బూడిద గుమ్మడితో ఇన్ని లాభాలా? కానీ వీళ్లు మాత్రం జాగ్రత్త! | Cool Vegetable Ash Gourd juice Health Benefits uses | Sakshi
Sakshi News home page

బూడిద గుమ్మడితో ఇన్ని లాభాలా? కానీ వీళ్లు మాత్రం జాగ్రత్త!

Published Tue, Mar 26 2024 6:01 PM | Last Updated on Tue, Mar 26 2024 6:18 PM

Cool Vegetable Ash Gourd juice Health Benefits uses - Sakshi

ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నపేరు బూడిద గుమ్మడికాయ. వడియాలకోసమో, లేక గుమ్మానికి దిష్టికోసమో, స్వీట్‌కోసమే వినియోగించే గుమ్మడికాయ  అనుకుంటే పొరబాటే.  శరీరంలోని వ్యర్ధాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. పరగడుపున దీని జ్యూస్‌ తాగితే.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

దీన్నే వింటర్‌మిలన్‌ అనీ,  సంస్కృతంలో కుష్మాండ , బృహత్ఫల, ఘృణావాస, గ్రామ్యకర్కటి, కర్కారు అని కూడా అంటారు.  ఇది ఆరిజన్‌ ఎక్కడ అనేదానిపై స్పష్టత లేనప్పటికీ జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో-మలేషియాలో పుట్టిందని ఊహిస్తున్నారు.

అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ  ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద పానీయంగా భావించే గుమ్మడికాయ జ్యూస్‌తో ప్రస్తుతం, పొట్ట సమస్యలు, కాలేయ సమస్యలు , చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది.  చాలా మందికి రుచి నచ్చకపోవచ్చు, కానీ సప్లిమెంట్లు ఇతర ఆహార పదార్థాలలో లేని ఔషధ విలువలు ఇందులో చాలా ఉన్నాయి.

గుమ్మడికాయ జ్యూస్‌ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాలలో  ఒకటి  ఇందులోని బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తుందని  నమ్మకం.  

బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది.   4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ , కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్  విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సీ ఉంటాయి. 

బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది 
 
బూడిద గుమ్మడికాయ రసంలో  యాంజియోలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకుమంచిది.  డిప్రెషన్‌, ఆందోళనతో బాధపడేవారికి చాలా  మంచిది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి  బెస్ట్‌ ఆప్షన్  బూడిద గుమ్మడికాయ జ్యూస్‌.  కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫాట్ లక్షణాలు పైగా ఫైబర్‌ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఉబకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.గుమ్మడికాయలో విటమిన్ B3  అధికం. శక్తినిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌లెవెల్స్ ను  తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి మేలు చేస్తుంది. యాంటి ఏజింగ్‌గా పనిచేస్తుంది. ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ కేన్సర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది. 

ఎవరు తాగకూడదు
ఈ ప్రపంచంలో ప్రతిదానికీ లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. దీర్ఘంకాలం తీసుకుంటే లోహ మూలకాలు పేరుకు పోతాయి. జ్వరంతో బాధపడుతున్నవారు, చలువ గుణం కలిగి ఉన్నందున జలుబుతో బాధపడుతున్న వారు తినకూడదు. బ్రోన్కైటిస్ ,ఆస్తమా పేషంట్లు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా  గర్భిణి స్త్రీలు వైద్యుల సలహా మేరకే  దీన్ని తీసుకోవాలి. మితంగా తీసుకున్నంతవరకే  ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుంది. ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ దీన్ని మర్చిపోకూడదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement