ఉదయాన్నే కాఫీ తాగందే కొంతమందికి ఏమి తోచదు. మరికొంతమందికి కాస్తంత కాఫీ, అలసిన శరీరానికి ఓ టానిక్ లా పనిచేస్తుంది. ఇంకొందరికి కాఫీ అంటే ఇష్టంతో.. కప్పుల మీద కప్పుల కాఫీ తాగేస్తుంటారు. మరి కాఫీ తాగడం మంచిదా? కాదా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికే.. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సైంటిస్టులు మానవ శరీరంపై కాఫీ ప్రభావం గురించి పరిశోధన చేపట్టారు. దాదాపు 200కు పైగా గణాంకాలు సేకరించారు.
కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ తాగే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాదు, క్యాన్సర్‌తో పాటు కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గాయని వెల్లడించారు. అయితే యూకే ’జాతీయ ఆరోగ్య పథకం’ (ఎన్‌హెచ్‌ఎస్) ప్రకారం.. గర్భిణులు రోజుకు 200 మిల్లీ గ్రాము కన్నా ఎక్కువగా, అంటే రెండు మగ్గుల ఇన్‌స్టెంట్ కాఫీ కన్నా ఎక్కువ తీసుకుంటే వారికి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని సూచించారు. కాఫీపై జరిపిన పరిశోధనల్లో రోజుకు 400 మి.గ్రా. లేదా అంతకన్నా తక్కువ కెఫీన్ – లేదా 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగితే ఎలాంటి ముప్పూ లేదని తేలింది. పరిమితంగా కాఫీ సేవించడం సురక్షితమే.
Comments
Please login to add a commentAdd a comment