ఆరేళ్ల పాప కారిడార్‌లో ఆడుతుంటేనే చిన్న భయం ఉంటుంది. 17,500 అడుగుల ఎత్తు ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకోవాలనుకుంటే? పూణెకు చెందిన ఆరేళ్ల ఆరిష్క లడ్డా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్న అత్యంత చిన్నారిగా రికార్డు స్థాపించింది. తల్లితో కలిసి పదిహేను రోజులపాటు ఆరోహణ చేసి ఈ సాహసకార్యం పూర్తి చేసింది. కొంతమంది చిన్నారులు పుట్టుకతో చిరుతలు అని పాడుకోవాలి ఇలాంటి పిల్లలను చూస్తే.
ఆరేళ్ల ఐదు నెలల వయసు ఉన్న ఆరిష్కా లడ్డాకు నిజంగా తానేం ఘనకార్యం చేసిందో తెలియదు. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం బేస్ క్యాంప్‌కు చేరుకోవడం అంత చిన్న వయసులో అసాధ్యమైనా సాధ్యం చేసిందనీ తెలియదు. తల్లి చేయి పట్టుకుని ఎంత దూరమైనా సాగగలను అనే నమ్మకమే ఆరిష్కాను సముద్ర మట్టానికి 17,500 ఎత్తు ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేర్చింది. ఫూణెలో ఇప్పుడు ఆ పాప నివాసం ఉంటున్న కొత్‌రుడ్ ఏరియా, చదువుతున్న స్కూలు, బంధువులు అందరూ గర్వపడుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
‘12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు తీసుకెళ్లరు. ఎందుకంటే పర్వతారోహణ సమయంలో తమ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు వస్తున్నదో చిన్న వయసు పిల్లలు స్పష్టంగా చెప్పలేరు. అలా చెప్పకపోతే ప్రమాదం వస్తుంది. మేము రిజిస్టర్ చేసుకున్న సంస్థను నడిపే భగవాన్ చావ్లే మా పూణెకు చెందిన పర్వతారోహకుడు. మూడుసార్లు ఎవరెస్ట్ ఎక్కాడాయన. పర్వతారోహణలో విశేష అనుభవం ఉంది. ఆయన మార్గదర్శకత్వంలో నేను ఆరిష్కాతో పాటుగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లాలనుకున్నప్పుడు– మీ సొంత రిస్క్ మీద తీసుకువెళతాను. కాని పాప ఆరోగ్యంలో ఏ మాత్రం మార్పు వచ్చినా వెంటనే వెనక్కు పంపిస్తాను అని చెప్పాడు. నేను అంగీకరించాను. ఎందుకంటే నా కూతురు సాధించగలదన్న నమ్మకం ఉంది’ అంది ఆరిష్కా తల్లి డింపుల్ లడ్డా.
ప్రాథమిక శిక్షణ
ఆరిష్కా పూణెలో వారాంతంలో చుట్టుపక్కల కోటలను, కొండలను ట్రెక్ చేసేది. గత సంవత్సరం వైష్ణోదేవికి వెళ్లినప్పుడు కూడా హుషారుగా నడిచింది. ‘అది గమనించాకే బేస్‌క్యాంప్‌కు నడవగలదు అన్న నమ్మకం కుదిరింది’ అంది డింపుల్. ఏప్రిల్ మొదటివారంలో మొదలైన వీరి ఆరోహణ పోను 65 కిలోమీటర్లు రాను 65 కిలోమీటర్లు మొత్తం 130 కిలోమీటర్ల పొడవునా కాలినడకన సాగింది. అంత దూరమూ ఆరిష్కా తల్లికి సహకరిస్తూ హుషారుగా నడవగలిగింది.
ఖర్జూరాలు, డ్రైఫ్రూట్ లడ్డూలు
పర్వతారోహణ చేయాలంటే చాలా శక్తి కావాలి. అందుకు మంచి ఆహారం ఉండాలి. ‘మేము శాకాహారులం. పర్వతారోహణలో మాకు పప్పన్నం మాత్రమే శాకాహారంగా దొరికింది. అయితే పాపకు నేను ఖర్జూరాలు, డ్రైఫ్రూట్ లడ్డూలు ఎక్కువగా పెట్టాను. వేణ్ణీళ్లు ఎక్కువగా తాగేలా చూశాను. చలి నుంచి కాపాడటానికి 7 దొంతరల బట్టలు తొడిగి జాగ్రత్త తీసుకున్నాను. ఆ దారిలో మైనస్ 3 నుంచి మైనస్ 16 వరకు ఉష్ణోగ్రతలు ఉండేవి. ఒక్కోసారి పాప తలనొప్పి, చెవుల నొప్పి అని కంప్లయింట్ చేసేది. అయితే అదృష్టవశాత్తూ కొద్దిపాటి మందులతో కుదుట పడింది’ అని తెలిపింది డింపుల్.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చెయ్యూపుతూ నిలబడటంతో మన దేశం నుంచి అత్యంత చిన్న వయసులో అక్కడివరకూ చేరిన చిన్నారిగా ఆరిష్కా రికార్డు సాధించింది. ‘ఇక ఆమెను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దుతాను. ఎవరెస్ట్ ఎక్కేలా చేస్తాను. తోడుగా కావాలంటే నేనూ ఎక్కుతాను’ అని తెలిపింది డింపుల్. తండ్రి కౌస్తుభ్ ‘నా కూతురిని చూసి గర్వపడుతున్నాను. ఈ ఘనత అంతా తల్లీకూతుళ్లదే. నేను కేవలం సపోర్టింగ్ యాక్టర్‌ని’ అని నవ్వాడు.
ఆరిష్కాకు అభినందనలు.
పాపను చలి నుంచి కాపాడటానికి 7 దొంతరల బట్టలు తొడిగి జాగ్రత్త తీసుకున్నాను. ఆ దారిలో మైనస్ 3 నుంచి మైనస్ 16 వరకు ఉష్ణోగ్రతలు ఉండేవి. – డింపుల్, అరిష్కా తల్లి
Comments
Please login to add a commentAdd a comment