలతో దిగిపోయే బరువును దింపాల్సిన బాధ్యత గురించి తప్పక ఆలోచన చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment