lunar mission
-
Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్..
శ్రీహరికోట: చంద్రయాన్–3 మిషన్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తన కార్యాచరణను పూర్తి చేసి స్లీప్ మోడ్‌లోకి వెళ్లిందని ఇస్రో శనివారం తెలిపింది. లూనార్ మిషన్‌లోని రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయని, చంద్రుడి ఉపరితలంపై రాత్రిళ్లు ఉండే అతిశీతల పరిస్థితులను తట్టుకుని ఉండేలా వాటిని స్లీప్ మోడ్‌లోకి పంపుతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. ల్యాండర్ చుట్టూ 100 మీటర్ల మేర రోవర్ ఇప్పటివరకు ప్రయాణించిందని చెప్పారు. అందులోని రిసీవర్‌ను ఆన్‌లోనే ఉంచి, పేలోడ్స్‌ను ఆఫ్ చేసి ఉంచుతామన్నారు. అందులోని డేటా బేస్ ల్యాండర్ ద్వారా ఇప్పటికే తమకు చేరిందన్నారు. ప్రస్తుతం వీటి బ్యాటరీ పూర్తి స్థాయిలో చార్జి అయి ఉన్నాయని, ఈ నెల 22వ తేదీన తిరిగి అక్కడ సూర్య కిరణాలు ప్రసరించిన తర్వాత వాటికి తిరిగి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. చంద్రుడిపై భారత రాయబారిగా రిసీవర్ ఎప్పటికీ అక్కడే ఉంటుందని చెప్పారు. Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 -
చంద్రుడిపై అడుగు పెట్టకుండానే కుప్పకూలిన రష్యా ల్యాండర్
మాస్కో: రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైంది. లూనా-25 సాంకేతిక సమస్య కారణంగా చంద్రుడిపై క్రాష్ లాండింగ్ అయినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ వెల్లడించింది. చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా -25లో శనివారం సాంకేతిక సమస్య తలెత్తడంతో చంద్రుడిపై కుప్పకూలింది. చంద్రుడికి సమీపంగా వెళ్లిన తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ముందు ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ నెల 21న ఇది చంద్రుడిపై కాలు మోపాల్సి ఉండగా అంతలోనే ఇలా జరగడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రష్యా శాస్త్రవేత్తలు. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ దాదాపు 50 ఏళ్ల విరామం తరువాత చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా -25ని ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు చేసిన ఈ ప్రయోగంపై రష్యా మొదటి నుంచి చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ చివరి నిముషంలో క్రాష్ ల్యాడింగ్ జరగడం దురదృష్టకరమంటోంది రోస్ కాస్మోస్. మరోపక్క భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం చంద్రయాన్-3 అన్ని దశలను పూర్తి చేసుకుని చంద్రుడికి అత్యంత సమీపంలో పరిభ్రమిస్తుంది. నిర్దేశిత సమయంలోనే చంద్రయాన్-3 చంద్రుడిపై కాలు మోపుతుందని శనివారం ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇది కూడా చదవండి: దోపిడీకి వచ్చి, అందరినీ చూసి.. ‘ఇదేందిది’ అంటూ తోక ముడిచిన దొంగ! -
చంద్రుడిపై చైనా చెట్లు
చంద్రుడిపై పేదరాసి పెద్దమ్మ చెట్టుకింద కూర్చుని కథలు చెబుతుందని చిన్నప్పుడు విన్నాం, పెద్దయ్యాక చంద్రుడిపై ఎలాంటి జీవి పెరిగే వాతావరణం లేనందున చెట్లు లేవని తెలుసుకున్నాం! కానీ ఇప్పటివరకు అసాధ్యమని భావిస్తున్న పనిని తేలిగ్గా చేసినట్లు చైనా ప్రకటించుకుంది. వాతావరణమే ఉండని చంద్రుడిపై చెట్లు పెంచామని, తమ లూనార్ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగం దిగ్విజయమైందని వెల్లడించింది. చైనా అంతేనండీ, ఏదైనా ఇలా చిటికలో చేసేస్తుంది అని కొందరు మెచ్చుకుంటుంటే, కొందరేమో చైనా మాటలు, వస్తువులు, పనులను నమ్మే వీల్లేదని, ఈ చెట్ల విషయం కూడా అనుమానాస్పదమేనని డౌట్ పడుతున్నారు. ఎవరేమన్నా చైనా సైంటిస్టులు మాత్రం తమ లూనార్ మిషన్‌లో పెంచిన చెట్ల తాలుకూ పిక్చర్లను బయటపెట్టి సంబరపడుతున్నారు. అసలు చంద్రుడిపై వాతావరణమే లేనప్పుడు చెట్లు ఎలా పెంచుతారన్నది బేసిక్ అనుమానం. అంటే నేరుగా చంద్రుడిపై విత్తనాలు నాటి మెలకెత్తించడం కాదు.. ఒక కంటైనర్ లో చెట్లు పెరిగేందుకు కావాల్సిన పోషకాలను ఉంచి కృత్రిమ వాతావరణ వ్యవస్థ ను కంటైనర్‌లో కల్పించి దాన్ని లూనార్ ప్రోబ్‌తో పాటు చంద్రుడిపైకి పంపారు. అక్కడ చంద్ర ఉపరితలంపై ఈ కంటైనర్లను జారవిడిచి పరిశీలిస్తే మొలకలు వచ్చినట్లు గమనించారు. ఓస్.. ఇంతేనా అనకండి, అంతరిక్ష ప్రయోగాల్లో ఇది పెద్ద ముందడుగు. త్వరలో చైనా చంద్రుడిపై ఒక బేస్ కట్టే యోచనలో ఉంది. అందుకు సిద్ధమయ్యే యత్నాల్లో ఇది కూడా ఒక భాగమేనట. ప్రస్తుత విషయానికి వస్తే కొన్ని రోజులు బాగా పెరిగిన ఈ మొలకలు సదరు కంటైనర్‌లో బ్యాటరీ అయిపోగానే చంద్రుడిపై ఉండే తీవ్ర చలి వాతావరణ ప్రభావానికి చనిపోయాయి. కానీ ప్రయోగం సక్సెసని, రాబోయే రోజుల్లో నేరుగా చంద్రుడిపై చెట్లు పెంచేస్తామని చైనా సైంటిస్టులు ధీమాగా ఉన్నారు. -
చంద్రుడిపై చైనా కీలక ప్రయోగం
బీజింగ్: చంద్రుడి ఉపరితలంపై నమూనాలు సేకరించే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు మంగళవారం మానవరహిత రాకెట్‌ను విజయవంతంగా చందమామ పైకి పంపింది. తద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టిన అగ్రరాజ్యం అమెరికా, రష్యాల సరసన నిలిచింది. చైనా అధికారిక మీడియా సీజీటీఎన్ వివరాల ప్రకారం.. హైనన్ సదరన్ ప్రావిన్స్‌లోని వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ ద్వారా ఉదయం నాలుగున్నర గంటల(స్థానిక కాలమానం ప్రకారం) చాంగ్-5 మిషన్‌ను డ్రాగన్ దేశం విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడి ఉపరితలంపై గల నమూనాలు భూమి మీదకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. చాంగ్-5 మిషన్ చైనీస్ చంద్ర దేవత పేరు మీదుగా ఈ మిషన్‌కు చాంగ్-5 అని నామకరణం చేశారు. దీనిలో ఒక ఆర్బిటార్, లాండర్, అసెండర్, రిటర్నర్ ఉంటాయి. వీటన్నింటి బరువు కలిపి మొత్తంగా దాదాపు 8.2 టన్నులు ఉంటుంది. చంద్ర కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత లాండర్-అసెండర్, ఆర్బిటార్- రిటర్నర్ విడిపోతాయి. ఇక చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిటార్- రిటర్నర్ పరిశోధనలు సాగిస్తే, లాండర్- అసెండర్ చంద్రుడికి సమీపంలో గల ఓషన్ ఆఫ్ స్టార్మ్స్ వాయువ్య ప్రాంతంలో దిగి నమూనాలు సేకరిస్తుంది. శిలలు, మట్టి సేకరించిన తర్వాత తిరిగి ఇవి వాహననౌకలోకి చేరుకుంటాయి. చంద్రగ్రహంపై అడుగుపెట్టిన 48 గంటల్లో రోబోటిక్ ఆర్మ్ తవ్వకాలు మొదలుపెడుతుంది. సుమారు 2 కిలోల మేర నమూనాలు సేకరించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం జరుగనుందని సీజీటీఎన్ వెల్లడించింది.(చదవండి: చైనా కంపెనీపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు) భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు ఈ మిషన్ ద్వారా భవిష్యత్తులో చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు వీలు కలుగుతుందని చైనా జాతీయ అంతరిక్ష సంస్థ(సీఎన్ఎస్ఏ) లూనార్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ స్పేస్ ప్రోగ్రాం సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ పీ జెయూ అన్నారు. మానవరహిత రాకెట్‌ను పంపడం ద్వారా సాంకేతికంగా మరో ముందడుగు వేశామని, చాంగ్-5 మిషన్ విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై, వాతావరణ పరిస్థితులపై మరింత లోతుగా అధ్యయనం చేయగలమని పేర్కొన్నారు. -
మళ్లీ జాబిలి వైపు అడుగులు
వాషింగ్టన్: చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టి దాదాపు 50 ఏళ్లు పూర్తవుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1968లో ‘అపోలో–11’ ద్వారా వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకేల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌లను చంద్రుడిపైకి పంపింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చంద్రుడిపై వ్యోమగాములను పంపాలని నాసా నిర్ణయించింది. 2024 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడమే నాసా లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం జపాన్ సహకారం కూడా తీసుకుంటోంది. నాసా చేపట్టే మూన్ ప్రాజెక్టులో భాగంగా జపాన్ వ్యోమగాములు కూడా చందమామపైకి వెళ్లనున్నారు. ఇందుకోసం జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జక్సా’ ఏర్పాట్లు చేస్తోంది. చందమామపై మళ్లీ కాలు పెట్టడం, జాబిల్లి చుట్టూ ఆర్బిటర్లు తిరిగే విషయంలో రెండు దేశాలూ భాగస్వామ్యం కానున్నాయి. -
చంద్రుడి మీదకు మానవరహిత అంతరిక్ష నౌక
చైనా: చంద్రుడి మీదకు మానవ రహిత అంతరిక్ష నౌకను సిష్వాన్ ప్రాంతంలోని షిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి చైనా దేశం శుక్రవారం ప్రయోగించింది. చంద్ర మండలంపైకి చైనా తొలి ప్రయోగం చేసింది. చంద్రమండలంపైకి ప్రయోగించిన అంతరిక్ష నౌకకు ఎలాంటి పేరును పెట్టలేదు. చంద్రుడి కక్ష్య చుట్టూ తిరిగాక స్పేస్ క్రాఫ్ట్ భూమికి దిగి రానుంది. మానవ రహిత అంతరిక్ష నౌకను ప్రయోగించిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ వెలుపల కొన్ని సమస్యలు తలెత్తినట్టు చైనా అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. దాంతో ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత చంద్రుడి కక్ష్య గమనాన్ని శాస్త్రజ్క్షులు తగ్గించినట్టు తెలుస్తోంది.