Happy Childrens Day 2021: చందమామ.. నా ఆత్మ కథ!! | Childrens Day Special Story In Funday Magazine | Sakshi
Sakshi News home page

Happy Childrens Day 2021: చందమామ.. నా ఆత్మ కథ!!

Published Sun, Nov 14 2021 3:40 PM | Last Updated on Sun, Nov 14 2021 3:42 PM

Childrens Day Special Story In Funday Magazine - Sakshi

మీకు నేను ప్రతి రాత్రీ ఒకేవేళకు కనిపించను, అప్పుడప్పుడు అసలే రాను, అందువల్ల నేను మంచివాడిని కాదని అనుకునేరు.. తల్లిదండ్రులంటే నాకూ భయభక్తులున్నాయి. చదువు సంధ్యలేకుండా నేను అల్లరిచిల్లరగా తిరగటం లేదు. నిజంగా నా కథ తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతున్నదో మీకే తెలుస్తుంది. నా మీద మీకు అంత అపనమ్మకమూ ఉండదు. నాకు ప్రతిరోజూ వచ్చి మీతో ఆడుకోవాలనే ఉంటుంది. కానీ ఏమి చెయ్యను?

చాలా ఏళ్ల కిందట, లక్షలు, కోట్ల సంవత్సరాల కిందట, అప్పటికి మనుషులు ఇంకా పుట్టలేదు, జంతువులు పుట్టలేదు. చెట్లు పుట్టలేదు. నీళ్లు కూడా లేవు. అప్పుడు మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మను మీరెరుగరూ? మీరుంటున్నది మా అమ్మ ఒళ్లోనేగా. భూదేవి మా అమ్మ. మా అమ్మ సూర్యుని కూతురు. మా అమ్మ చిన్నప్పుడు మా తాత సూర్యుడిలానే ఉండేదట. నేను కూడా ఎరుగుదునుగా నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని. నా కళ్లు కూడా సరిగా చూడనిచ్చేవికావు. మా అమ్మ పుట్టినప్పటి నుంచి మా తాత చుట్టూ గిరగిరా బొంగరంలా తిరుగుతూ ఆడుకొంటూ ఉండేది. అదే మా అమ్మకు ఆచారమైపోయింది. 

ఇలా ఉండగా నేను పుట్టాను. పుట్టి, కాళ్లు వచ్చిన తర్వాత ఒక చోట ఎలా కూర్చుంటాం? కాళ్లు, చేతులు ఊరుకోనిస్తాయా? నేనూ మా అమ్మ కొంగు వదలిపెట్టకుండా ఆమె చుట్టూ అల్లాబిల్లీ తిరిగేవాడ్ని. చుక్కలు ఎంతో ప్రేమతో పిలిచేవి కానీ నేను మా అమ్మను వదిలిపెట్టేవాడ్ని కాను. ఆ రోజుల్లో నేను మా తాత సూర్యుడిలాగా ఉండేవాడ్ని. అందుకని అందరూ నన్ను ఎత్తి ముద్దులాడ పిలిచేవాళ్లు. మా అమ్మకు నన్ను చూస్తే ఎంతో సంతోషం. నా ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఇచ్చింది.
మీకు అద్దం ఇస్తే ఏం చేస్తారు? ముఖం చూసుకోరా? నేనూ ఆ పొరపాటే చేశాను. అద్దంలో చూసుకునే కొద్ది నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించసాగింది. అలా చూసుకుంటూ ఉంటే ఇక ప్రపంచంలో మరొటి అందమైనది ఉన్నట్లే కనిపించేది కాదు.

అందువల్ల ఎప్పడూ అదేపనిగా నన్ను నేను అద్దంలో చూసుకునేవాడ్ని. మా అమ్మ చివాట్లు పెడుతూ ఉండేది. నేను వింటేగా? ఇలా చేయగా చేయగా కొన్నాళ్లకు నా కాంతి అంతా పోయింది. ముఖం మాడిన అట్ల పెనంలాగా అయిపోయింది. నాకు పుట్టెడు ఏడుపు వచ్చింది. చుట్టూ చూశాను. చుక్కలు మిలామిలా మెరుస్తున్నాయి. ఎదురుగా చూశాను.. మా అమ్మ జ్యోతిలాగా వెలిగిపోతుంది. మా అమ్మకు పక్కగా చూశాను. మా తాత ఎలా ఉన్నాడని? చూడటానికి కళ్లు చాలకుండా ఉన్నాయి. మళ్లీ నన్ను నేను చూచుకున్నాను. నా ఒళ్లు నాకే కనిపించలేదు. నాకు పట్టరాని ఏడుపు వచ్చింది. పోయినకాంతి ఎలా తిరిగి సంపాదించటం అని ఆలోచించాను. ఏమీ పాలుపోలేదు. దిగాలుపడి కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిలలాడింది. చప్పున ఒక ఉపాయం తోచింది. అక్కడ నుంచి ఒక గంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే ‘ఎవరది.. ఎందుకొచ్చావ్‌?’ అని కిటికీలోనుంచే గద్దించింది. 

‘నేనే చుక్కమ్మా.. చందమామను.. కాస్త వెలుగుపెట్టవూ?’ అన్నాను.
‘ఫో..ఫో.. ఇప్పుడు కావలసివచ్చానేం నేను? నల్లటి అట్ల పెనం మొహం నువ్వూ?’ అని కసిరింది. మీ అక్కయ్య బొమ్మ ఇవ్వక కసిరితే ఎలా ఉంటుంది? నా పనీ అంతే అయ్యింది. కాళ్లీడ్చుకుంటూ ఇంకొక చుక్కమ్మ ఇంటికి వెళ్లాను. 
‘ఇక్కడ మాకే లేకపోతే నీ మొహానికెక్కడ ఇవ్వమంటావ్‌ వెలుగు?’ అని మూలిగింది ఆమె. తతిమ్మా చుక్కమ్మలూ ఇలాగే అన్నాయి. ఇక ఏమిచేసేది? బావురుమని ఏడ్చాను.
అప్పుడే మా తాత సూర్యుడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఒక్క గంతులో మా తాతయ్య ఇంటిముందు వచ్చిపడ్డాను. కానీ లోపలికి వెళ్లడం ఎట్లా? తలుపు తీద్దామంటే చేతులు కాలిపోవూ? అంతగా మా తాతయ్య ఇల్లు వెలిగిపోతున్నది. నేను ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అంతలో మా తాతయ్య ఏడుగుర్రాల బండిలో వస్తూ నన్ను చూశాడు.

‘నాయనా ఎందుకు ఏడుస్తున్నావ్‌? నాకు చెప్పవూ? నీకేమి తక్కువ?’ అన్నాడు. 
‘తాతయ్యా.. నాలోని మంటలన్నీ ఆరిపోయాయి. వెలుతురంతా పోయింది. నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడు  ముఖంతో మీ అందరి మధ్య నేను ఎలా ఉండాలి? తాతయ్యా తాతయ్యా నాకు కాస్త వెలుగివ్వవూ?’ అని జాలిగా అడిగాను.
తాతయ్య ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా అన్నాడు. ‘నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావురా.. మీ అమ్మ ఇచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు. ఆ అద్దం పెట్టి చూస్తే ఎన్ని రంగులు కనిపించేవి? ఎంత ప్రపంచం కనిపించేది? ఎన్ని విచిత్రాలు కనిపించేవి? సరే జరిగిందేదో జరిగింది. ఇక మీదనన్నా నేను చెప్పినట్టుచెయ్యి. నీ అద్దం ఉంది చూశావా.. దాన్ని ఎప్పుడూ నా కాంతి పడుతూ ఉండేటట్టుగా పట్టుకో.. ఆ అద్దం మీద వెలుతురు నీ ముఖానికి తిప్పుకో.. అప్పుడు నీ ముఖం తెల్లగా ఉంటుంది’ అన్నాడు.

అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకున్నారు? నాటి నుంచి మా తాతయ్య చెప్పినట్లే చేస్తున్నాను. ఆయన వెలుగును నా అద్దంలో పట్టి నావైపుకు తిప్పుకుంటూ ఉన్నాను. నా ముఖం మళ్లీ ప్రకాశించడం మొదలుపెట్టింది. అయితే అప్పుడప్పుడు మా అమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందువల్ల మీకు సరిగా వేళకు కనిపించలేకపోతున్నాను. అంతే కానీ మరేమీ లేదు.

- చందమామ (1947, జులై సంచిక నుంచి)

చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement