కావలసినవి: పుట్టగొడుగులు (మష్రూమ్స్)-1 కప్పు, కాప్సికం ముక్కలు-1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు-1 టేబుల్ స్పూన్ (చిన్నగా కట్ చేసినవి),వెల్లుల్లి- 4 రెబ్బలు, టొమాటో కెచప్-2 టేబుల్ స్పూన్లు, వెనిగర్-1 టేబుల్ స్పూన్, సోయా సాస్-2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి-2 టేబుల్ స్పూన్లు, ఉప్పు-సరిపడా, నీళ్లు- కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు- గార్నిష్‌కి, నూనె-తగినంత
తయారీ: ముందుగా పుట్టగొడుగులను నూనెలో మీడియం మంట మీదే దోరగా వేయించాలి. అదే సమయంలో ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, సోయాసాస్, వెనిగర్‌ను ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మరో కళాయి తీసుకుని, 2 గరిటెల నూనె వేసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలతో పాటు.. క్యాప్సికమ్ ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఆపై పుట్టగొడుగుల్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం మిగిలిన టొమాటో కెచప్‌తో పాటు.. మొక్కజొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
కీమా పోహా
కావలసినవి: కీమా-పావు కప్పు (మెత్తగా ఉడికించుకోవాలి), అటుకులు(పోహా)-ముప్పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు-అర టీ స్పూన్ (చిన్నగా కట్ చేసుకోవాలి), కారం-అర టీ స్పూన్, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్-1 టీ స్పూన్ చొప్పున, గ్రీన్ బఠాణీ-కొద్దిగా (నానబెట్టి, ఉడికించినవి), పసుపు-అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు-3 టేబుల్ స్పూన్లు, టొమాటో, క్యారెట్ ముక్కలు-కొన్ని (చిన్నగా కట్ చేసినవి)
కరివేపాకు, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా.
తయారీ: ముందుగా 2 టీ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి. అందులో టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం ఉడికించిన కీమా వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి చిన్న మంటపై మగ్గనివ్వాలి. తర్వాత ఆమ్ చూర్ పౌడర్, గ్రీన్ బఠాణీ వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఈలోపు అటుకులు తడిపి, వెంటనే నీళ్లు లేకుండా గట్టిగా పిండి, కీమాలో వేసుకుని తిప్పుతూ ఉండాలి. కళాయికి మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా పుదీనా, కొత్తిమీర, కారప్పూస వంటివి వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది.
వాల్‌నట్ షీరా
కావలసినవి: రవ్వ-1 కప్పు (దోరగా వేయించుకోవాలి), వాల్‌నట్స్-1 కప్పు (మెత్తగా మిక్సీ పట్టుకోవాలి), కొబ్బరి కోరు- పావు కప్పు, ఏలకుల పొడి-కొద్దిగా, నెయ్యి- పావు కప్పు, పంచదార-1 కప్పు (అభిరుచిని బట్టి మరికొంత పెంచుకోవచ్చు), పాలు-రెండున్నర కప్పులు, చాక్లెట్ పౌడర్-పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు-గార్నిష్ కోసం(అభిరుచిని బట్టి).
తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. బౌల్‌లో పాలు పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఏలకుల పొడి, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. కొంత సేపు తర్వాత చాక్లెట్ పౌడర్, వాల్‌నట్స్ గుజ్జు వేసుకుని కలుపుతూ ఉండాలి. రవ్వ, కొబ్బరి కోరు వేసుకుని దగ్గర పడేదాక గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా నెయ్యి వేసుకుని బాగా దగ్గర పడేదాకా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందీ వాల్‌నట్ షీరా. అభిరుచిని బట్టి పైన మరిన్ని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment