రాత్రి భోజనాల తరువాత మా చదువు మొదలయ్యేది. అప్పుడప్పుడూ ఆదివారాలు మధ్యాహ్నాలు కూడా. మధ్యాహ్నాలు పర్లేదు వెలుతురయ్య ఎల్లడై ఉన్న సమయం అది. రాత్రి సమయపు లెక్కలు వేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో అనవసరమైనది, అవసరానికి మించినదీ ఏది ఉండేది కాదు. రాత్రి చదువుకు వెలుతురు కావాలి అంటే దానికి బల్బు కావాలి, కరెంటు లాగడానికి వైర్ కావాలి, బల్బ్‌కు హోల్డర్ కావాలి, వైరుకు ప్లగ్గు కావాలి, ఒక స్విచ్చు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి. ఉన్న నలుగురైదుగురం తలా ఇంత అని వేసుకుని అవన్నీ కొనుక్కుని తెచ్చుకుని బిగించుకుని చదువుకు సిద్దం అయ్యేవాళ్ళం. పుల్లయ్యగాడు వాడి వాటాకు డబ్బులు కాక ఇంటినుండి కరెంటు గుంజి తెచ్చేవాడు. బల్బు వెలిగేది
ఆ విధంగా కాంచిపురముననొకడు కాంచనగుప్తుడను వైశ్యుడి దగ్గరి నుండి, వాటర్‌లూ యుద్దాలు, చిరపుంజిలో వర్షపాతము, గర్జించే నలభైలు, తళ్ళికోట చరిత్ర, గణిత సూత్రాలు, బీజీయ సమాసాలు, ఐ లే ఇన్ సారో డీప్ డిస్ట్రెస్స్డ్, మై గ్రీఫ్ ఏ ప్రౌడ్ మ్యాన్ హర్డ్, హిజ్ లుక్స్ వర్ కోల్డ్, హి గేవ్ మీ గోల్డ్… అనే శబ్ద పాండిత్యాన్ని బట్టీప్రవాహంలా ఒకళ్ళమీదికి ఒకళ్ళము ప్రవహింపజేసుకునేవాళ్ళము.
ఉదయం ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీదకి చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు. మాకు అప్పటికి అంతగా తెలియని పరకాయ ప్రవేశవిద్య ఒకటి వారు సాధన చేస్తూ ఉండేవారు. దానివలన చదువు భంగం అయ్యేది. విశ్వామిత్రుడికీ దూర్వాసుడికీ కూడా ఎదురవ్వని అనుభవాలు మావి
అన్వర్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment