ఏకనాథ్ పోర్టే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్. కల్బాదేవి ప్రాంతంలోని శుర్తీ హోటల్ జంక్షన్(ముంబై) దగ్గర డ్యూటీలో ఉన్నాడు. (ఈ ప్లేస్‌ను గుర్తుపెట్టుకోండి). టూ వీలర్ వెనుక హెల్మెట్ లేకుండా వెళుతున్న ఒక మహిళను ఆపాడు. మారిన నిబంధనల ప్రకారం బైక్ వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి. లేదంటే ఫైన్ కట్టాలి. ఫైన్ కట్టమని అడిగే టైమ్ కూడా ఆ మహిళ ఏకనాథ్‌కి ఇవ్వలేదు. ‘హెల్మెట్ పెట్టుకోకపోతే నీకేమైంది?’ అని.. మీద పడి కొట్టేసింది. అతడి చొక్కా చింపేసింది. చట్టం పేజీలు చిరిగిపోయినట్లుగా చిరిగిపోయాడు కానిస్టేబుల్ ఏకనాథ్. పోలీసులే భయపడేంతగా కొట్టేసింది! ఆమె పేరు సాత్విక (30). బండి నడుపుతున్న అతని పేరు మొహిసిన్ షేక్. కానిస్టేబుల్‌ని ఆమె కొడుతుంటే అడ్డు చెప్పకపోగా ఫోన్లో రికార్డ్ చేశాడు షేక్ గారు. ఆమె అంత చెయ్యి చేసుకుంటున్నా ఏకనాథ్ నోరెత్తలేదు. దెబ్బలు తింటూనే ‘మేడమ్’ అని ఆమెకు, ‘సర్’ అని అతడికి.. హెల్మెట్ ఎందుకు తప్పనిసరో చెబుతున్నాడు. తర్వాత వాళ్లిద్దరూ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేంతగా ఆమె ఏకనాథ్‌ని ‘అసాల్ట్’ చేసింది.
ఆమె అతడిని కొట్టడం శుర్తీ హోటల్ జంక్షన్ దగ్గర ముంబై నగర పౌరులు గుమికూడి చూశారు. పరువు పోయిందని అనుకోలేదు ఏకనాథ్. డ్యూటీ పరువు నిలబెట్టానని అనుకున్నాడు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు అయింది. నిన్న ఏకనాథ్ మళ్లీ అదే జంక్షన్‌లో డ్యూటీ చేస్తున్నారు. అక్కడికి కొలాబా డివిజనల్ ఎ.సి.పి లతా ఢాండే వచ్చారు. కారు దిగి నేరుగా ఏకనాథ్ దగ్గరికి వెళ్లారు. అతడు దెబ్బలు తిన్న సేమ్ స్పాట్ లో నిలుచోమని చెప్పి, అందరూ చూస్తుండగా అతడికి పూలగుచ్ఛం అందించారు. భుజాల చుట్టూ శాలువా కప్పారు. అభినందనలు తెలిపారు. సాత్విక అనే ఆ పౌర మహిళ ఎంత రూడ్ గా ప్రవర్తించినప్పటికీ ఏకనాథ్ సహనం కోల్పోకుండా ఉన్నందుకు అతడికి దక్కిన గౌరవం అది. దెబ్బలు తింటున్నప్పుడు ఎలా ఉన్నాడో, డిపార్ట్‌మెంట్ సత్కారం అందుకుంటున్నప్పుడూ అలాగే.. డ్యూటీ మైండెడ్ గా.. ఉన్నాడు ఏకనాథ్!
Comments
Please login to add a commentAdd a comment