చంద్రుడిపై పేదరాసి పెద్దమ్మ చెట్టుకింద కూర్చుని కథలు చెబుతుందని చిన్నప్పుడు విన్నాం, పెద్దయ్యాక చంద్రుడిపై ఎలాంటి జీవి పెరిగే వాతావరణం లేనందున చెట్లు లేవని తెలుసుకున్నాం! కానీ ఇప్పటివరకు అసాధ్యమని భావిస్తున్న పనిని తేలిగ్గా చేసినట్లు చైనా ప్రకటించుకుంది. వాతావరణమే ఉండని చంద్రుడిపై చెట్లు పెంచామని, తమ లూనార్ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగం దిగ్విజయమైందని వెల్లడించింది. చైనా అంతేనండీ, ఏదైనా ఇలా చిటికలో చేసేస్తుంది అని కొందరు మెచ్చుకుంటుంటే, కొందరేమో చైనా మాటలు, వస్తువులు, పనులను నమ్మే వీల్లేదని, ఈ చెట్ల విషయం కూడా అనుమానాస్పదమేనని డౌట్ పడుతున్నారు.
ఎవరేమన్నా చైనా సైంటిస్టులు మాత్రం తమ లూనార్ మిషన్‌లో పెంచిన చెట్ల తాలుకూ పిక్చర్లను బయటపెట్టి సంబరపడుతున్నారు. అసలు చంద్రుడిపై వాతావరణమే లేనప్పుడు చెట్లు ఎలా పెంచుతారన్నది బేసిక్ అనుమానం. అంటే నేరుగా చంద్రుడిపై విత్తనాలు నాటి మెలకెత్తించడం కాదు.. ఒక కంటైనర్ లో చెట్లు పెరిగేందుకు కావాల్సిన పోషకాలను ఉంచి కృత్రిమ వాతావరణ వ్యవస్థ ను కంటైనర్‌లో కల్పించి దాన్ని లూనార్ ప్రోబ్‌తో పాటు చంద్రుడిపైకి పంపారు. అక్కడ చంద్ర ఉపరితలంపై ఈ కంటైనర్లను జారవిడిచి పరిశీలిస్తే మొలకలు వచ్చినట్లు గమనించారు.
ఓస్.. ఇంతేనా అనకండి, అంతరిక్ష ప్రయోగాల్లో ఇది పెద్ద ముందడుగు. త్వరలో చైనా చంద్రుడిపై ఒక బేస్ కట్టే యోచనలో ఉంది. అందుకు సిద్ధమయ్యే యత్నాల్లో ఇది కూడా ఒక భాగమేనట. ప్రస్తుత విషయానికి వస్తే కొన్ని రోజులు బాగా పెరిగిన ఈ మొలకలు సదరు కంటైనర్‌లో బ్యాటరీ అయిపోగానే చంద్రుడిపై ఉండే తీవ్ర చలి వాతావరణ ప్రభావానికి చనిపోయాయి. కానీ ప్రయోగం సక్సెసని, రాబోయే రోజుల్లో నేరుగా చంద్రుడిపై చెట్లు పెంచేస్తామని చైనా సైంటిస్టులు ధీమాగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment