November 14
-
పిల్లల్లారా. పాపల్లారా...స్ఫూర్తిగా నిలిచే కూనల్లారా...
ఈ ప్రపంచంలో అన్నింటి కంటే విలువైనది బాలల ముఖాల్లో విరిసే చిరునవ్వు. సూర్యుడు, చంద్రుడు ఈ భూమ్మీదకు తొంగి చూసేది పిల్లల ముఖాన చిరునవ్వును చూడటానికే. గాలి వీచేది వారి ముంగురులను అల్లరి పెట్టి ఆడటానికే. నీరు ప్రవహించేది వారు కేరింతలు కొట్టడానికే. పిల్లల్ని సంతోష పెట్టడానికే అడవులు ఆకుపచ్చను పులుముకుంటాయి. పిల్లల్ని కళ్లు ఇంతింత చేసుకుని చూడటానికే మృగాలు వింత ఆకారాలు ధరిస్తాయి. నడయాడే ఈ బుజ్జి దేవతల కోసమే భూమి క్రమం తప్పకుండా తిరుగుతూ విరగకాసే పంటలను ఇస్తూ వారి నోటికి గోరు ముద్దలు అందేలా చూడటానికి తపన పడేది. పిల్లల కోసమే కదా తల్లిదండ్రులు ఆజన్మాంతం కష్టపడేది.అయితే అందరు పిల్లలకూ అన్ని భాగ్యాలు దొరకవు. ప్రకృతి వారికి పరీక్షలు పెడుతుంది. వారికి సవాళ్లు విసురుతుంది. అందరితోపాటే మీరు కూడా అన్నట్టుగా వారి వాటాకు తగ్గ కష్టాలు ఇస్తుంది. అయితే పిల్లలకు మించిన వీరులు ఉండరు. వారిని మించిన శూరులు ఉండారు. కాసేపు చిన్నబుచ్చుకుంటారు కాబోలు. ఆ తర్వాత వారు తమ లోపలి శక్తిని వెలికి తెస్తారు. సవాళ్లకు జవాబు చెబుతారు. పెద్దవాళ్లకే స్ఫూర్తిపాఠాలు నేర్పిస్తారు.నవంబర్ 14 బాలల దినోత్సవం.ఈ సందర్భంగా రేపటి నుంచి తమ జీవితాల్లోని సవాళ్లను, అనారోగ్యాలను, ఏకాకితనాలను తట్టుకుని నిలబడ్డ బుల్లి హీరోలను కలిసి వారి ఉత్సాహాన్ని తోడు చేసుకుని ఆ సంతోషాన్ని పాఠకులకు పంచాలని సంకల్పించింది సాక్షి. సినిమా రంగంలోని ఛైల్డ్ సెలబ్రిటీలను వారివద్దకు తీసుకెళ్లి సందడి చేసింది. ఆ సందడి రేపటి నుంచి.ఈ కథనాలు సాక్షి ఫ్యామిలీలో, సాక్షి టీవీలో, సాక్షి డిజిటల్ మీడియాలో వెలువడతాయి. పాఠకులు ఈ చిన్నారి సైనికులను కలవాలని, వారి బాటకు మీదైన ప్రోత్సాహం అందించాలని మా కోరిక. రేపటి నుంచి వాటికి సంబంధించిన ప్రత్యేక కథనాలందిస్తాం. ఆలస్యం చేయకుండా చదివేయండి. (చదవండి: మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..) -
Happy Childrens Day 2021: చందమామ.. నా ఆత్మ కథ!!
మీకు నేను ప్రతి రాత్రీ ఒకేవేళకు కనిపించను, అప్పుడప్పుడు అసలే రాను, అందువల్ల నేను మంచివాడిని కాదని అనుకునేరు.. తల్లిదండ్రులంటే నాకూ భయభక్తులున్నాయి. చదువు సంధ్యలేకుండా నేను అల్లరిచిల్లరగా తిరగటం లేదు. నిజంగా నా కథ తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతున్నదో మీకే తెలుస్తుంది. నా మీద మీకు అంత అపనమ్మకమూ ఉండదు. నాకు ప్రతిరోజూ వచ్చి మీతో ఆడుకోవాలనే ఉంటుంది. కానీ ఏమి చెయ్యను? చాలా ఏళ్ల కిందట, లక్షలు, కోట్ల సంవత్సరాల కిందట, అప్పటికి మనుషులు ఇంకా పుట్టలేదు, జంతువులు పుట్టలేదు. చెట్లు పుట్టలేదు. నీళ్లు కూడా లేవు. అప్పుడు మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మను మీరెరుగరూ? మీరుంటున్నది మా అమ్మ ఒళ్లోనేగా. భూదేవి మా అమ్మ. మా అమ్మ సూర్యుని కూతురు. మా అమ్మ చిన్నప్పుడు మా తాత సూర్యుడిలానే ఉండేదట. నేను కూడా ఎరుగుదునుగా నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని. నా కళ్లు కూడా సరిగా చూడనిచ్చేవికావు. మా అమ్మ పుట్టినప్పటి నుంచి మా తాత చుట్టూ గిరగిరా బొంగరంలా తిరుగుతూ ఆడుకొంటూ ఉండేది. అదే మా అమ్మకు ఆచారమైపోయింది. ఇలా ఉండగా నేను పుట్టాను. పుట్టి, కాళ్లు వచ్చిన తర్వాత ఒక చోట ఎలా కూర్చుంటాం? కాళ్లు, చేతులు ఊరుకోనిస్తాయా? నేనూ మా అమ్మ కొంగు వదలిపెట్టకుండా ఆమె చుట్టూ అల్లాబిల్లీ తిరిగేవాడ్ని. చుక్కలు ఎంతో ప్రేమతో పిలిచేవి కానీ నేను మా అమ్మను వదిలిపెట్టేవాడ్ని కాను. ఆ రోజుల్లో నేను మా తాత సూర్యుడిలాగా ఉండేవాడ్ని. అందుకని అందరూ నన్ను ఎత్తి ముద్దులాడ పిలిచేవాళ్లు. మా అమ్మకు నన్ను చూస్తే ఎంతో సంతోషం. నా ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఇచ్చింది. మీకు అద్దం ఇస్తే ఏం చేస్తారు? ముఖం చూసుకోరా? నేనూ ఆ పొరపాటే చేశాను. అద్దంలో చూసుకునే కొద్ది నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించసాగింది. అలా చూసుకుంటూ ఉంటే ఇక ప్రపంచంలో మరొటి అందమైనది ఉన్నట్లే కనిపించేది కాదు. అందువల్ల ఎప్పడూ అదేపనిగా నన్ను నేను అద్దంలో చూసుకునేవాడ్ని. మా అమ్మ చివాట్లు పెడుతూ ఉండేది. నేను వింటేగా? ఇలా చేయగా చేయగా కొన్నాళ్లకు నా కాంతి అంతా పోయింది. ముఖం మాడిన అట్ల పెనంలాగా అయిపోయింది. నాకు పుట్టెడు ఏడుపు వచ్చింది. చుట్టూ చూశాను. చుక్కలు మిలామిలా మెరుస్తున్నాయి. ఎదురుగా చూశాను.. మా అమ్మ జ్యోతిలాగా వెలిగిపోతుంది. మా అమ్మకు పక్కగా చూశాను. మా తాత ఎలా ఉన్నాడని? చూడటానికి కళ్లు చాలకుండా ఉన్నాయి. మళ్లీ నన్ను నేను చూచుకున్నాను. నా ఒళ్లు నాకే కనిపించలేదు. నాకు పట్టరాని ఏడుపు వచ్చింది. పోయినకాంతి ఎలా తిరిగి సంపాదించటం అని ఆలోచించాను. ఏమీ పాలుపోలేదు. దిగాలుపడి కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిలలాడింది. చప్పున ఒక ఉపాయం తోచింది. అక్కడ నుంచి ఒక గంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే ‘ఎవరది.. ఎందుకొచ్చావ్?’ అని కిటికీలోనుంచే గద్దించింది. ‘నేనే చుక్కమ్మా.. చందమామను.. కాస్త వెలుగుపెట్టవూ?’ అన్నాను. ‘ఫో..ఫో.. ఇప్పుడు కావలసివచ్చానేం నేను? నల్లటి అట్ల పెనం మొహం నువ్వూ?’ అని కసిరింది. మీ అక్కయ్య బొమ్మ ఇవ్వక కసిరితే ఎలా ఉంటుంది? నా పనీ అంతే అయ్యింది. కాళ్లీడ్చుకుంటూ ఇంకొక చుక్కమ్మ ఇంటికి వెళ్లాను. ‘ఇక్కడ మాకే లేకపోతే నీ మొహానికెక్కడ ఇవ్వమంటావ్ వెలుగు?’ అని మూలిగింది ఆమె. తతిమ్మా చుక్కమ్మలూ ఇలాగే అన్నాయి. ఇక ఏమిచేసేది? బావురుమని ఏడ్చాను. అప్పుడే మా తాత సూర్యుడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఒక్క గంతులో మా తాతయ్య ఇంటిముందు వచ్చిపడ్డాను. కానీ లోపలికి వెళ్లడం ఎట్లా? తలుపు తీద్దామంటే చేతులు కాలిపోవూ? అంతగా మా తాతయ్య ఇల్లు వెలిగిపోతున్నది. నేను ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అంతలో మా తాతయ్య ఏడుగుర్రాల బండిలో వస్తూ నన్ను చూశాడు. ‘నాయనా ఎందుకు ఏడుస్తున్నావ్? నాకు చెప్పవూ? నీకేమి తక్కువ?’ అన్నాడు. ‘తాతయ్యా.. నాలోని మంటలన్నీ ఆరిపోయాయి. వెలుతురంతా పోయింది. నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడు ముఖంతో మీ అందరి మధ్య నేను ఎలా ఉండాలి? తాతయ్యా తాతయ్యా నాకు కాస్త వెలుగివ్వవూ?’ అని జాలిగా అడిగాను. తాతయ్య ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా అన్నాడు. ‘నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావురా.. మీ అమ్మ ఇచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు. ఆ అద్దం పెట్టి చూస్తే ఎన్ని రంగులు కనిపించేవి? ఎంత ప్రపంచం కనిపించేది? ఎన్ని విచిత్రాలు కనిపించేవి? సరే జరిగిందేదో జరిగింది. ఇక మీదనన్నా నేను చెప్పినట్టుచెయ్యి. నీ అద్దం ఉంది చూశావా.. దాన్ని ఎప్పుడూ నా కాంతి పడుతూ ఉండేటట్టుగా పట్టుకో.. ఆ అద్దం మీద వెలుతురు నీ ముఖానికి తిప్పుకో.. అప్పుడు నీ ముఖం తెల్లగా ఉంటుంది’ అన్నాడు. అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకున్నారు? నాటి నుంచి మా తాతయ్య చెప్పినట్లే చేస్తున్నాను. ఆయన వెలుగును నా అద్దంలో పట్టి నావైపుకు తిప్పుకుంటూ ఉన్నాను. నా ముఖం మళ్లీ ప్రకాశించడం మొదలుపెట్టింది. అయితే అప్పుడప్పుడు మా అమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందువల్ల మీకు సరిగా వేళకు కనిపించలేకపోతున్నాను. అంతే కానీ మరేమీ లేదు. - చందమామ (1947, జులై సంచిక నుంచి) చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
పిల్లల కోసం ప్రత్యేక సినిమాలు!
పిల్లలూ.. కథలే కాదు మీకోసం చక్కటి సినిమాలూ వచ్చాయి. మీకు వినోదం పంచడానికి తెలుగు సహా మీకు తెలిసిన ప్రపంచ భాషలన్నిటిలోనూ మీకోసం సినిమాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.. బాలరాజు కథ.. మహాబలిపురం పట్టణంలో బాలారాజు అనే పదేళ్ల పిల్లవాడుండేవాడు. అతనికో చెల్లి రాధ. తండ్రిలేని పిల్లలు. తల్లితో కలసి మేనమామ కుటుంబం ఉంటున్న గుడిసె పక్కనే మరో గుడిసెలో నివసించేవారు. మేనమామ సోమరి, తాగుబోతు. దాంతో ఇటు తమ కుటుంబంతోపాటు మేనమామ కుటుంబాన్ని బాలరాజే పోషిస్తూండేవాడు. టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తూ. ఈ చలాకీ పిల్లవాడు టూరిస్ట్‌లు ఇచ్చిన డబ్బు తీసుకుని ‘టాటా గిడి గిడీ’ అంటూ తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపేవాడు. ఒకరోజు గుంటూరుకు చెందిన ధనిక దంపతులు కారులో మహాబలిపురం వస్తారు. వాళ్లకు పిల్లలు ఉండరు. ఆ జంటకు మన బాలరాజే గైడ్. వాళ్లను మహాబలిపురం తిప్పుతుండగా తల్లికి ఆరోగ్యం పాడైనట్టు చెల్లి రాధ వచ్చి చెబుతుంది. ఆ అన్నా, చెల్లి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లిపోతారు. కానీ అప్పటికే వాళ్లమ్మ చనిపోయుంటుంది. ఈ విషయం తెలిసిన గుంటూరు దంపతులు ఆ పిల్లలిద్దరినీ దత్తత తీసుకోవాలనుకుంటారు. ప్రతినెల తనకు వంద రూపాయలు ఇవ్వాలనే నియమం మీద ఆ పిల్లలను ఆ దంపతులకు దత్తత ఇస్తాడు బాలరాజు మేనమామ. పిల్లలను తీసుకుని వెళుతుండగా తమ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగిందని టెలిగ్రాం అందుతుంది ఆ దంపతులకు. దాన్నొక అపశకునంగా, దానికి బాలరాజు గ్రహచారమే కారణం అనుకుంటూంటారు ఆ దంపతులు. ఆ మాటను చాటుగా విన్న ఆ అన్నా, చెల్లెలు తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతారు. బాలరాజు గురువుగా భావించే ఓ శిల్పాచార్యుడు ఆ పిల్లవాడిని ఓదారుస్తాడు. శిల్పాచార్యుడు పర్యవేక్షిస్తున్న శిల్పాల తయారీ స్థలంలో ఓ వినాయకుడి విగ్రహం ఉంటుంది. దాని దగ్గరున్న ఓ శిలాఫలకంలో కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి. వాటిల్లో ఉన్నట్టే పరిస్థితులు ఎదురవుతుంటాయి బాలరాజుకు. చదువులేని బాలరాజుకు ఆ సంఘటనలే లోకజ్ఞానాన్ని కలగజేస్తుంటాయి. ఇంతలోకి గుంటూరు దంపతుల్లోని భార్య ఈ పిల్లల మీద బెంగతో మంచం పడుతుంది. ఆ పిల్లలను తీసుకెళితే తన భార్య మళ్లీ ఆరోగ్యవంతురాలవుతుందని తలుస్తాడు. పిల్లలను వెదుక్కుంటూ మళ్లీ మహాబలిపురం వస్తాడు. దత్తత ఇవ్వమని పిల్లల మేనమామను బతిమిలాడుతాడు. మేనమామ ఒప్పుకొని పిల్లలను అతనితో పంపించేస్తాడు. పిల్లల మాట వినగానే ఆ తల్లి కళ్లు తెరుస్తుంది. బాలరాజు కోరిక మేరకు అతని మేనమామ కుటుంబాన్ని కూడా తమ ఇంటికి తీసుకొస్తారు గుంటూరు దంపతులు. అలా బాలరాజు కథ సుఖాంతమవుతుంది. ఇది ‘వా రాజా వా’ అనే తమిళ సినిమాకు రీమేక్. మూల కథ.. నాగరాజన్. మాటలు.. ముళ్లపూడి వెంకటరమణ, దర్శకత్వం.. బాపు. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా కథను టూకీగా 1970, ఆగస్ట్ చందమామ సంచికలో బాపూ బొమ్మలతో ప్రచురించారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. పథేర్ పాంచాలి బెంగాల్‌లోని నిశ్చింద్రపురం ఊరి చివరన ఉంటుంది హరిహర్ రాయ్‌గారి పాత పెంకుటిల్లు. వచ్చే కొద్దిపాటి సంపాదనతో అతను పూజారిగా జీవనం సాగిస్తుంటాడు కానీ గొప్ప కవి, నాటక రచయిత అవ్వాలని కలలు కంటుంటాడు. అతని భార్య సర్వజయ, కూతురు దుర్గ, కొడుకు అపు హరిహర్ రాయ్‌కు వరుసకు అక్క అయిన ఇందిరమ్మ అనే ముసలావిడ.. అతని కుటుంబ సభ్యులు. హరిహర్ రాయ్ సంపాదన కోసం ఊర్లు పట్టుకు తిరుగుతుంటాడు. సర్వజయకు ఇందిరమ్మంటే పడదు. దుర్గ, అపుల అల్లర్లు, ఆకతాయి పనులు, చిన్న చిన్న సంతోషాలతో కాలం గడుస్తూంటుంది. దుర్గ స్నేహితురాలి పెళ్లి కుదురుతుంది. ఆపెళ్లికి వెళ్లి తిరిగి వస్తూండగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆ వానలో దుర్గ డాన్స్ చేస్తుంది. అలా వర్షంలో తడవడంవల్ల దుర్గకు జ్వరం వస్తుంది. వైద్యంచేసినా జ్వరం తగ్గదు. తరువాతి రోజు రాత్రి తుఫాను వస్తుంది. ఆ రాత్రే దుర్గ చనిపోతుంది. పక్కింటి వాళ్ల సహాయంతో అంత్యక్రియలూ జరుగుతాయి. ఈ విషయం తెలియని హరిహర్రాయ్ ఊరి నుంచి ఇంటికి వస్తాడు. దుర్గ చనిపోయిందని తెలిసి భోరున విలపిస్తాడు. సర్వజయను ఓదార్చడమైతే ఎవరి తరమూ కాదు. తుఫానుకు వంటగది కూలిపోయి ఉంటుంది. ఆ ఊరు వదిలేసి కాశీ వెళ్లిపోవటానికి సిద్ధమవుతుంది ఆ కుటుంబం. గ్రామపెద్దలు వచ్చి ఊరు వదిలివెళ్లొద్దని సర్దిచెప్తారు. కానీ హరిహర్ రాయ్ ఒప్పుకోడు. ఇల్లు సర్దే క్రమంలో అపుకి దుర్గ దొంగలించిన పూసలదండ దొరుకుతుంది. అపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దండను కొలనులోకి విసిరేస్తాడు. ఆ విషయం ఎవరికీ చెప్పడు. హరిహర్ రాయ్ కుటుంబం ఎద్దుల బండిలో కాశీకి బయలుదేరడంతో సినిమా ముగుస్తుంది. 1929లో బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రాసిన ‘పథేర్ పాంచాలి’ అనే బెంగాలీ నవల ఆధారంగానే అదే పేరుతో 1955లో ఈ సినిమాను తీశాడు సత్యజిత్ రాయ్. ఈ నవలను 1960లో మద్దిపట్ల సూరి తెలుగులో అనువదించారు. వేర్ ఈజ్ ది ఫ్రెండ్స్ హోమ్ (ఇరానియన్ సినిమా. కథ, దర్శకత్వం.. అబ్బాస్ కైరోస్తమి) ఇరాన్‌లోని కొకర్ గ్రామంలో అహ్మద్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడుంటాడు. ఇంటిపనుల్లో వాళ్లమ్మకు సాయం చేస్తూ ఊరిలోని బడిలో చదువుకునేవాడు. ఎప్పటిలాగే ఆరోజు కూడా ఇంటికి వచ్చి హోమ్‌వర్క్ చేయబోతుంటే తెలుస్తుంది పొరపాటున తన క్లాస్మేట్ మహమ్మద్ రెజా నమత్‌జాద్ నోట్‌బుక్‌ను తను తెచ్చేశాడని. వెంటనే ఆ నోట్‌బుక్‌ను అతనికి తిరిగి ఇవ్వకుంటే అతను హోమ్‌వర్క్ చేయలేడు. హోమ్‌వర్క్ చేయకుంటే టీచర్ క్లాస్‌లోకి రానివ్వడు. అందుకే ఎలాగైనా ఆ రోజే ఆ నోట్‌బుక్‌ను స్నేహితుడికి ఇవ్వాలని అనుకుంటాడు. జరిగిన విషయం తల్లితో చెప్తాడు. ‘రేపు ఇవ్వొచ్చులే’ అని వారిస్తుంది ఆమె. దాంతో అమ్మకు తెలియకుండా నోట్‌బుక్‌ను చొక్కాలోపల దాచుకుని పరుగులాంటి నడకతో బయలుదేరుతాడు అహ్మద్. వాళ్లూరికి పక్కనున్న కొండ మీద ‘పొస్థే’ అనే ఊళ్లోనే ఉంటుంటాడు నమత్‌జాద్. పరిగెత్తుకుంటూ పోస్థేకి చేరుకుంటాడు అహ్మద్. కానీ అంతకు క్రితమే నమత్‌జాద్ వాళ్ల బంధువైన హెమాతి వాళ్ల ఇంటికి వెళ్లాడని తెలుస్తుంది. అతికష్టం మీద హెమాతి వాళ్ల ఇంటికీ వెళ్తాడు. అక్కడ హెమాతి ఉండడు. అహ్మద్ స్వగ్రామం అయిన కొకర్కే వెళ్లాడని తెలుస్తుంది. మళ్లీ పరిగెత్తుకుంటూ కొకర్కు వస్తాడు అహ్మద్. అక్కడా నమత్‌జాద్ కనిపించడు. మళ్లీ పోస్థేకు వెళతాడు. అయినా నమత్‌జాద్ జాడ కనిపెట్టలేకపోతాడు. ఈలోపు రాత్రవుతుంది. నిరాశతో ఇల్లు చేరతాడు అహ్మద్. ఎక్కడికెళ్లావంటూ పిల్లాడిని మందలిస్తుంది తల్లి. తన హోమ్‌వర్క్‌తో పాటు నమత్‌జాద్ హోమ్‌వర్క్ కూడా పూర్తిచేస్తాడు అహ్మద్. తరువాతి రోజు తరగతి గదిలో పిల్లల హోమ్‌వర్క్ చూసిన టీచర్ నమత్‌జాద్ హోమ్‌వర్క్ బుక్‌లో గుడ్ అని రాస్తాడు. డ్రీమ్స్ (జపనీస్ సినిమా. కథ, దర్శకత్వం.. అకిరా కురసోవా) ఇందులో మొత్తం 8 కథలుంటాయి. ఒక కథకు మరో కథకు సంబంధం ఉండదు. దేనికదే స్వతంత్ర కథగా నడుస్తుంది. వీటిల్లోని సన్‌షైన్ త్రూ ది రైన్ అనే ఒక కథ గురించి మాత్రం ఇక్కడ తెలుసుకుందాం. జపాన్‌లోని ఓ గ్రామంలో ఒక ఆరేళ్ల పిల్లాడు ఉంటుంటాడు. ఒకరోజు మధ్యాహ్నం హఠాత్తుగా వానపడుతుంది. ఓ వైపు ఎండగానే ఉంటుంది.. ఇంకోవైపు చినుకులు పడుతునే ఉంటాయి. పిల్లవాడి అమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చేటలో ఎండబెట్టిన వాటిని ఇంట్లోకి చేరుస్తుంటుంది. పిల్లాడేమో వానలో నిలబడి ఉంటాడు. ‘ఇలా ఎండా.. వానా ఒకేసారి వస్తే మన ఇంటి పక్కనున్న అడవిలో నక్కల పెళ్లి జరుగుతుంది. వాటి పెళ్లిని మనుషులు చూస్తే వాటికి కోపం వస్తుంది. అందుకే త్వరగా ఇంట్లోకి వచ్చేయ్’ అంటుంది అమ్మ. ఆమె అలా ఇంట్లోకి వెళ్లగానే పిల్లాడు వడివడిగా నడుచుకుంటూ ఇంటి పక్కనున్న అడవిలోకి వెళ్లిపోతాడు. అక్కడ ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద చెట్లు ఉంటాయి. వాటి మొదళ్లు చాలా లావుగా బలంగా ఉంటాయి. పిల్లాడు ఓ చెట్టు వెనుక దాక్కుంటాడు. నక్కల వేషధారణలోని స్త్రీ, పురుషుల గుంపు లయబద్ధంగా సంగీత వాయిద్యాలు వాయిస్తూ నాట్యం చేస్తూంటుంది. ఆ గుంపుకి కనిపించకుండా పిల్లాడు ఓ చెట్టు బోదె వెనుక దాక్కుని అంతా గమనిస్తుంటాడు. కాని ఓ ఇద్దరు ఆ బాలుడిని కనిపెడ్తారు. కళ్లతో కోపాన్ని చూపిస్తారు. పిల్లాడు భయపడి ఇంటికి పారిపోతాడు. వాడి కోసం ఎదురుచూస్తున్న అమ్మ ‘నా మాట వినకుండా నక్కల పెళ్లి చూసి వాటికి కోపం తెప్పించావు. ఓ మగనక్క వచ్చి ఈ కత్తి నీకు ఇమ్మంది. దీన్ని తీసుకెళ్లి వాటికి తిరిగి ఇచ్చేసి క్షమాపణ చెప్పి రా! నక్కల క్షమాపణ సంపాదించే వరకు నిన్ను ఇంటికి రానివ్వను’ అంటుంది కరాఖండిగా. ‘నక్కలు ఎక్కడుంటాయో నాకు తెలీదు’ అంటాడు పిల్లాడు. ‘ఇలాంటి వాతావరణంలో నక్కలు ఇంద్రధనుస్సు కింద ఉంటాయి’ అని చెప్పి పిల్లాడిని బయటే ఉంచి తలుపు వేసేస్తుంది అమ్మ. రూళ్లకర్రలా ఉన్న ఆ కత్తిని తీసుకుని పక్కనే ఉన్న తోటలోకి వెళ్తాడు పిల్లాడు. ఆ తోటంతా రంగురంగుల పూలమయం. ఎదురుగా ఉన్న రెండు కొండల మధ్య అద్భుతమైన ఇంద్రధనుస్సు కనపడుతుంది. నడుచుకుంటూ దాని దగ్గరకు వెళ్తాడు పిల్లాడు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ముగింపు ప్రేక్షకుల ఊహకే వదిలేస్తాడు దర్శకుడు. ఇలా మొత్తం ఎనిమిది కథలతో ఈ సినిమా సాగుతుంది. ఇంకెన్నో పిల్లల సినిమాలు.. పిల్లలూ.. ఇలా మిమ్మల్ని అలరించే ఇంకెన్నో మంచి సినిమాలు ఉన్నాయి. వీటిల్లో కష్టాంక (రష్యన్), ది రెడ్ బెలూన్ (ఫ్రెంచ్), చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ (ఇరానియన్), ది కార్ట్ (ఇరానియన్), గిఖోర్ (అర్మీనియన్), ది బ్లూ అంబ్రెల్లా (హిందీ), ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ (క్యూబన్), ది మ్యాన్ హూ ప్లాంటెడ్ ట్రీస్ (ఫ్రెంచ్), ది కలర్ ఆఫ్ పారడైజ్ (ఇరానియన్), ది కిడ్ (అమెరికన్), బైసికిల్ థీవ్స్ (ఇటాలియన్), ది వైట్ బెలూన్ (ఇరానియన్), లాస్ట్ ఇన్ ది డెజర్ట్ (అమెరికన్), జంపింగ్ ఓవర్ పెడల్స్ అగైన్ (చెకోస్లోవియన్ ), కాక ముటై్ట (తమిళ్), ఇవాన్స్ చైల్డ్‌హుడ్ (రష్యన్), ది చైల్డ్‌హుడ్ ఆఫ్ మాక్సిమ్ గోర్కీ (రష్యన్), ది మిర్రర్ (ఇరానియన్), ది రన్నర్ (ఇరానియన్), స్ట్రే డాగ్స్ (ఇరానియన్) ... వంటివి తప్పక చూడాల్సిన కొన్ని చిత్రాలు. – అనిల్ బత్తుల (‘పిల్లల సినిమా కథలు పుస్తకం’ నుంచి..) చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!
‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది’ అని కథలో వినగానే బాలల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్టు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఆ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. ఇవాళ కూడా బాలల చేతిలో ఒక చిలుక ఉంది. దాని పేరు సెల్‌ఫోన్. అది బాలల గొంతును పట్టుకుని ఉందా... బాలలు దాని గొంతును పట్టుకోబోతారా తేలాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం విలువైనది. దాని అవసరం ఈ కరోనా సమయంలో విపరీతంగా తెలిసి వచ్చింది. పిల్లలు సెల్ఫోన్లు, లాప్టాప్ల ఆధారంగానే క్లాసులు విన్నారు. కొంతలో కొంతైనా తమ తరగతి స్వభావాన్ని నిలుపుకున్నారు. ఇది సాంకేతిక వల్లే సాధ్యమైంది. అదే సమయంలో ఆ సాంకేతికతే వారి ఊహా జగత్తు గొంతు నులుముతోంది. అనవసర వీడియోలకు, గేమ్‌లకు వారిని లొంగదీస్తోంది. పనికిమాలిన, ఎటువంటి వికాసం ఇవ్వని కాలక్షేపంలో కూరుకుపోయేలా చేస్తోంది. దేశంలో అలక్ష్యానికి గురయ్యే సమూహాలు తాము అలక్ష్యానికి గురవుతున్నామని గొంతెత్తుతాయి. లేదా ప్రభుత్వాలే తమ పాలసీ రీత్యానో వారికి ఓటు ఉంటుందన్న ఎరుక వల్లనో కొన్ని పనులు వారి కొరకు చేస్తాయి. కాని పిల్లలకు ఓటు ఉండదు. వారు ఏదైనా అరిచి చెప్పే వీలూ ఉండదు. దేశంలో వారికి మించిన నిర్లక్ష్యానికి గురయ్యే సమూహం ఉందా?... అందరూ ఆలోచించాలి. తాజా అధ్యయనాల్లో దేశంలో రోజుకు ముప్పైకి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇళ్లల్లో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, చదువుకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఎలాంటివో ఎవరు పట్టించుకుంటున్నారు? ‘సాంకేతిక విద్య’ విప్లవం మొదలయ్యే వరకు బాలల వికాసం ఒకలా, ఆ విద్య వల్ల వస్తున్న ఉపాధి తెలిశాక ఆ వికాసం మరోలా మారిపోయింది. ఒకప్పుడు విద్యావిధానం, తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటపాటలకు, కళలకు, కథలకు చోటు ఇచ్చేవారు. ‘ఆడుకోండ్రా’ అని అదిలించేవారు. కథల పుస్తకాలు తెచ్చిచ్చేవారు. నేడు ఐదవ తరగతి నుంచే భవిష్యత్తులో తేవలసిన ర్యాంకు గురించి హెచ్చరిస్తున్నారు. ఆటస్థలానికి, లైబ్రరీకి ఏ మాత్రం చోటులేని స్కూళ్లు పిల్లల్ని సిలబస్‌ల పేరుతో తోముతున్నాయి. పిల్లలకు పార్కులు అవసరం అని ప్రభుత్వాలు భావించనప్పుడు ఆటస్థలాలు అవసరం అని విద్యా సంస్థలూ భావించవు. ఇవాళ మున్సిపాల్టీలలో, నగరాలలో ఎన్ని పిల్లల పార్కులు ఉన్నాయో చూస్తే కాంక్రీట్ల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పెనుగులాడుతున్న బాలలు కనిపిస్తారు. పిల్లలు భయం వేస్తే అమ్మమ్మ కొంగు చాటుకు వెళ్లి దాక్కున్నట్టు వారికి ఆందోళన కలిగితే గతంలో ఏ చందమామనో పట్టుకుని కూచునేవారు. నేడు అన్ని పిల్లల పత్రికలూ మూతపడ్డాయి. వారికి కథలు చెప్పే అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు అనేక కారణాల రీత్యా వేరొక చోట్ల జీవిస్తున్నారు. ఒకవేళ వారు ఉన్నా ఫోన్లు, సీరియల్సు వారినీ ఎంగేజ్ చేస్తున్నాయి. పిల్లలతో మాట్లాడటానికి ఎవరికీ సమయం లేదు. పిల్లలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్ఫోన్లు అడ్డు నిలుస్తున్నాయి. వారి ఆందోళనకు ఓదార్పు ఏది? ఎగరని చిలుకలు, పురి విప్పని నెమళ్లు ఉంటే ప్రకృతి ఎంత నిస్సారంగా ఉంటుందో ఆటలాడని, నవ్వని, కథ వినని, వినిపించని, బొమ్మలేయని, పాట పాడని, నృత్యం చేయని పిల్లలు ఉంటే కూడా ప్రకృతి అంతే నిస్సారంగా ఉంటుంది. నవంబర్ 14 (బాలల దినోత్సవం) సందర్భంగా గతంలో తెలుగునాట వెలిగిన బాలల పత్రికల నుంచి ఏరి కూర్చిన సంజీవని పుల్లలతో ఈ సంచికను తీర్చిదిద్దాం. ఇలాంటివి కదా పిల్లలకు కావాలసింది అని అనిపిస్తే అవి ఎందుకు వారికి లేకుండా పోయాయో అందరూ ఆలోచిస్తారని ఆశ. చిలుకలను ఎగురనిద్దాం. నెమళ్లను పురివిప్పనిద్దాం. వారి ఆటస్థలాలను వారికి అప్పజెబుదాం. వారు ఆటలాడుకునే పిరియడ్లను స్కూళ్లలో వెనక్కు తెద్దాం. ర్యాంకులు అవసరమైన చదువులు మాత్రమే ఉండవని చెబుదాం. ఈ ప్రపంచం వారి కోసం ఎన్నో గండభేరుండ పక్షులను సిద్ధం చేసి వీపు మీద ఎక్కించి వారు కోరుకున్న విజయ తీరాలకు చేరుస్తుందని నమ్మకం కలిగిద్దాం. బాలల వికాసమే సమాజ వికాసం. – బాలల దినోత్సవం ప్రత్యేకం చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
మరో రెండు రోజుల్లో స్పెషల్ టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ టూరిస్ట్ రైలు పట్టాలెక్కనుంది. ఇండియా శ్రీలంక మధ్య ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతూ శ్రీరామాయణ యాత్ర- శ్రీలంక ఎక్స్‌ప్రెస్ టూరిస్టులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. నవంబరు 14నుంచి 16 రోజుల యాత్ర మొదలు కానుంది. అలనాటి రామాయణ కాలంనాటి దృశ్యాలను కళ్లకు కట్టే అనుభూతిని ప్రజలకు కల్పించేందుకు భారతీయ రైల్వే ఈ సరికొత్త రైలును పరిచయం చేస్తోంది. 800 సీటింగ్ కెపాసిటీతో శ్రీ రామాయణ యాత్ర- శ్రీలంక పేరిట శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్‌కు మరో రెండురోజుల్లో పచ్చ జెండా ఊపేందుకు రైల్వే అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య నుంచి కొలంబో దాకా అద్భుతమైన ప్రయాణం సాగుతుందని గోయల్ ఇటీవల ట్విటర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సందర్శించే ప్రదేశాలు ఢిల్లీ నుంచి బయల్దేరి మొదట అయోధ్యలో ఆగుతుంది. ఆ తరువాత హనుమాన్ గఢీ రామ్‌కోట్, కనక భవన్ ఆలయ ప్రదేశాలకు చేరుతుంది. అనంతరం నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రింగ్వర్పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి ద్వారా రామేశ్వరం చేరుతుంది. ట్రావెల్ ప్యాకేజ్ సమయం: 16 రోజులు ప్యాకేజ్ ధర: ఒక్కొక్కరికి రూ. 15,210, భోజనం, వసతి సదుపాయాలు ఇందులో భాగం. అయితే శ్రీలంక వెళ్లాలనుకొంటే.. ఒక్కొక్కరూ ప్రత్యేక ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. శ్రీలంక ప్రయాణం శ్రీలంకలోని క్యాండీ, నువారా ఎలియా, కొలంబో, నెగోంబోల మీదుగా కూడా ప్రయాణం సాగుతుంది. అయితే ఇందుకు రూ. 36,970లు అదనం. కాగా శ్రీలంకను ఈ ప్రాంతాల్లో సందర్శించాలనుకునే పర్యాటకులు చెన్నై నుంచి కొలంబోకు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుందని భారతీయ రైల్వే వెల్లడించింది. Retracing the Epic Journey of Lord Rama: Indian Railways to introduce a special tourist train 'Shri Ramayana Express' which will cover all the places from Ayodhya to Colombo via Rameshwaram, on the Ramayana circuit.https://t.co/WR9HIYl0ae pic.twitter.com/jcGKeiBz12 — Piyush Goyal (@PiyushGoyal) July 10, 2018 -
చిట్టి చేతుల చిత్రాలు
చిట్టి చేతుల నుంచి జాలువారిన చిత్రాలివి. వారికి తోచిన అంశాలకు చిత్రరూపం ఇచ్చి పంపాలని 'సాక్షి.కామ్' ఇచ్చిన పిలుపునకు అనేకమంది చిన్నారులు స్పందించారు. చక్కటి బొమ్మలు గీసి వాటిని పంపారు. వాటిలోంచి కొన్నింటిని మీ కోసం అందిస్తున్నాం..